సింగిల్స్ మ్యాచ్‌ల్లో ఓడిపోయిన శ్రీరామ్ బాలాజీ, రామ్‌కుమార్
స్టాక్‌హోమ్: డేవిస్‌కప్ టీమ్ టెన్నిస్ టోర్నీ వరల్డ్ గ్రూప్–1లో భాగంగా స్వీడన్ జట్టుతో శనివారం మొదలైన మ్యాచ్‌లో తొలి రోజు భారత్‌కు నిరాశ ఎదురైంది. ఆడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ భారత క్రీడాకారులకు ఓటమి ఎదురైంది. 2–0తో ఆధిక్యంలోకి వెళ్లిన స్వీడన్ నేడు జరిగే ఒక డబుల్స్ మ్యాచ్, రెండు రివర్స్ సింగిల్స్‌లలో ఒక విజయం సాధిస్తే గెలుపును ఖరారు చేసుకుంటుంది.
వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు కూడా అర్హత సాధిస్తుంది. తొలి సింగిల్స్‌లో ‘డబుల్స్ స్పెషలిస్ట్’ శ్రీరామ్ బాలాజీ 4–6, 2–6తో ప్రపంచ 238వ ర్యాంకర్ ఇలియాస్ యెమెర్ చేతిలో ఓడిపోగా... రెండో సింగిల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్ 3–6, 3–6తో లియో బోర్గ్ చేతిలో పరాజయం పాలయ్యాడు.
సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ వెన్నునొప్పితో స్వీడన్‌తో పోరు నుంచి వైదొలిగాడు. దాంతో సుమిత్ స్థానంలో శ్రీరామ్‌ను ఆడించాల్సి వచ్చింది. నేడు జరిగే మూడు మ్యాచ్‌ల్లో భారత్ గెలిస్తేనే వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు అర్హత పొందుతుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి... ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందడం రెండుసార్లు (2010లో బ్రెజిల్‌పై, 2018లో చైనాపై) మాత్రమే జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment