రోహిత్‌ను అవుట్ చేసిన ఆనందంలో టాప్
లండన్: లార్డ్స్‌లో సీన్ రివర్స్ అయ్యింది. తొలి వన్డేలో మన పేస్‌కు తలవంచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌లాగే... ఇక్కడ ప్రత్యర్థి నిప్పులు చెరిగే బౌలింగ్‌కు భారత్ కుదేలైంది. దీంతో భారత్ రెండో వన్డేలో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. మొయిన్ అలీ (64 బంతుల్లో 47; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), విల్లీ (49 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.
చహల్ (4/47) తిప్పేయగా, బుమ్రా, పాండ్యా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ 38.5 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.జడేజా (29), హార్దిక్ పాండ్యా (29) టాప్‌స్కోరర్లుగా నిలువగా, రీస్ టాప్లీ 6 వికెట్లు పడగొట్టాడు. కోహ్లి గాయం నుంచి కోలుకోవడంతో రెండో వన్డే బరిలోకి దిగాడు. దీంతో శ్రేయస్‌ను తుదిజట్టు నుంచి తప్పించారు. ఆఖరి వన్డే 17న మాంచెస్టర్‌లో జరుగుతుంది.
ఆరంభానికి చహల్ తూట్లు
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రాయ్, బెయిర్‌స్టో జాగ్రత్త పడ్డారు. దీంతో తొలి 4 ఓవర్లలో 17 పరుగులే చేశారు. ఐదో ఓవర్లో రాయ్ బౌండరీ, సిక్సర్ బాదడంతో 13 పరుగులు వచ్చాయి. తర్వాత కూడా ఇద్దరు ఆచితూచి ఆడటంతో పరుగుల వేగం మందగించింది. 9వ ఓవర్ వేసిన పాండ్యా తన తొలి ఓవర్లోనే జేసన్ రాయ్ (33 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్)ని అవుట్ చేశాడు. 10 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు 46/1.
చహల్ (4/47)
అనంతరం స్పిన్నర్ చహల్ బౌలింగ్‌కు దిగడంతో ఇంగ్లండ్ కష్టాలు పెరిగాయి. ధాటిగా ఆడగలిగే బెయిర్‌స్టో (38 బంతుల్లో 38; 6 ఫోర్లు)తో పాటు జో రూట్ (11)ను తన వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. బట్లర్(4) షమీ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ 87 పరుగులకే కీలకమైన 4 వికెట్లను కోల్పోయింది. చహల్ వేసిన 20వ ఓవర్లో రెండు బౌండరీలు బాదిన స్టోక్స్ ఆ స్పిన్నర్ మరుసటి ఓవర్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.
ఆదుకున్న అలీ, విల్లీ
ఇంగ్లండ్ 102 స్కోరుకే ప్రధానమైన సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఊరించే బంతులు వేసిన హార్దిక్ పాండ్యా... లివింగ్‌స్టోన్ (33 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను బోల్తా కొట్టించాడు. దీంతో అలీతో జతకట్టిన డేవిడ్ విల్లే పరుగుల బాధ్యతను పంచుకున్నారు. ఒక పరుగు వద్ద విల్లీ ఇచ్చిన క్యాచ్‌ను ప్రసిధ్ వదిలేయడం జట్టుకు కలిసొచ్చింది. అయితే కట్టుదిట్టమైన భారత బౌలింగ్ వల్ల రన్‌రేట్ మందగించింది. ఇద్దరు ఏడో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 200పైచిలుకు చేరాక అలీ, కాసేపటికి విల్లీ అవుట్ కావడంతో డెత్ ఓవర్లలో తగినన్ని పరుగులు రాలేదు.
టాప్ లేపిన టాప్లీ
ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన ఉత్సాహం ఆవిరయ్యేందుకు ఎంతో సేపు పట్టలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ (0), శిఖర్ ధావన్ (9) టాప్లీ పేస్‌కు తలవంచారు. ఆ వెంటనే రిషభ్ పంత్ (0)ను కార్స్ ఖాతా తెరువనీయలేదు. అయినా విరాట్ కోహ్లి (16) ఉండటంతో కొంత నమ్మకం ఉన్నా, అతని ఆటకు విల్లీ చెక్ పెట్టాడు. సూర్యకుమార్ (29 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (44 బంతుల్లో 29; 2 ఫోర్లు) కొద్ది సేపు పోరాడటంతో స్కోరు వంద దాటింది! జట్టు స్కోరు 140 పరుగుల వద్ద జడేజా అవుట్ కావడంతో భారత్ ఆశలు కోల్పోయింది.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 23; బెయిర్‌స్టో (బి) చహల్ 38; రూట్ (ఎల్బీ) (బి) చహల్ 11; స్టోక్స్ (ఎల్బీ) (బి) చహల్ 21; బట్లర్ (బి) షమీ 4; లివింగ్‌స్టోన్ (సి) సబ్–శ్రేయస్ (బి) పాండ్యా 33; అలీ (సి) జడేజా (బి) చహల్ 47; విల్లీ (సి) సబ్–శ్రేయస్ (బి) బుమ్రా 41; ఓవర్టన్ నాటౌట్ 10; కార్స్ (ఎల్బీ) (బి) ప్రసిధ్ 2; టాప్లీ (బి) బుమ్రా 3; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (49 ఓవర్లలో ఆలౌట్) 246.
వికెట్ల పతనం: 1–41, 2–72, 3–82, 4–87, 5–102, 6–148, 7–210
బౌలింగ్: షమీ 10–0–48–1, బుమ్రా 10–1–49–2, హార్దిక్ 6–0–28–2, ప్రసిధ్ 8–0–53–1, చహల్ 10–0–47–4, జడేజా 5–0–17–0.
Comments
Please login to add a commentAdd a comment