Jeevan nedunchejiyan
-
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో జీవన్
న్యూఢిల్లీ: గతవారం దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నమెంట్లో సెమీఫైనల్ చేరినందుకు భారత డబుల్స్ ప్లేయర్ జీవన్ నెడుంజెళియన్‌కు తగిన ఫలితం లభించింది. సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో జీవన్ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. చెన్నైకు చెందిన 30 ఏళ్ల జీవన్ భారత్‌కే చెందిన పురవ్ రాజాతో కలిసి దుబాయ్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. గత ర్యాంకింగ్స్‌లో 75వ స్థానంలో ఉన్న జీవన్ ఏడు స్థానాలు ఎగబాకి 68వ ర్యాంక్‌లో నిలిచాడు. పురవ్ రాజా 17 స్థానాలు పురోగతి సాధించి 79వ ర్యాంక్‌కు చేరాడు. రోహన్ బోపన్న 38వ స్థానంలో... దివిజ్ శరణ్ 40వ స్థానంలో... లియాండర్ పేస్ 96వ స్థానంలో ఉన్నారు. సింగిల్స్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ మూడు స్థానాలు పడిపోయి 97వ ర్యాంక్‌లో నిలిచాడు. -
చెంగ్డూ ఓపెన్ రన్నరప్ జీవన్ జంట
కెరీర్లో రెండో ఏటీపీ టోర్నమెంట్ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ క్రీడాకారుడు జీవన్ నెడుంజెళియన్‌కు నిరాశ ఎదురైంది. ఆదివారం చైనాలో ముగిసిన చెంగ్డూ ఓపెన్‌లో జీవన్–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) జంట రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో జీవన్–ఆస్టిన్ ద్వయం 2–6, 4–6తో టాప్ సీడ్ ఇవాన్ డోడిగ్–మ్యాట్ పావిక్ (క్రొయేషియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. రన్నరప్ జీవన్–ఆస్టిన్ జంటకు 30,490 డాలర్ల (రూ. 22 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
జీవన్ జంటకు డబుల్స్ టైటిల్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ ప్లేయర్ జీవన్ నెదున్‌చెజియాన్ తన కెరీర్లో ఐదో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. అమెరికాలో జరిగిన డాలస్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో క్రిస్టోఫర్ రుంగ్‌కాట్ (ఇండోనేసియా)తో కలిసి జీవన్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో జీవన్–రుంగ్‌కాట్ జంట 6–4, 3–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో లియాండర్ పేస్ (భారత్)–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీపై గెలిచింది. టైటిల్ నెగ్గిన జీవన్ జంటకు 4,650 డాలర్ల (రూ. 3 లక్షలు) ప్రైజ్‌మనీ, 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సాకేత్‌కు డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: టీఏసీ కప్ చైనా ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని సత్తా చాటుకున్నాడు. చైనాలోని నాన్జింగ్ నగరంలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో సాకేత్ డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించాడు. సాకేత్ కెరీర్లో ఇది ఆరో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. ఏకపక్షంగా జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ సాకేత్-జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) ద్వయం 6-3, 6-3తో డెనిస్ మొల్చనోవ్ (ఉక్రెయిన్)-అలెగ్జాండర్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్తాన్) జంటపై గెలిచింది. 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జోడీ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సాకేత్-జీవన్ జంట 6-3, 6-2తో రెండో సీడ్ యాన్ బాయ్ (చైనా)-రికార్డో గెడిన్ (ఇటలీ) ద్వయంపై నెగ్గింది. విజేతగా నిలిచిన సాకేత్ జంటకు 3,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
డబుల్స్ సెమీస్‌లో సాకేత్ జంట
నాన్జింగ్ (చైనా): టీఏసీ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని పురుషుల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాకేత్-జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్) జంట 6-1, 6-2తో జోర్డాన్ థాంప్సన్-ఆండ్రూ విటింగ్టన్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. 46 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ద్వయం ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. సింగిల్స్ విభాగంలో మాత్రం సాకేత్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. డానియల్ ఎన్గుయెన్ (అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో సాకేత్ 6-7 (6/8), 6-7 (3/7)తో ఓటమి చవిచూశాడు. మరోవైపు అమెరికాలో జరుగుతున్న ఏటీపీ చాలెంజర్ టోర్నీలో దివిజ్ శరణ్-పురవ్ రాజా (భారత్) జంట కూడా సెమీస్‌కు చేరింది. క్వార్టర్స్‌లో దివిజ్-రాజా 6-3, 7-5తో ఫెర్నాండెజ్-నికొలస్ జారీ (అమెరికా)లపై నెగ్గారు. -
రన్నరప్‌గా సాకేత్ జోడి
సాక్షి, హైదరాబాద్: షెన్జెన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు సాకేత్ మైనేని-జీవన్ నెదున్‌చెజియాన్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాకేత్-జీవన్ 6-3, 4-6, 10-12తో ల్యూక్ సావిల్-జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా)ల చేతిలోపరాజయం చవిచూశాడు -
ఫైనల్లో సాకేత్ జంట
సాక్షి, హైదరాబాద్: షెన్జెన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేనికి మిశ్రమ ఫలితాలు లభించాయి. డబుల్స్ లో జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్)తో కలిసి ఫైనల్లోకి దూసుకెళ్లిన సాకేత్... సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్-జీవన్ జంట 6-2, 6-3తో జెబావి-జాన్ సత్రాల్ (చెక్ రిపబ్లిక్) జోడీపై గెలుపొందింది. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 3-6, 1-6తో ఆడమ్ పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయాడు.