
క్రాల్‌జివో (సెర్బియా): డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్‌లో భారత్ పరాజయం పరిపూర్ణమైంది. రివర్స్ సింగిల్స్‌లోనూ ఓటమే ఎదురవడంతో భారత్ 0–4తో ఆతిథ్య సెర్బియా చేతిలో ఓడిపోయింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ 3–6, 1–6తో వరుస సెట్లలో పెజ క్రిస్టిన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. శనివారమే పరాజయం ఖాయం కావడంతో రివర్స్ సింగిల్స్ పోటీలు నామమాత్రమయ్యాయి.
ఇరు జట్ల సమ్మతితో మరో నామమాత్రమైన ఐదో సింగిల్స్ మ్యాచ్‌ను నిర్వహించలేదు. కొత్త డేవిస్ కప్ నిబంధనల ప్రకారం ఇప్పటికిప్పుడు భారత్ ఆసియా ఓసియానియా గ్రూప్ దశకు పడిపోయే అవకాశం లేదు. అయితే 24 జట్లు ఇంటా, బయటా ఆడే క్వాలిఫయింగ్ టోర్నీలో తలపడాల్సి ఉంటుంది. వచ్చే ఫిబ్రవరిలో ఈ పోటీలు ప్రారంభమవుతాయి.