రిజర్వ్ సభ్యులుగా పేస్, బోపన్న
తుది జట్టులో నలుగురూ సింగిల్స్ ఆటగాళ్లే: భూపతి
న్యూఢిల్లీ: డేవిస్ కప్ కోసం నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి నొప్పింపక... తానొవ్వక పద్ధతిని అవలంభించాడు. లియాండర్ పేస్, రోహన్ బోపన్న ఈ ఇద్దరు డబుల్స్ ఆటగాళ్లలో ఒకరికి తీపి, మరొకరికి చేదు పంచలేక ఆ ఇద్దరినీ రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంచుకున్నాడు. తుది జట్టు కోసం అతను పూర్తిగా నలుగురు సింగిల్స్ ఆటగాళ్లనే తీసుకున్నాడు.
ప్రస్తుతానికైతే రామ్‌కుమార్ రామనాథన్, యూకీ బాంబ్రీ, ప్రజ్నేశ్ గున్నేశ్వరన్, శ్రీరామ్ బాలాజీలు తుది జట్టు సభ్యులని భూపతి ప్రకటించాడు. ఒకవేళ అప్పటి అవసరానికి అనుగుణంగా డబుల్స్ కోసం బోపన్న, పేస్‌లలో ఒకరిని తీసుకుంటారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ తప్పకుండా తీసుకుంటామని మ్యాచ్ మొదలయ్యేందుకు ముందు ఆ అవకాశముంటుం దని బదులిచ్చాడు. డేవిస్‌కప్ ఆసియా ఓసియానియా పోరులో భాగంగా భారత్ వచ్చే నెల 7 నుంచి 9వ తేదీ వరకు ఉజ్బెకిస్తాన్‌తో తలపడనుంది.
ప్రస్తుతం డేవిస్ కప్‌లో రికార్డు డబుల్స్ విజయాలపై కన్నేసిన పేస్ తనకా అవకాశం వస్తుందో రాదో తెలుసుకునేందుకు ఇంకొంత కాలం నిరీక్షించక తప్పదేమో! 42 విజయాలతో పేస్, నికోలా పీట్రాంజెలి (ఇటలీ) రికార్డును సమం చేసిన సంగతి తెలిసిందే.