‘ఈ సైకిల్స్‌’ ఆవిష్కరణలో పేస్‌ ఇలా పడిపోయాడేంటి? | Leander Paes eyeing unbreakable record eighth straight Olympics in Tokyo | Sakshi
Sakshi News home page

‘ఈ సైకిల్స్‌’ ఆవిష్కరణలో పేస్‌ ఇలా పడిపోయాడేంటి?

Published Sat, Dec 12 2020 3:11 AM | Last Updated on Sat, Dec 12 2020 10:56 AM

Leander Paes eyeing unbreakable record eighth straight Olympics in Tokyo - Sakshi

మోటోవోల్ట్‌ మొబిలిటీ స్మార్ట్‌ ఈ సైకిల్స్‌’ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పేస్‌ సైకిల్‌ను నడిపించే ప్రయత్నంలో ఇలా...

కోల్‌కతా: వరుసగా ఎనిమిది ఒలింపిక్స్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని భారత దిగ్గజ టెన్నిస్‌ ప్లేయర్‌ లియాండర్‌ పేస్‌ శుక్రవారం స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పాడు. ‘మహమ్మారి బారిన పడతామని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కానీ సుదీర్ఘ విరామం తర్వాత కూడా నేను నా లక్ష్యంపై స్పష్టతతో ఉన్నా. శారీరకంగా, మానసికంగా ఒలింపిక్స్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. చరిత్ర పుటల్లో భారత్‌ పేరు లిఖించేందుకే నేను 30 ఏళ్లుగా ఆడుతున్నా. ఇప్పుడు నాకు 48 ఏళ్లు. వయస్సు కేవలం సంఖ్య మాత్రమే. నేను కొట్టే టెన్నిస్‌ బంతికి నా వయస్సు గురించి తెలియదు.

కేవలం ఎంత బలంగా, వేగంగా బాదుతున్నాననే అంశంపై అది కదులుతుంది. నాలో మరో ఒలింపిక్స్‌ ఆడేందుకు కావాల్సినంత ప్రేరణ ఉంది. విశ్వ క్రీడల్లో అత్యధికంగా వరుసగా ఎనిమిదిసార్లు టెన్నిస్‌ ఆడిన వ్యక్తిగా భారత్‌ పేరిట రికార్డు నెలకొల్పడమే నా లక్ష్యం. టోక్యో ద్వారా ఆ కల నెరవేర్చుకోవాలనుకుంటున్నా’ అని పేస్‌ వివరించాడు. నిజానికి గతేడాది క్రిస్మస్‌ రోజున... 2020 టెన్నిస్‌ సీజన్‌తో తన ప్రొఫెషనల్‌ కెరీర్‌ను ముగిస్తానని పేస్‌ ప్రకటించాడు. ఈ మేరకు ‘వన్‌ లాస్ట్‌ రోర్‌’ స్లోగన్‌తో ఇతర టోర్నీల్లో పాల్గొన్నాడు. కరోనా కారణంగా ఏడాదిపాటు ఒలింపిక్స్‌ వాయిదా పడటంతో పేస్‌ మళ్లీ రాకెట్‌పట్టడం అనుమానంగా మారింది. తాజాగా పేస్‌ తన మనసులో మాటను బయటపెట్టడంతో ఒలింపిక్స్‌లో అతని ప్రాతినిధ్యం ఖాయంగానే అనిపిస్తోంది. ఈ సైకిల్స్‌’ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పేస్..‌ సైకిల్‌ను నడిపించే ప్రయత్నంలో ఇలా జారి కిందిపడ్డాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement