Saket Maine
-
డబుల్స్‌లోనూ నిరాశే
క్రాల్‌జివో (సెర్బియా): విజయావకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన డబుల్స్ మ్యాచ్‌లో భారత జంట ఓడిపోయింది. డేవిస్‌కప్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్‌లో భాగంగా శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న–సాకేత్ మైనేని జోడీ 6–7 (5/7), 2–6, 6–7 (4/7)తో నికోలా మిలోజెవిచ్–డానిలో పెట్రోవిచ్ (సెర్బియా) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. ఈ గెలుపుతో ఆతిథ్య సెర్బియా జట్టు 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఫలితం తేలిపోవడంతో ఆదివారం జరిగే రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు నామమాత్రం కానున్నాయి. రెండు గంటల 22 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో భారత జోడీ కీలకదశలో అనవసర తప్పిదాలు చేసి మ్యూలం చెల్లించుకుంది. మూడో సెట్లో 5–3తో ఆధిక్యంలో ఉండి సెట్ పాయింట్ కూడా సంపాదించిన భారత జంట దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. సెట్ పాయింట్‌ను కాపాడుకోవడంతోపాటు సెర్బియా ద్వయం సాకేత్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఆ తర్వాత రెండు జంటలు తమ సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో మూడో సెట్లో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో సెర్బియా జోడీ పైచేయి సాధించడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. సెర్బియా చేతిలో ఓడినప్పటికీ వచ్చే ఏడాది కొత్త పద్ధతిలో, కొత్త నిబంధనలతో 18 జట్ల మధ్య నిర్వహించనున్న డేవిస్ కప్ ఫైనల్స్ ఈవెంట్‌కు భారత్ అర్హత సాధించే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో 24 జట్ల మధ్య ఇంటా, బయటా పద్ధతిలో క్వాలిఫయింగ్ ఈవెంట్ జరుగనుంది. క్వాలిఫయింగ్ టోర్నీలో నెగ్గిన 12 జట్లు నవంబర్‌లో జరిగే ఫైనల్స్‌కు అర్హత పొందుతాయి. ఈ సీజన్లో సెమీస్‌కు చేరిన నాలుగు జట్లకు నేరుగా ఎంట్రీ లభిస్తుంది. మరో రెండు జట్లకు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) వైల్డ్ కార్డు ఇస్తుంది. -
ప్రెసిడెంట్స్ కప్ టోర్నీలో సాకేత్ శుభారంభం
గాయం కారణంగా ఆరు నెలలపాటు ఆటకు దూరంగా ఉన్న భారత టెన్నిస్ స్టార్ సాకేత్ మైనేని పునరాగమనంలో సత్తా చాటుకున్నాడు. కజకిస్తాన్‌లోని అస్తానాలో జరుగుతున్న ప్రెసిడెంట్స్ కప్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో ఈ హైదరాబాద్ ప్లేయర్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో సాకేత్ 6–3, 7–6 (7/4)తో గ్రిగోరి లొమాకిన్ (కజకిస్తాన్)పై గెలిచాడు. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్స్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. -
సాకేత్ పరాజయం
పుణే: కేపీఐటీ-ఎమ్‌ఎస్‌ఎల్‌టీఏ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ నుంచి భారత నంబర్‌వన్ ఆటగాడు సాకేత్ మైనేని నిష్క్రమించాడు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌కే చెందిన ప్రజ్ఞేష్ గుణేశ్వరన్ 6-7, 6-2, 6-0తో మూడో సీడ్ సాకేత్‌పై విజయం సాధించి సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను టైబ్రేక్ ద్వారా గెలుచుకున్న అనంతరం సాకేత్ కుడి భుజం గాయంతో బాధపడుతూనే మ్యాచ్‌ను కొనసాగించాడు. పేస్ జంట నిష్క్రమణ మరో వైపు డబుల్స్‌లో లియాండర్ పేస్-రామ్‌కుమార్ జోడి క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైంది. ఫ్రాన్సకు చెందిన స్విస్ ల్యూకా-హ్యూగో నైస్ ద్వయం 2-6, 6-3, 10-4 తేడాతో రెండో సీడ్ పేస్ జంటపై విజయం సాధించింది. ఈ పరాజయంతో పేస్ 2016 సీజన్‌ను ముగించాడు. భారత్‌కే చెందిన టాప్ సీడ్ పూరవ్ రాజా-దివిజ్ శరణ్ జోడి సెమీస్‌కి చేరింది. -
రెండో రౌండ్లో సాకేత్ మైనేని
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేని రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన తొలిరౌండ్లో సాకేత్ 6-3, 7-5తో అల్బానో ఒలివిట్టి (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. తదుపరి మ్యాచ్‌లో సాకేత్ అమెరికాకు చెందిన మిచెల్ క్రూజర్‌తో తలపడతాడు. మరో భారత ఆటగాడు రామ్‌కుమార్... అలెస్సాండ్రో గియాన్నెసీ (ఇటలీ)తో తలపడనున్నాడు. -
భళా... భారత్
* రెండు సింగిల్స్‌లో రామ్‌కుమార్, సాకేత్ విజయం * కొరియాపై 2-0తో ఆధిక్యం * డేవిస్ కప్ మ్యాచ్ చండీగఢ్: సొంతగడ్డపై భారత టెన్నిస్ యువ ఆటగాళ్లు రామ్‌కుమార్ రామనాథన్, సాకేత్ మైనేని ఆకట్టుకున్నారు. దక్షిణ కొరియాతో శుక్రవారం మొదలైన ఆసియా ఓసియానియా గ్రూప్-1 డేవిస్ కప్ మ్యాచ్‌లో తొలి రోజు భారత్‌కు 2-0తో ఆధిక్యాన్ని అందించారు. రెండు మ్యాచ్‌ల్లో కొరియా ఆటగాళ్లు ఓటమి అంచుల్లో ఉన్న దశలో గాయాల కారణంగా వైదొలగడం గమనార్హం. డేవిస్ కప్‌లో తొలిసారి బరిలోకి దిగిన 21 ఏళ్ల రామ్‌కుమార్ 6-3, 2-6, 6-3, 6-5తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి సియోంగ్ చాన్ హాంగ్‌కు తొడ కండరాలు పట్టేశాయి. నొప్పిని భరించలేక సియోంగ్ మ్యాచ్ నుంచి వైదొలగడంతో చైర్ అంపైర్ రామ్‌కుమార్‌ను విజేతగా ప్రకటించారు. యోంగ్‌కు లిమ్తో జరిగిన రెండో మ్యాచ్‌లో సాకేత్ 6-1, 3-6, 6-4, 3-6, 5-2తో ఆధిక్యంలో ఉన్న దశలో కొరియా ప్లేయర్ గాయం కారణంగా తప్పుకున్నాడు. కెరీర్లో తొలిసారి ఐదు సెట్ల మ్యాచ్‌ను ఆడిన సాకేత్ విజయం ఖాయం కాగానే ఆనందంతో తన జెర్సీని విప్పి గాల్లోకి విసిరేసి సంబరం చేసుకున్నాడు. మిగతా సహచరులు సాకేత్‌ను భుజాలపైకి ఎత్తుకొని అతణ్ని అభినందించారు. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో లియాండర్ పేస్-రోహన్ బోపన్న ద్వయం హాంగ్ చుంగ్-యున్‌సియోంగ్ చుంగ్ జోడీతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లోనూ భారత్ గెలిస్తే 3-0తో విజయాన్ని ఖాయం చేసుకుంటుంది. -
సాకేత్‌తో ఆడతా...
► ఒలింపిక్స్ డబుల్స్ భాగస్వామిపై తేల్చిన బోపన్న ► అదే జరిగితే పేస్ ‘రికార్డు’ ఆశలు గల్లంతే.. ► తుది నిర్ణయం ‘ఐటా’ చేతిలో న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ రికార్డు స్థాయిలో ఏడోసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగాలని భావిస్తుండగా... మరోవైపురోహన్ బోపన్న అతడి ఆశలపై నీళ్లు చల్లేలా కనిపిస్తున్నాడు. రియోలో జరిగే ఈ మెగా ఈవెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో బోపన్న తన భాగస్వామిగా సాకేత్ మైనేనిని ఎంచుకున్నాడు. ఈవిషయాన్ని ఇప్పటికే అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా)కు తెలిపాడు. అయితే ఐటా మాత్రం బోపన్న నిర్ణయాన్ని తిరస్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘రెండోసారి దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్నందుకు గర్వంగా ఉంది. ర్యాంకింగ్స్‌లో టాప్-10లో నిలిచినందున నా భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ నాకుంది. ఇప్పటికే నా సహచరుడి పేరును ఐటాకు చెప్పాను. అందరి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాను’ అని బోపన్న తెలిపాడు. అయితే తన భాగస్వామి పేరును నేరుగా చెప్పకపోయినా ఐటా వర్గాలు మాత్రం... బోపన్న 28 ఏళ్ల సాకేత్‌ను ఎంచుకున్నాడని పేర్కొన్నాయి. మరోవైపు 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకుని ఇప్పటికీ ఫిట్నెస్తో ఉన్న పేస్‌ను కాదనుకోవడం తెలివైన నిర్ణయం కాదని ఐటా అభిప్రాయపడుతోంది. ‘రోహన్ కారణంగా పేస్ తన ఏడో ఒలింపిక్స్‌కు దూరం కావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేరు. ఇందుకు అతడు చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఐటా అధికారి ఒకరు తెలిపారు. ఐటీఎఫ్ నిబంధనల ప్రకారం డబుల్స్ జట్టును జాతీయ సంఘం నామినేట్ చేయాల్సి ఉంటుంది. దీంతో బోపన్న, సాకేత్ జోడిని ఐటా అంగీకరించకపోతే వారు కలిసి ఆడేందుకు వీలుండదు. దీంతో నేడు (శనివారం) జరిగే సెలక్షన్ కమిటీ సమావేశంలో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి ఎలాంటి జట్లను ఎంపిక చేస్తారోననే ఆసక్తి నెలకొంది. డేవిస్‌కప్‌లో పేస్‌కు మొండిచేయి వచ్చే నెలలో జరిగే ఆసియా/ఓసియానియా గ్రూప్ 1లో భాగంగా కొరియాతో జరిగే డేవిస్‌కప్ మ్యాచ్‌కు లియాండర్ పేస్‌ను పక్కనబెట్టనున్నారు. ఇందులో ఆడేందుకు పేస్ ఆసక్తి చూపినా యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని ఐటా భావిస్తోంది. నేడు (శనివారం) జట్టు ఎంపిక జరుగుతుంది. యూకీ బాంబ్రీ, సాకేత్ మైనేని, బోపన్న, రాంకుమార్ జట్టులో ఉంటారు. సెప్టెంబర్‌లో చెక్ రిపబ్లిక్‌తో జరిగిన ప్రపంచ గ్రూప్ ప్లేఆఫ్ టైలో ఓడిన భారత్ గ్రూప్1కి పడిపోయింది. ఇందులో తొలి రౌండ్లో బై లభించిన భారత్.. కొరియాపై నెగ్గితే మరోసారి వరల్డ్ ప్లే ఆఫ్‌లో ఆడే అవకాశం లభిస్తుంది. -
పోరాడి ఓడిన సాకేత్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ క్వాలిఫయింగ్ విభాగంలో భారత పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని 6-7 (5/7), 5-7తో ఫ్రాన్సెస్ తియాఫో (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన రామ్‌కుమార్ తొలి రౌండ్లోనే ఓడిన సంగతి తెలిసిందే. ఫ్రెంచ్ ఓపెన్ ప్రధాన టోర్నమెంట్ ఈనెల 22న మొదలవుతుంది. -
సాకేత్ పరాజయం
యానింగ్ (చైనా): కున్మింగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని పోరాటం ముగి సింది. మథియాస్ (ఫ్రాన్స్)తో శనివారం జరి గిన సెమీఫైనల్లో సాకేత్ గాయం కారణంగా వైదొలిగాడు. తొలి సెట్‌ను 0-6తో కోల్పోయిన సాకేత్ రెండో సెట్లో 1-3తో వెనుకబడ్డాడు. -
సెమీస్‌లో సాకేత్
యానింగ్ (చైనా): కున్మింగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని సెమీస్‌కు చేరాడు. క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ సాకేత్ 6-1, 6-3తో ఆర్థర్ డీగ్రీఫ్ (బెల్జియం)పై నెగ్గాడు. ఈ మ్యాచ్‌లో సాకేత్ ఆరు ఏస్‌లు సంధించడంతోపాటు తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. -
క్వార్టర్స్‌లో సాకేత్
యానింగ్ (చైనా): కున్మింగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత రెండో ర్యాంకర్ సాకేత్ మైనేనికి మిశ్రమ ఫలితాలు లభించాయి. సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిన ఈ హైదరాబాద్ ప్లేయర్... డబుల్స్ విభాగంలో మాత్రం తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. బుధవారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో సాకేత్ 6-3, 7-6 (7/4)తో నికొలస్ బారింటస్ (కొలంబియా)పై విజయం సాధించాడు. డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్-మహేశ్ భూపతి (భారత్) జంట 4-6, 4-6తో డెనిస్ మొల్చనోవ్ (ఉక్రెయిన్)-అలెగ్జాండర్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్తాన్) జోడీ చేతిలో ఓడిపోయింది. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఆర్థర్ డీగ్రీఫ్ (బెల్జియం)తో సాకేత్ ఆడతాడు. -
సాకేత్ శుభారంభం
యానింగ్ (చైనా): కున్మింగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత రెండో ర్యాంకర్ సాకేత్ మైనేని శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఈ హైదరాబాద్ ప్లేయర్ 6-4, 6-3తో డక్‌హీ లీ (దక్షిణ కొరియా)పై విజయం సాధించాడు. రెండో రౌండ్లో నికొలస్ బారింటోస్ (కొలంబియా)తో సాకేత్ తలపడతాడు. డబుల్స్ విభాగంలో భారత్‌కే చెందిన మహేశ్ భూపతితో జతకట్టిన సాకేత్ బుధవారం జరిగే తొలి రౌండ్లో మొల్చనోవ్ (ఉక్రెయిన్)-నెదోవ్‌యెసోవ్ (కజకిస్తాన్)లతో ఆడనున్నాడు. -
సాకేత్‌కు డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: టీఏసీ కప్ చైనా ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని సత్తా చాటుకున్నాడు. చైనాలోని నాన్జింగ్ నగరంలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో సాకేత్ డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించాడు. సాకేత్ కెరీర్లో ఇది ఆరో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. ఏకపక్షంగా జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ సాకేత్-జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) ద్వయం 6-3, 6-3తో డెనిస్ మొల్చనోవ్ (ఉక్రెయిన్)-అలెగ్జాండర్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్తాన్) జంటపై గెలిచింది. 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సాకేత్-జీవన్ జంట 6-3, 6-2తో రెండో సీడ్ యాన్ బాయ్ (చైనా)-రికార్డో గెడిన్ (ఇటలీ) ద్వయంపై నెగ్గింది. విజేతగా నిలిచిన సాకేత్ జంటకు 3,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
డబుల్స్ సెమీస్‌లో సాకేత్ జంట
నాన్జింగ్ (చైనా): టీఏసీ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని పురుషుల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాకేత్-జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) జంట 6-1, 6-2తో జోర్డాన్ థాంప్సన్-ఆండ్రూ విటింగ్టన్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. 46 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ద్వయం ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. సింగిల్స్ విభాగంలో మాత్రం సాకేత్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. డానియల్ ఎన్గుయెన్ (అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో సాకేత్ 6-7 (6/8), 6-7 (3/7)తో ఓటమి చవిచూశాడు. మరోవైపు అమెరికాలో జరుగుతున్న ఏటీపీ చాలెంజర్ టోర్నీలో దివిజ్ శరణ్-పురవ్ రాజా (భారత్) జంట కూడా సెమీస్‌కు చేరింది. క్వార్టర్స్‌లో దివిజ్-రాజా 6-3, 7-5తో ఫెర్నాండెజ్-నికొలస్ జారీ (అమెరికా)లపై నెగ్గారు. -
రన్నరప్‌గా సాకేత్ జోడి
సాక్షి, హైదరాబాద్: షెన్జెన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు సాకేత్ మైనేని-జీవన్ నెదున్‌చెజియాన్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాకేత్-జీవన్ 6-3, 4-6, 10-12తో ల్యూక్ సావిల్-జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా)ల చేతిలోపరాజయం చవిచూశాడు -
ఫైనల్లో సాకేత్ జంట
సాక్షి, హైదరాబాద్: షెన్జెన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేనికి మిశ్రమ ఫలితాలు లభించాయి. డబుల్స్ లో జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్)తో కలిసి ఫైనల్లోకి దూసుకెళ్లిన సాకేత్... సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్-జీవన్ జంట 6-2, 6-3తో జెబావి-జాన్ సత్రాల్ (చెక్ రిపబ్లిక్) జోడీపై గెలుపొందింది. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 3-6, 1-6తో ఆడమ్ పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయాడు. -
సెమీస్‌లో సాకేత్ జంట
సాక్షి, హైదరాబాద్: షెన్జెన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారుడు సాకేత్ మైనేని డబుల్స్‌లో సెమీస్‌లోకి... సింగిల్స్‌లో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. చైనాలో బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 149వ ర్యాంకర్ సాకేత్ 7-5, 6-3తో ప్రపంచ 98వ ర్యాంకర్, ఐదో సీడ్ లుకాస్ లాకో (స్లొవేకియా)పై సంచలన విజయం సాధించాడు. మరోవైపు డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్-జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) జంటకు తారో డానియెల్ (జపాన్)-డానియల్ ట్రేవర్ (స్పెయిన్) నుంచి వాకోవర్ లభించింది. -
క్వార్టర్స్‌లో సాకేత్ జంట
సాక్షి, హైదరాబాద్: షెన్జెన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. చైనాలో మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్-జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) జంట 6-4, 4-6, 17-15తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ డీనో మర్కాన్-ఫ్రాంకో స్కుగోర్ (క్రొయేషియా) జోడీపై నెగ్గింది. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో సాకేత్
న్యూఢిల్లీ: గతవారం ముగిసిన ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సాకేత్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 158వ ర్యాంక్‌లో నిలిచాడు. భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీ ఎనిమిది స్థానాలు పడిపోయి 107వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. గతవారమే కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడాభివృద్ధి నిధి నుంచి యూకీకి రూ. 37 లక్షలు... సాకేత్‌కు రూ. 36 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేసింది. గతేడాది ఢిల్లీ ఓపెన్ విజేతగా నిలిచిన సోమ్‌దేవ్ ఈసారి టోర్నీలో ఆడకపోవడంతో 87 స్థానాలు పడిపోయి 279వ ర్యాంక్‌లో నిలిచాడు. ఢిల్లీ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్ నెగ్గిన మహేశ్ భూపతి డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 61 స్థానాలు పురోగతి సాధించి 225వ ర్యాంక్‌లో నిలిచాడు. రోహన్ బోపన్న ఎనిమిదో ర్యాంక్‌లో, లియాండర్ పేస్ 57వ ర్యాంక్‌లో ఉన్నారు. -
ఫైనల్లో సాకేత్
న్యూఢిల్లీ: హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో సింగిల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో సాకేత్ 6-3, 6-2తో రెండో సీడ్ కిమెర్ కాప్‌జాన్స్ (బెల్జియం)పై గెలిచాడు. శక్తివంతమైన సర్వీస్‌లతో అదరగొట్టిన సాకేత్ ఆద్యంతం నిలకడగా ఆడి ప్రత్యర్థికి ఏదశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఆదివారం జరిగే ఫైనల్లో మూడో సీడ్ స్టీఫెన్ రాబర్ట్ (ఫ్రాన్స్)తో సాకేత్ తలపడతాడు. రెండో సెమీఫైనల్లో రాబర్ట్ 6-3, 6-2తో ఫ్లావియో సిపొల్లా (ఇటలీ)పై గెలిచాడు. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్) జంట రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో మహేశ్ భూపతి-యూకీ బాంబ్రీ (భారత్) ద్వయం 6-3, 4-6, 10-5తో సాకేత్-సనమ్ సింగ్ జంటను ఓడించి విజేతగా నిలిచింది. -
సాకేత్ శుభారంభం
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ క్వాలిఫయింగ్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 168వ ర్యాంకర్ సాకేత్ 6-4, 6-1తో ప్రపంచ 206వ ర్యాంకర్, భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌ను అలవోకగా ఓడించాడు. 66 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడైన సాకేత్ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు రామ్‌కుమార్ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. శుక్రవారం జరిగే రెండో రౌండ్లో ప్రపంచ 261వ ర్యాంకర్ లొరెంజో గిస్టినో (ఇటలీ)తో సాకేత్ తలపడతాడు. మరోవైపు భారత అగ్రశ్రేణి ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌కు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. జర్గెన్ జాప్ (ఎస్తోనియా)తో జరిగిన మ్యాచ్‌లో సోమ్‌దేవ్ 6-2, 1-6, 4-6తో ఓడిపోయాడు. తొలి రోజు ఎండ తీవ్రత (41.6 డిగ్రీల సెల్సియస్) ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం జరగాల్సిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లకు విరామం ఇచ్చి సాయంత్రం వేళలో నిర్వహించారు. -
క్వార్టర్స్‌లో సాకేత్-సనమ్ జోడీ
ఏటీపీ చాలెంజర్ టోర్నీ పుణే: మరో డబుల్స్ టైటిల్‌పై గురి పెట్టిన సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్) జంట పుణే ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సాకేత్-సనమ్ ద్వయం 6-1, 6-1తో తెముర్ ఇస్మయిలోవ్ (ఉజ్బెకిస్తాన్)-అర్పిత్ శర్మ (భారత్) జంటపై గెలిచింది. అయితే సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ తొలి రౌండ్లోనే నిష్ర్కమించాడు. రెండు గంటల మూడు నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఐదో సీడ్ సాకేత్ 7-5, 4-6, 2-6తో ఇల్యా ఇవష్కా (బెలారస్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. ఈ టోర్నీతో సాకేత్ ఈ సీజన్‌ను ముగిస్తున్నాడు. ఈ ఒక్క నెలలోనే సాకేత్ మూడు టోర్నీల్లో బరిలోకి దిగి ఏకంగా 25 మ్యాచ్‌ల్లో (14 సింగిల్స్, 11 డబుల్స్) పాల్గొన్నాడు. మరోవైపు భారత్‌కే చెందిన సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, సనమ్ సింగ్, విజయ్ సుందర్ ప్రశాంత్‌లు సింగిల్స్‌లో రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. తొలి రౌండ్లో సోమ్‌దేవ్ 6-4, 7-5తో మాక్సిమ్ జాన్వీర్ (ఫ్రాన్స్)పై, సనమ్ సింగ్ 6-4, 6-1తో అలెజాంద్రో బెగా (ఇటలీ)పై, ప్రశాంత్ 6-4, 6-4తో ఆర్థర్ డీ గ్రీఫ్ (బెల్జియం)పై గెలిచారు. -
క్వార్టర్స్‌లో సాకేత్
బెంగళూరు: ఎయిర్ ఆసియా ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని సింగిల్స్ విభాగంతోపాటు డబుల్స్‌లోనూ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. బుధవారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్లో సాకేత్ 6-4, 7-6 (11/9)తో డేల్ ప్రొపొజియా (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. ఆ తర్వాత తన భాగస్వామి సనమ్ సింగ్ (భారత్)తో కలిసి డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్ 7-6 (7/3), 6-1తో ఇగోర్ జెరసిమోవ్-ఇల్యా ఇవస్కా (బెలారస్) జంటపై గెలిచాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్-సుమీత్ నాగల్ (భారత్) జోడీ 6-7 (5/7), 4-6తో తి చెన్ (చైనీస్ తైపీ)-డేన్ ప్రొపొజియా (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడిపోయింది. -
వియత్నాం ఓపెన్ విజేత సాకేత్
హో చి మిన్ సిటీ (వియత్నాం): తన అద్వితీయ ప్రదర్శన కొనసాగిస్తూ హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని వియత్నాం ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో సింగిల్స్ చాంపియన్‌గా అవతరించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ సాకేత్ 7-5, 6-3తో ఎనిమిదో సీడ్ జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. సాకేత్ కెరీర్లో ఇది రెండో ఏటీపీ చాలెంజర్ టైటిల్. గతేడాది ఇండోర్ ఓపెన్‌లో అతను తొలి ఏటీపీ చాలెంజర్ టైటిల్‌ను నెగ్గాడు. డబుల్స్‌లో మాత్రం సాకేత్-సనమ్ సింగ్ (భారత్) జంట రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఫైనల్లో సాకేత్-సనమ్ ద్వయం 6-1, 3-6, 8-10తో లామసినె (ఫ్రాన్స్) -లాంగర్ (జర్మనీ) జంట చేతిలో ఓడింది. -
సాకేత్ జంటకు డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఇజ్మీర్ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. భారత్‌కే చెందిన తన భాగస్వామి దివిజ్ శరణ్‌తో కలిసి సాకేత్ విజేతగా నిలిచాడు. టర్కీలోని ఇజ్మీర్ పట్టణంలో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ సాకేత్-దివిజ్ శరణ్ ద్వయం 7-6 (7/5), 4-6, 9-8తో ఆధిక్యంలో ఉన్న దశలో నాలుగో సీడ్, ప్రత్యర్థి జంట మాలిక్ జజిరి (టర్కీ)-మొల్చనోవ్ (ఉక్రెయిన్) గాయం కారణంగా వైదొలిగింది. విజేతగా నిలిచిన సాకేత్ జోడీకి 3,950 యూరోల (రూ. 2 లక్షల 92 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సాకేత్ కెరీర్లో ఇది నాలుగో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్. గతంలో అతను సనమ్ సింగ్‌తో కలిసి పుణే, ఢిల్లీ, కోల్‌కతాలలో జరిగిన ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లలో డబుల్స్ టైటిల్స్‌ను సాధించాడు. -
టైటిల్ పోరుకు సాకేత్ జోడీ
చైనా ఏటీపీ చాలెంజర్ టోర్నీ షెన్జెన్ (చైనా): ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని తన కొత్త భాగస్వామి దివిజ్ శరణ్ (భారత్)తో కలిసి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్-దివిజ్ ద్వయం 2-6, 7-6 (7/2), 10-5తో మావో జిన్ గాంగ్ (చైనా)-సియెన్ యిన్ పాంగ్ (చైనీస్ తైపీ) జంటపై గెలిచింది. గంటా 22 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జోడీ రెండు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి గేమ్‌లో తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయిన భారత క్రీడాకారులు రెండో గేమ్‌లో రాణించారు. తమ సర్వీస్‌లను నిలబెట్టుకొని కీలకమైన టైబ్రేక్‌లో రాణించి మ్యాచ్‌లో నిలిచారు. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో భారత జోడీ పైచేయి సాధించింది. శనివారం జరిగే ఫైనల్లో నాలుగో సీడ్ గెరో క్రెట్‌షెమర్-అలెగ్జాండర్ సాట్శెకో (జర్మనీ)లతో సాకేత్-దివిజ్ తలపడతారు.