విశ్వ క్రీడల్లో (ఒలింపిక్స్) భారత ప్రస్తానం 1900వ సంవత్సరంలో మొదలైంది. ఆ ఎడిషన్‌లో భారత్ కేవలం ఒకే ఒక అథ్లెట్‌తో పాల్గొంది. భారత్ తరఫున బ్రిటిష్ అథ్లెట్ (అప్పటికి భారత్ బ్రిటిష్ పాలనలో ఉండింది) నార్మన్ ప్రిచార్డ్ పురుషుల 200 మీటర్ల రన్నింగ్ రేస్, 200 మీటర్ల హర్డిల్స్‌లో పాల్గొని రెండు రజత పతకాలు సాధించాడు.
భారత్ 1920లో తొలిసారి స్వదేశీ ఆథ్లెట్లతో ఒలింపిక్స్‌లో పాల్గొంది. బెల్జియంలో జరిగిన ఆ ఎడిషన్‌లో భారత్ తరఫున ఐదుగురు అథ్లెట్లు రెండు క్రీడా విభాగాల్లో పాల్గొన్నారు. ఆ ఎడిషన్‌లో భారత్ రిక్త హస్తాలతో వెనుదిరిగింది.
అనంతరం 1924 పారిస్ ఒలింపిక్స్‌లో కూడా భారత్‌కు చేదు అనుభవమే ఎదురైంది. ఆ ఎడిషన్‌లో భారత్ 12 మంది అథ్టెట్లను బరిలోకి దించినా ప్రయోజనం లేకుండా పోయింది.
భారత్ తొలిసారి స్వతంత్రంగా ఒలింపిక్స్ పతకాన్ని 1928 ఆమ్‌స్టర్‌డామ్ ఒలింపిక్స్‌లో సాధించింది. ఆ ఎడిషన్‌లో భారత పురుషుల హాకీ జట్టు ఏకంగా గోల్డ్ మెడల్‌నే సాధించి చరిత్ర సృష్టించింది.
ఆ ఎడిషన్ (1928) నుంచి భారత్ వరుసగా ఐదు ఒలింపిక్స్‌లో (1932, 1936, 1948, 1952, 1956) స్వర్ణ పతకాలకు సాధించి పురుషుల హాకీలో మకుటం లేని మహారాజులా కొనసాగింది.
1952 ఫిన్‌లాండ్ ఒలింపిక్స్‌లో భారత్ తొలిసారి రెజ్లింగ్‌లో పతకం సాధించింది. ఆ ఎడిషన్‌లో పురుషుల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో ఖషాబా జాదవ్ కాంస్య పతకాన్ని సాధించి, భారత్ తరఫున తొలి పతకం సాధించిన భారతీయ అథ్లెట్‌గా చరిత్రపుటల్లోకెక్కాడు.
1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఈ ఎడిషన్‌లో భారత్‌కు లభించిన ఏకైక పతకం ఇదే.
1964 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తిరిగి పురుషుల హాకీలో స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకుంది.
1968 మెక్సికో, 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌కు వచ్చే సరికి భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది.
1976 మాంట్రియాల్ ఒలింపిక్స్‌లో భారత్ రిక్త హస్తాలతో వెనుదిరిగింది. ఆ ఎడిషన్‌లో 26 మంది క్రీడాకారులు 5 విభాగాల్లో పోటీపడినా ఒక్క పతకం కూడా దక్కలేదు.
1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు తిరిగి మరోసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అనంతరం 1984 లాస్ ఏంజెలెస్, 1988 సియోల్, 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో భారత్ ఖాతా తెరవలేకపోయింది.
మూడు ఎడిషన్ల తర్వాత భారత్ మరోసారి ఓ పతకం సాధించింది. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో భారత టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ కాంస్య పతకం సాధించాడు.
2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున తొలిసారి ఓ మహిళ పతకం సాధించింది. మహిళల 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో కరణం మల్లేశ్వరి కాంస్య పతకం సాధించింది.
2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో భారత్ షూటింగ్‌లో రజత పతకం సాధించింది. పురుషుల డబుల్స్ ట్రాప్‌లో రాజ్యవర్దన్‌సింగ్ రాథోడ్ భారత్‌కు ఆ ఎడిషన్‌లో ఏకైక పతకాన్ని అందించాడు.
2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్ తొలిసారి రెండిటి కంటే ఎక్కవ పతకాలు సాధించి. ఆ ఎడిషన్‌లో భారత్ ఓ గోల్డ్ మెడల్‌తో పాటు రెండు కాంస్య పతకాలను సాధించింది. పురుషుల షూటింగ్‌లో అభినవ్ బింద్రా స్వర్ణ పతకాన్ని.. పురుషుల రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్, పురుషుల బాక్సింగ్‌లో విజేందర్ సింగ్ కాంస్య పతకాలను సాధించారు.
2012 లండన్ ఒలింపిక్స్‌లో 83 మంది క్రీడాకారులతో 13 విభాగాల్లో పాల్గొన్న భారత్.. రెండు రజత పతకాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించింది. పురుషుల షూటింగ్‌లో విజయ్‌కుమార్, పురుషుల రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్ రజత పతకాలు సాధించగా.. పురుషుల షూటింగ్‌లో గగన్ నారంగ్, మహిళల బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్, మహిళల బాక్సింగ్‌లో మేరీ కోమ్, పురుషుల రెజ్లింగ్‌లో యోగేశ్వర్ దత్ కాంస్య పతకాలు సాధించారు.
2012 ఒలింపిక్స్‌లో ఆరు పతకాలు గెలిచిన భారత్ 2016 రియో ఒలింపిక్స్‌లో మళ్లీ మొదటికొచ్చింది. ఈ ఎడిషన్‌లో కేవలం రెండు పతకాలతోనే సరిపెట్టుకుంది. మహిళల బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు రజతం, మహిళల రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ కాంస్య పతకం సాధించారు.
120 ఏళ్ల భారత ఒలింపిక్స్ చరిత్రలో భారత్ అత్యధిక పతకాలను 2020 టోక్యో ఒలింపిక్స్‌లో సాధించింది. ఈ ఎడిషన్‌లో భారత్ ఏకంగా ఏడు పతకాలు ఖాతాలో వేసుకుంది. ఇందులో ఓ గోల్డ్, రెండు సిల్వర్, నాలుగు బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి.
పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించగా.. మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయ్ చాను.. పురుషుల రెజ్లింగ్‌లో రవికుమార్ దాహియా రజత పతకాలను.. మహిళల బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, మహిళల బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గోహెయిన్, పురుషుల రెజ్లింగ్‌లో భజరంగ్ పూనియా, పురుషుల హాకీ టీమ్ కాంస్య పతకాలను సాధించాయి.
జులై 26 నుంచి ప్రారంభంకాబోయే పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ 113 మంది క్రీడాకారులతో 16 విభాగాల్లో పాల్గొంటుంది. మరి ఈసారి భారత్ ఎన్ని పతకాలు సాధిస్తుందో వేచి చూడాలి. ఓవరాల్‌గా భారత్ ఇప్పటివరకు 35 ఒలింపిక్స్ పతకాలు సాధించగా.. ఒక్క పురుషుల హాకీలోనే 11 పతకాలు రావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment