ఇది ఎన్నాళ్ళో వేచిన ఉదయం. ఒకటి రెండు కాదు... 121 ఏళ్ళ నిరీక్షణ ఫలించిన క్షణం. ఆర్మీలో నాయిబ్ సుబేదార్ నీరజ్‌చోప్రా 800 గ్రాముల ఈటెను నేర్పుగా, బలంగా, వ్యూహాత్మకంగా విసిరిన విసురుతో విశ్వవేదికపై అథ్లెటిక్స్‌లో భారత్‌కు మొట్టమొదటిసారిగా ఓ పతకం లభించింది. అదీ... మామూలు మెడల్ కాదు... ఏకంగా స్వర్ణపతకం. వ్యక్తిగత విభాగంలో 13 ఏళ్ళ విరామం తరువాత ఒలింపిక్ గోల్డ్‌తో, మైదానంలో భారత జాతీయ గీతం వినిపించింది. శిక్షణ కోసం హరియాణాలోని గ్రామం నుంచి బస్సులు పట్టుకొని, కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించి, కష్టపడి పైకి వచ్చిన 23 ఏళ్ళ సామాన్య సైనికుడు నీరజ్ నేడు గోల్డెన్ బాయ్ ఆఫ్ భారత్! 1960లో రోమ్‌లో మిల్ఖా సింగ్, 1984లో లాస్ ఏంజెలెస్‌లో పీటీ ఉష లాంటి పరుగుల వీరులకు వెంట్రుకవాసిలో తప్పిన ఒలింపిక్ మెడల్ ఇన్నేళ్ళకు ట్రాక్ అండ్ ఫీల్డ్ (అథ్లెటిక్స్)లో భారత్‌కు దక్కింది. తొలిరోజునే వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయ్ కాంస్యంతో మొదలైన మన టోక్యో ఒలింపిక్స్ ప్రయాణం జావెలిన్‌త్రోలో నీరజ్ అనూహ్య స్వర్ణంతో ఆశావహంగా ముగిసింది. 127 మంది భారీ బృందంతో వెళ్ళిన మనకు దక్కిన ఫలితాలు, నేర్చిన పాఠాలతో భారత క్రీడాచరిత్రలో ఇవి కీలకమైన బంగారు క్షణాలు.
ఒలింపిక్స్‌లో 1900 నుంచి నిరుటి దాకా మొత్తం 24 సార్లలో భారత్ సాధించినవి 28 పతకాలే. ఆదివారం ముగిసిన టోక్యో గేమ్స్‌తో మరో 7 మెడల్స్ చేరి, దేశంలో చిరునవ్వులు మొలిచాయి. పతకాల పట్టికలో 2008 బీజింగ్ గేమ్స్‌లో 51వ స్థానంలో నిలిచిన మనం క్రితంసారి 2016 రియో గేమ్స్‌లో రెండే పతకాలతో 67వ స్థానంలో పడ్డాం. కేవలం 32 లక్షల జనాభా ఉన్న మంగోలియాతో ఆ స్థానం పంచుకున్నాం. మన తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ అంత ఉండే క్యూబా, క్రొయేషియాలు సైతం అప్పట్లో అయిదేసి స్వర్ణపతకాలతో టాప్ 20 దేశాల్లో నిలిచాయి. ఆ రకంగా నిరుటితో పోలిస్తే, ఈసారి మనం మెరుగైన 48వ స్థానానికి ఎగబాకాం. అది సంతోషమే. అయితే, గడచిన అయిదేళ్ళలో దాదాపు రూ. 1169.65 కోట్లు క్రీడా సమాఖ్యలకూ, ఆశావహులకూ ప్రభుత్వం ఖర్చు చేసినా, ఈ మేరకే ఫలితం రావడం ఆలోచించాల్సిన అంశం. దేశంలో దిగువ స్థాయి నుంచి అన్ని ఆటలనూ ప్రోత్సహించే వ్యూహంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఇది మళ్ళీ గుర్తు చేస్తోంది.
తాజా ఒలింపిక్స్ మనకు ఆశ్చర్యకర ఫలితాలిచ్చాయి. తప్పనిసరిగా పతకాలు తెస్తారనుకొన్న కొందరు షూటింగ్, బాక్సింగ్ లాంటి అంశాల్లో నిరాశపరిచారు. అనూహ్యంగా అదితి (గోల్ఫ్), కమల్‌ప్రీత్ కౌర్ (డిస్కస్‌త్రో) లాంటి పలువురు ఆశాకిరణాలుగా అవతరించారు. మన జాతీయ క్రీడ హాకీకి మళ్ళీ ఊపొచ్చింది. ఆకాశంలో సగమనే మహిళలు హాకీ సహా అనేక అంశాల్లో దేశం మనసు గెలిచారు. జాతి ప్రతిష్ఠ పెంచారు. హాకీ పురుషుల విభాగంలో 41 ఏళ్ళ తరువాత ఓ పతకం గెలిచారు. ఆనందం పంచారు. అయితే, మొత్తం మీద చూస్తే మాత్రం భారత ఒలింపిక్స్ బృందం నుంచి ఆశించినన్ని ఫలితాలు రాలేదు. మునుపటి బెస్ట్ (2012 లండన్ ఒలింపిక్స్‌లో 6 మెడల్స్)ను దాటి, ఈసారి 7 మెడల్స్ సాధించి, భవితపై ఆశలు రేపాం. పతకాల సంఖ్య రెండంకెలకు చేరాలనే లక్ష్యాన్ని మాత్రం అందుకోలేకపోయాం. అందుకే ఈ బంగారు క్షణాల్లో చేయాల్సిందీ చాలా ఉంది.
మనకు ప్రతిభకు కొదవ లేదు. కానీ, స్వీయ నియంత్రణ, విశ్వవేదికపై ఒత్తిడిని తట్టుకొనే శక్తి లేవు. బీజింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్ అయిన షూటర్ అభినవ్ బింద్రా అన్నట్టు ‘ఆ ఒక్క శాతమే గెలుపు ఓటముల మధ్య తేడా’ తీసుకొస్తుంది. అది గుర్తించాలి. రెండుపూట్లా కడుపు నిండా తినడానికి తిండి కావాలని హాకీ కర్ర పట్టిన రాణీ రామ్‌పాల్, ఇంటి కోసం అడవికెళ్ళి దుంగలు మోసుకొచ్చిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్, గ్రామంలో ఇంటికి సరైన రోడ్డయినా లేని బాక్సర్ లొవ్లీనా, హాకీలో హ్యాట్రిక్ గోల్స్ కొట్టినా దళితురాలనే ఎగతాళిని ఎదుర్కొన్న వందన... ఇలా ప్రతి అథ్లెట్ ప్రస్థానం ఇప్పుడు స్ఫూర్తి మంత్రం కావాలి. ఈ టోక్యో ఒలింపిక్స్ భారత నారీశక్తికి ప్రతీకగా గుర్తుంటాయి. పితృస్వామ్య సమాజంలో, ఇంటా బయటా ఆహారంలో– విద్యలో– ఉపాధిలో లింగ వివక్ష సాధారణమైన చోట, దళితులు కాబట్టే ఓటమి తప్పలేదనే ఉన్మాదుల మధ్య మహిళలు చేసిన ఈ మ్యాజిక్ అసాధారణం. 2021 దాకా వ్యక్తిగత విభాగాల్లో మనం గెల్చినవి 17 మెడల్స్. వాటిలో స్త్రీలు సాధించినవి అయిదే. కానీ, ఈసారి దేశానికొచ్చిన 5 వ్యక్తిగత పతకాల్లో 3 మహిళలు సంపాదించి పెట్టినవే!
ఈసారి మనవాళ్ళు ఏదో ఒక ఆటలో కాక రకరకాల క్రీడాంశాల్లో మెడల్స్ సంపాదించడం గమ నార్హం. ఆ మేరకు దేశంలో కచ్చితంగా క్రీడోత్సాహం పెరిగింది. దీన్ని అందిపుచ్చుకొని, భారత్‌ను బలమైన క్రీడాశక్తిగా తీర్చిదిద్దాలి. ఆచరణాత్మకమైన బ్లూప్రింట్ అందుకు అవసరం. స్కూలు, లీగ్, జాతీయ స్థాయుల్లో ప్రతిభను ప్రోత్సహించి, ఉత్తమ ఆటగాళ్ళను వడకట్టే క్రికెట్ అకాడెమీల తరహా వ్యూహం ఒలింపిక్ క్రీడలన్నిటికీ మార్గం కావాలి. సర్కారు అండతో, ఉత్తమ కోచ్‌ల నియామకంతో ముందుకు సాగాలి. విలువిద్యలో దిట్ట దక్షిణ కొరియా ఆశావహులు ఒత్తిడిని తట్టుకొనేలా అన్ని వాతావరణాల్లో, వివిధ మైదానాల్లో శిక్షణనిస్తుంది. చైనా స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, షూటింగ్ లాంటి ఏడు అంశాలపై దృష్టి పెట్టి, బంగారు పంటతో అమెరికాను దాటి దూసుకుపోతోంది. వివిధ దేశాల నుంచి ఇలాంటి వ్యూహాలు, పాఠాలు మనం నేర్వాలి. ఆటలంటే విలాసం కాదు, జీవిత విజయానికి పాఠాలనే క్రీడా సంస్కృతిని పెంచాలి. ఆటలంటే అభిమానించే దేశం నుంచి ఆటల్లో దిట్టగా, పతకాల పుట్టగా భారత్ నిలవాలి... గెలవాలి. ‘మిషన్ – 2024 ప్యారిస్ ఒలింపిక్స్’ అదే కావాలి!
మిషన్ 2024
Published Mon, Aug 9 2021 12:01 AM | Last Updated on Mon, Aug 9 2021 12:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment