సాకేత్‌కు డబుల్స్ టైటిల్ | Saket win doubles title | Sakshi
Sakshi News home page

సాకేత్‌కు డబుల్స్ టైటిల్

Published Mon, Apr 25 2016 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 10:39 PM

సాకేత్‌కు డబుల్స్ టైటిల్

సాకేత్‌కు డబుల్స్ టైటిల్

సాక్షి, హైదరాబాద్: టీఏసీ కప్ చైనా ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని సత్తా చాటుకున్నాడు. చైనాలోని నాన్‌జింగ్ నగరంలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో సాకేత్ డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించాడు. సాకేత్ కెరీర్‌లో ఇది ఆరో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. ఏకపక్షంగా జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ సాకేత్-జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) ద్వయం 6-3, 6-3తో డెనిస్ మొల్చనోవ్ (ఉక్రెయిన్)-అలెగ్జాండర్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్తాన్) జంటపై గెలిచింది.

58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సాకేత్-జీవన్ జంట 6-3, 6-2తో రెండో సీడ్ యాన్ బాయ్ (చైనా)-రికార్డో గెడిన్ (ఇటలీ) ద్వయంపై నెగ్గింది. విజేతగా నిలిచిన సాకేత్ జంటకు 3,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement