జయాంగని, మిథాలీ
గాలె: కెప్టెన్ మిథాలీ రాజ్ (143 బంతుల్లో 125 నాటౌట్; 14 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్ అత్యుత్తమ వ్యక్తిగత స్కోరుతో అజేయ శతకం సాధించినా... బౌలర్ల వైఫల్యంతో ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టుకు ఓటమి ఎదురైంది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేయలేకపోయినా 2–1తో దక్కించుకుంది. తొలుత భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఖాతా తెరవకుండానే యువ ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్ (0) పెవిలియన్ చేరడంతో తొలి ఓవర్‌లోనే క్రీజులోకొచ్చిన మిథాలీ చివరి వరకు అజేయంగా నిలిచి జట్టుకు మంచి స్కోరు అందించింది.
స్మృతి మంధాన (51; 6 ఫోర్లు)తో కలిసి రెండో వికెట్‌కు 102 పరుగులు... హర్మన్ ప్రీత్ కౌర్ (17)తో మూడో వికెట్‌కు 45 పరుగులు... దీప్తి శర్మతో ఐదో వికెట్‌కు 92 పరుగులు జత చేసింది. ఈ క్రమంలో మిథాలీ 126 బంతుల్లో ఏడో వన్డే సెంచరీ పూర్తి చేసుకుంది. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.5 ఓవర్లలో 7 వికెట్లకు 257 పరుగులు చేసి మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే 0–2తో సిరీస్ కోల్పోయిన లంక జట్టుకు చివరి మ్యాచ్‌లో గెలుపు కాస్త ఊరటనిచ్చింది. కెప్టెన్ జయాంగని ఆటపట్టు (133 బంతుల్లో 115; 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ సాధించగా... హాసిని పెరీరా (45; 4 పోర్లు, 2 సిక్స్‌లు) ఆకట్టుకుంది. భారత బౌలర్లలో జులన్ గోస్వామి, మాన్సి జోషి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment