ఫైనల్లో సాకేత్ జంట
హాంకాంగ్: హాంకాంగ్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని తన భాగస్వామి సనమ్ సింగ్‌తో కలిసి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్-సనమ్ సింగ్ (భారత్) జంట 6-2, 6-1తో నీల్స్ డెసిన్ (జర్మనీ)-మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. కేవలం 34 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి ద్వయం సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. సింగిల్స్ విభాగంలో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్స్‌లో సాకేత్ 6-7 (3/7), 1-6తో కైల్ ఎడ్మండ్ (బ్రిటన్) చేతిలో; సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ 4-6, 4-6తో ఇటో తత్సుమా (జపాన్) చేతిలో ఓడిపోయారు.
లలిత్‌కు మూడో విజయం
జిబ్రాల్టర్: జిబ్రాల్టర్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు వరుసగా మూడో విజయం నమోదు చేశాడు. మూడో రౌండ్‌లో అతను 49 ఎత్తుల్లో డిఫెండింగ్ చాంపియన్ చెపరినోవ్ (బల్గేరియా)పై నెగ్గాడు. దీంతో లలిత్ మూడు పాయింట్లతో సంయుక్తంగా అధిక్యంలో కొనసాగుతున్నాడు. మరో తెలుగు గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 26 ఎత్తుల్లో క్రిస్టియాన్ చిరిలా (రొమేనియా)పై గెలిచాడు. ద్రోణవల్లి హారిక, ఉర్బినా (స్పెయిన్) మధ్య జరిగిన గేమ్ డ్రాగా ముగిసింది.