సాకేత్‌తో ఆడతా...
► ఒలింపిక్స్ డబుల్స్ భాగస్వామిపై తేల్చిన బోపన్న
► అదే జరిగితే పేస్ ‘రికార్డు’ ఆశలు గల్లంతే..
► తుది నిర్ణయం ‘ఐటా’ చేతిలో
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ రికార్డు స్థాయిలో ఏడోసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగాలని భావిస్తుండగా... మరోవైపురోహన్ బోపన్న అతడి ఆశలపై నీళ్లు చల్లేలా కనిపిస్తున్నాడు. రియోలో జరిగే ఈ మెగా ఈవెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో బోపన్న తన భాగస్వామిగా సాకేత్ మైనేనిని ఎంచుకున్నాడు. ఈవిషయాన్ని ఇప్పటికే అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా)కు తెలిపాడు. అయితే ఐటా మాత్రం బోపన్న నిర్ణయాన్ని తిరస్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘రెండోసారి దేశం తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్నందుకు గర్వంగా ఉంది. ర్యాంకింగ్స్‌లో టాప్-10లో నిలిచినందున నా భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ నాకుంది.
ఇప్పటికే నా సహచరుడి పేరును ఐటాకు చెప్పాను. అందరి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాను’ అని బోపన్న తెలిపాడు. అయితే తన భాగస్వామి పేరును నేరుగా చెప్పకపోయినా ఐటా వర్గాలు మాత్రం... బోపన్న 28 ఏళ్ల సాకేత్‌ను ఎంచుకున్నాడని పేర్కొన్నాయి. మరోవైపు 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకుని ఇప్పటికీ ఫిట్‌నెస్‌తో ఉన్న పేస్‌ను కాదనుకోవడం తెలివైన నిర్ణయం కాదని ఐటా అభిప్రాయపడుతోంది. ‘రోహన్ కారణంగా పేస్ తన ఏడో ఒలింపిక్స్‌కు దూరం కావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేరు. ఇందుకు అతడు చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఐటా అధికారి ఒకరు తెలిపారు. ఐటీఎఫ్ నిబంధనల ప్రకారం డబుల్స్ జట్టును జాతీయ సంఘం నామినేట్ చేయాల్సి ఉంటుంది. దీంతో బోపన్న, సాకేత్ జోడిని ఐటా అంగీకరించకపోతే వారు కలిసి ఆడేందుకు వీలుండదు. దీంతో నేడు (శనివారం) జరిగే సెలక్షన్ కమిటీ సమావేశంలో ఒలింపిక్స్‌కు భారత్ నుంచి ఎలాంటి జట్లను ఎంపిక చేస్తారోననే ఆసక్తి నెలకొంది.
డేవిస్‌కప్‌లో పేస్‌కు మొండిచేయి
వచ్చే నెలలో జరిగే ఆసియా/ఓసియానియా గ్రూప్ 1లో భాగంగా కొరియాతో జరిగే డేవిస్‌కప్ మ్యాచ్‌కు లియాండర్ పేస్‌ను పక్కనబెట్టనున్నారు. ఇందులో ఆడేందుకు పేస్ ఆసక్తి చూపినా యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని ఐటా భావిస్తోంది. నేడు (శనివారం) జట్టు ఎంపిక జరుగుతుంది. యూకీ బాంబ్రీ, సాకేత్ మైనేని, బోపన్న, రాంకుమార్ జట్టులో ఉంటారు. సెప్టెంబర్‌లో చెక్ రిపబ్లిక్‌తో జరిగిన ప్రపంచ గ్రూప్ ప్లేఆఫ్ టైలో ఓడిన భారత్ గ్రూప్1కి పడిపోయింది. ఇందులో తొలి రౌండ్‌లో బై లభించిన భారత్.. కొరియాపై నెగ్గితే మరోసారి వరల్డ్ ప్లే ఆఫ్‌లో ఆడే అవకాశం లభిస్తుంది.