అంతా కలిసి ‘ఆడుకున్నారు’...
♦ దేశాన్ని నిరాశపరిచిన పేస్, బోపన్న
♦ సమన్వయం లేకుండానే బరిలోకి
♦ బలవంతంగా జత కట్టించిన సమాఖ్య
బాలీవుడ్ ఆల్‌టైం క్లాసిక్ ‘మొగల్ ఎ ఆజం’లో దిలీప్ కుమార్, మధుబాల మధ్య ప్రేమ సన్నివేశాలు చూస్తే అమర ప్రేమికుల్లా కనిపిస్తారు. కానీ పాత గొడవల కారణంగా ఆ సినిమా షూటింగ్ సమయంలో వారి మధ్య మాటలే లేవు! కానీ ప్రొఫెషనలిజం ముందు వ్యక్తిగత ఆగ్రహావేశాలు పక్కన పెట్టి వారు అలా నటించేశారు.
ఒలింపిక్స్‌లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ముందు మాట్లాడింది లేదు, కలిసి సాధన చేసిందీ లేదు. ప్రపంచం మొత్తం స్నేహితులుగా మారిపోయిన చోట కూడా ఎడమొహం, పెడమొహమే. కానీ పాతికేళ్ల అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాడు, వరల్డ్ టాప్-10లో ఉన్న మరొకరు ఇగోలు పట్టించుకోరని అంతా భావించారు. దేశం కోసం ద్వేషం వీడి చెలరేగుతారని ప్రజలు నమ్మారు. కానీ లియాండర్ పేస్, రోహన్ బోపన్న అలా చేయలేదు. మ్యాచ్ గెలుపుకంటే పంతం ముఖ్యమని అనుకున్నారు.
సాక్షి క్రీడా విభాగం: ఒలింపిక్స్‌కు కొద్ది రోజుల ముందే పేస్, బోపన్న కలిసి డబుల్స్ భాగస్వాములుగా డేవిస్ కప్ మ్యాచ్ ఆడారు. ఇద్దరూ తమ స్థాయిలో చెలరేగడంతో కొరియాపై సునాయాస విజయం దక్కింది. దాంతో ఇద్దరి మధ్య అంతా చక్కబడిపోయిందని అభిమానులు అనుకున్నారు. కానీ రెండు వారాల వ్యవధిలోనే మళ్లీ పాత విభేదాలు బయట పడ్డాయి. మెరుగైన ప్రత్యర్థి చేతిలో పరాజయం పాలయ్యాం, గెలుపోటములు ఆటలో సహజం అంటూ వీరిద్దరు ఎన్ని మాటలు చెప్పుకున్నా... ఈ వివరణ ఎవరినీ సంతృప్తి పరచడం లేదు. తమ సొంత ఇష్ట ప్రకారం వ్యవహరించిన వీరిద్దరు కోర్టులో ప్రత్యర్థితో కాకుండా ఒకరితో మరొకరు తలపడినట్లు అనిపించింది.
పేస్ ఇలా మారిపోయాడా..?
భారత్‌కు ప్రాతినిధ్యం వహించే సమయంలో పేస్‌లో ఒక్కసారిగా ఎక్కడ లేని ఎనర్జీ కనిపించేది. తనకంటే ఎంతో మెరుగైన, అత్యుత్తమ ఆటగాళ్లతో తలపడినప్పుడు కూడా అతను ఎక్కడా తగ్గలేదు. ఇదే శైలి పేస్‌ను దేశం కోసం ఆడే ఆటగాడిగా గుర్తింపు తెచ్చింది. కానీ తాజా పరిణామాలు ఇన్నేళ్ల కీర్తిని దెబ్బ కొట్టేలా ఉన్నాయి. ఒలింపిక్స్‌కు ముందు యూరోప్‌లో చాలెంజర్ టోర్నీ, అమెరికాలో టీమ్ టెన్నిస్ ఆడుతున్నాడు. ఇవేమీ పెద్దగా ప్రాధాన్యత ఉన్నవి కూడా కాదు. చివరకు బోపన్న నాలుగు రోజుల పాటు తగిన భాగస్వామి లేక ఎవరో విదేశీ ఆటగాడితో తన ప్రాక్టీస్ కొనసాగించాడు. సన్నద్ధత అంటే ప్రాక్టీస్ కాదని, మ్యాచ్‌లు ఆడటం కూడా ప్రాక్టీస్ కిందకే వస్తుందని ఓటమి తర్వాత పేస్ చెప్పిన వివరణ సబబుగా అనిపించలేదు. పైగా ఇలాంటి ఫలితం తర్వాత కూడా ఏ మాత్రం మొహమాటపడకుండా టోక్యో 2020కు కూడా సిద్ధమని చెప్పుకోవడం నిజంగా ఆశ్చర్యపరిచింది.
బోపన్న తనకు నచ్చినట్లుగా...
మరో వైపు బోపన్న కూడా మొదటినుంచి తాను అనుకున్నట్లుగానే వ్యవహరించాడు. పేస్ రికార్డు గురించి తెలిసీ... 125వ ర్యాంకర్ సాకేత్ మైనేనితోనే ఆడతానని నిర్మొహమాటంగా చెప్పి అలజడి రేపాడు. చివరకు బలవంతంగా ఐటా జోడీ కట్టించినా దానిని సీరియస్‌గా తీసుకున్నట్లు లేదు. ఒలింపిక్స్‌కు ముందే వచ్చినా కనీసం సీనియర్ సహచరుడి గురించి సమాచారం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పేస్ వస్తే ఎంత, రాకపోతే ఎంత అన్నట్లు అతను ప్రవర్తించాడు. దీన్ని బట్టి చూస్తే రియోకు వచ్చాక కూడా పేస్‌తో కలిసి ఆడటం అతనికి ఏ మాత్రం ఇష్టం లేదని, దానిని అతను బహిరంగంగానే వ్యక్త పరుస్తున్నాడని అర్థమైపోతుంది. పోలండ్‌తో ఓడిన మ్యాచ్ తొలి సెట్‌లో బొపన్న అనూహ్యంగా రెండు సార్లు సర్వీస్ కోల్పోయాడు. రెండో సెట్‌లో 6-5తో ఆధిక్యంలో ఉన్నప్పుడు మళ్లీ సర్వీస్ కోల్పోవడంతో మ్యాచ్ టైబ్రేక్‌కు చేరింది. బోపన్న తన పూర్తి శక్తి సామర్థ్యాలతో మ్యాచ్ ఆడినట్లు కనిపించలేదు.మిక్స్‌డ్ డబుల్స్ (సానియాతో) రూపంలో మరో ప్రత్యామ్నాయం ఉండటం, అందులోనే పతకావకాశాలు కూడా కనిపిస్తుండటం వల్ల కూడా పోతే పోనీ అనుకున్నాడేమో.
మళ్లీ మళ్లీ వివాదం...
2012 లండన్ ఒలింపిక్స్ సమయంలో రేగిన వివాదంతోనే అఖిల భారత టెన్ని సంఘం (ఐటా) పరువు పోయింది. నాడు సానియా మీర్జా, సంఘాన్ని చెడామడా తిట్టేసింది. నాలుగేళ్ల క్రితమే భూపతి, బోపన్న ద్వయానికి, పేస్‌కు మధ్య ఉన్న విభేదాలు బయట పడ్డాయి. ఆడితే మేమిద్దరమే కలిసి ఆడతామంటూ భీష్మించుకోవడంతో చివరకు పేస్‌కు జతగా విష్ణువర్ధన్ ను ఆడించాల్సి వచ్చింది. అప్పుడు రెండు జోడీలు చిత్తయ్యాయి. ఈ సారి ఒకే జోడీకి అవకాశం ఉన్న సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సింది. సాకేత్‌ను బోపన్న కోరుకున్నా... దేశం తరఫున అత్యుత్తమ జోడి అంటూ పేస్-బోపన్నను ప్రకటించారు. బోపన్నకు అది ఇష్టం లేకపోయినా ఆడాల్సిందేనంటూ బలవంతం చేశారు.
వారికి పడటం లేదని, సమన్వయంతో సాగాల్సిన డబుల్స్‌లో ఇది పని చేయదని తెలిసినా ఒలింపిక్స్ లోపు సర్దుకుంటుందని అతి వి శ్వాసం ప్రకటించారు. ఐటా కూడా కేవలం పేస్ ఏడో ఒలింపిక్ రికార్డునే దృష్టిలో ఉంచుకున్నట్లుంది. అతను లెజెండ్ కాబట్టి నిరాశపర్చకూడదని, తగిన గౌరవం ఇవ్వాలని భావించి ఉంటుంది. అందుకే సెంటిమెంట్‌కే ఎక్కువ మొగ్గు చూపి పేస్‌ను రియో పంపించింది. ఆ తర్వాత కూడా బోపన్నలాగే పేస్‌నూ ఒప్పించి కాస్త సంధి కుదిర్చే పని కూడా చేయలేదు.
అతను ఒలింపిక్స్‌కు ముందు సాధారణ టోర్నీలు ఆడకుండా ముందే రియో వచ్చేలా, వీరిద్దరు కలిసి ప్రాక్టీస్ చేసేలా చేయలేకపోయింది. నీకు మరో అవకాశం ఇస్తున్నాం కాబట్టి ఈ సారైనా వివాదం రాకుండా క్రమశిక్షణ పాటించమంటూ గట్టిగా చెప్పలేకపోయింది. దాంతో పేస్ తనకు నచ్చినట్లుగా వచ్చి వెళ్లాడు. మొత్తంగా ఆటగాళ్లు, సంఘం కలిసి దేశాన్ని మోసం చేశారు. పతకం ఆశలను ఆదిలోనే తుంచేశారు.
షూటింగ్ పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ (క్వాలిఫయింగ్)
గగన్ నారంగ్, అభినవ్ బింద్రా సాయంత్రం గం. 5.30 నుంచ
ఫైనల్స్: గం. 8.30 నుంచి ఆర్చరీ మహిళల వ్యక్తిగత ఈవెంట్ (ఎలిమినేషన్) లక్ష్మీరాణి మాఝీ
సాయంత్రం గం. 6 నుంచిహాకీ పురుషులు (భారత్ x జర్మనీ)
సాయంత్రం గం. 7.30 నుంచి మహిళలు (భారత్ x బ్రిటన్)
మంగళవారం తెల్లవారుజామున గం.2.30
స్విమ్మింగ్ మహిళల 200 మీటర్ల ఫ్రీ స్టైల్
శివానీ కటారియా - రాత్రి గం. 9.30 పురుషుల 200 మీటర్ల బట్టర్‌ఫ్లై
సాజన్ ప్రకాశ్ - రాత్రి గం. 10 గంటలనుంచి స్టార్‌స్పోర్ట్స్-1, 2లలో ప్రత్యక్ష ప్రసారం