ఢాకా: దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (శాఫ్) కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్‌కు భంగపాటు ఎదురైంది. అందివచ్చిన అవకాశాలను గోల్స్‌గా మలచడంలో విఫలమైన భారత జట్టు ఫైనల్లో 1–2తో మాల్దీవులు చేతిలో ఓడింది. గ్రూప్ దశలో 2–0తో మాల్దీవులను ఓడించిన భారత్ శనివారం జరిగిన తుదిపోరులో మాత్రం తడబడింది. ఆద్యంతం భారత్ ఆధిపత్యమే కొనసాగినా విజయం మాత్రం ప్రత్యర్థిని వరించింది. వచ్చిన కొద్దిపాటి అవకాశాలను చక్కగా వినియోగించుకున్న మాల్దీవులు రెండో సారి శాఫ్ కప్‌ను ఎగరేసుకుపోయింది.
భారత్ తరఫున సుమీత్ పస్సీ (92వ ని.లో) ఏకైక గోల్ చేయగా... మాల్దీవులు తరఫున ఇబ్రహీం (19వ ని.లో), అలీ ఫసీర్ (66వ ని.లో) చెరో గోల్ చేశారు. ఈ టోర్నీలో అజేయంగా ఫైనల్ చేరిన భారత్ తుదిపోరులో సమన్వయ లోపంతో చతికిలపడింది. ఆట ఆరంభమైన ఐదో నిమిషంలోనే వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుంది. నిఖిల్ అందించిన పాస్‌ను రంజన్ సింగ్ హెడర్ ద్వారా గోల్‌గా మలిచే ప్రయత్నం చేసినా అది సఫలం కాలేదు. 30వ నిమిషంలో ఫరూఖ్ గోల్‌పోస్ట్‌కు అతిసమీపంలో బంతిని దొరకబుచ్చుకున్నా నియంత్రణ కోల్పోయి దాన్ని వృథా చేశాడు. ఆ తర్వాత కూడా భారత్ దాడులను కొనసాగించినా మాల్దీవులు రక్షణ పంక్తి వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది. ఇంజ్యూరీ టైంలో సుమీత్ గోల్ చేసినా అప్పటికే ఆలస్యమైంది.
Comments
Please login to add a commentAdd a comment