సాకేత్ మైనేని, రోహన్ బోపన్న
క్రాల్‌జివో (సెర్బియా): విజయావకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన డబుల్స్ మ్యాచ్‌లో భారత జంట ఓడిపోయింది. డేవిస్‌కప్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్‌లో భాగంగా శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న–సాకేత్ మైనేని జోడీ 6–7 (5/7), 2–6, 6–7 (4/7)తో నికోలా మిలోజెవిచ్–డానిలో పెట్రోవిచ్ (సెర్బియా) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. ఈ గెలుపుతో ఆతిథ్య సెర్బియా జట్టు 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఫలితం తేలిపోవడంతో ఆదివారం జరిగే రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు నామమాత్రం కానున్నాయి.
రెండు గంటల 22 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో భారత జోడీ కీలకదశలో అనవసర తప్పిదాలు చేసి మ్యూలం చెల్లించుకుంది. మూడో సెట్‌లో 5–3తో ఆధిక్యంలో ఉండి సెట్ పాయింట్ కూడా సంపాదించిన భారత జంట దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. సెట్ పాయింట్‌ను కాపాడుకోవడంతోపాటు సెర్బియా ద్వయం సాకేత్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఆ తర్వాత రెండు జంటలు తమ సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో మూడో సెట్‌లో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో సెర్బియా జోడీ పైచేయి సాధించడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.
సెర్బియా చేతిలో ఓడినప్పటికీ వచ్చే ఏడాది కొత్త పద్ధతిలో, కొత్త నిబంధనలతో 18 జట్ల మధ్య నిర్వహించనున్న డేవిస్ కప్ ఫైనల్స్ ఈవెంట్‌కు భారత్ అర్హత సాధించే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో 24 జట్ల మధ్య ఇంటా, బయటా పద్ధతిలో క్వాలిఫయింగ్ ఈవెంట్ జరుగనుంది. క్వాలిఫయింగ్ టోర్నీలో నెగ్గిన 12 జట్లు నవంబర్‌లో జరిగే ఫైనల్స్‌కు అర్హత పొందుతాయి. ఈ సీజన్‌లో సెమీస్‌కు చేరిన నాలుగు జట్లకు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. మరో రెండు జట్లకు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) వైల్డ్ కార్డు ఇస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment