పాక్‌ వెళ్లేందుకు సుముఖంగా లేని సుమిత్, శశి.. కారణం? | Davis Cup Sumit Nagal Shashi Mukund Refuse To Travel Pakistan | Sakshi
Sakshi News home page

Davis Cup: పాక్‌ వెళ్లేందుకు సుముఖంగా లేని సుమిత్, శశి.. కారణం?

Nov 25 2023 8:57 AM | Updated on Nov 25 2023 3:44 PM

Davis Cup Sumit Nagal Shashi Mukund Refuse To Travel Pakistan - Sakshi

సుమిత్‌ నాగల్‌ (ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ: భారత సింగిల్స్‌ టెన్నిస్‌ స్టార్లు సుమిత్‌ నగాల్, శశికుమార్‌ ముకుంద్‌ పాకిస్తాన్‌లో డేవిస్‌ కప్‌ ఆడేందుకు నిరాకరించారు. డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌–1 ప్లేఆఫ్‌ ‘టై’లో భాగంగా భారత్‌ వచ్చే ఫిబ్రవరిలో పాకిస్తాన్‌తో తలపడాల్సివుంది.

అయితే భారత్‌ తరఫున ఉత్తమ సింగిల్స్‌ ప్లేయర్లు అయిన సుమిత్‌ నగాల్‌ (141 ర్యాంకు), శశికుమార్‌ (477 ర్యాంకు) చిరకాల ప్రత్యర్థితో ఆడేందుకు విముఖత వ్యక్తం చేశారు. అయితే వారిద్దరు వైదొలగేందుకు కారణాలు వెల్లడించలేదు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నగాల్‌ తనకు అంతగా అలవాటు లేని గ్రాస్‌ కోర్టులో ఆడేందుకు సిద్ధంగా లేనని అన్నాడు.

అదే కారణమా?
ఇక హార్డ్‌ కోర్టుల్లో రాణించే సుమిత్‌ ఈ కారణంతో పాక్‌ వెళ్లేందుకు ఆసక్తి చూపించకపోగా, శశికుమార్‌ ముకుంద్‌ మాత్రం ప్రత్యేకించి ఏ కారణం చెప్పకుండానే తప్పుకొన్నట్లు తెలిసింది. ఆలిండియా టెన్నిస్‌ అసోసియేషన్‌ (ఐటా) దేశం తరఫున ఆడేందుకు నిరాకరించిన ఆటగాళ్లపై అసంతృప్తి వెలిబుచ్చింది.

ఇలా చేయడం తప్పు
‘ఇది చాలా తప్పు. దేశానికి ప్రాతినిధ్యం వహించాల్సినపుడు ఇలాంటి కారణాలు చూపడం ఏమాత్రం  సమంజసం కాదు. ఈ విషయాన్ని ఎగ్జిక్యూటివ్‌ కమిటీ దృష్టికి తీసుకెళ్లాం’ అని ఐటా ఉన్నతాధికారి తెలిపారు.  

సెమీస్‌లో శ్రీవల్లి రష్మిక
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల ప్రపంచ టెన్నిస్‌ టూర్‌ టోర్నీలో హైదరాబాద్‌ ప్లేయర్‌ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 21 ఏళ్ల శ్రీవల్లి 6–1, 6–4తో భారత్‌కే చెందిన వైష్ణవి అడ్కర్‌పై సునాయాస విజయం సాధించింది.

సెమీస్‌లో రష్మిక థాయ్‌లాండ్‌కు చెందిన రెండో సీడ్‌ లాన్లానా తారరుదితో తలపడుతుంది. క్వార్టర్స్‌లో ఆమె 6–1, 6–2తో ఏడో సీడ్‌ డిలెటా చెరుబిని (ఇటలీ)ని  ఓడించింది. ఈ టోరీ్నలో హైదరాబాదీ యువతారతో పాటు మరో ఇద్దరు భారత క్రీడాకారిణులు జీల్‌ దేశాయ్, రుతూజ భోసలే సెమీస్‌కు దూసుకెళ్లారు. క్వార్టర్‌ ఫైనల్లో జీల్‌ దేశాయ్‌ 3–6, 6–7 (8/2), 6–4తో అంటోనియా షమిడ్త్‌ (జర్మనీ)పై చెమటోడ్చి నెగ్గింది. రుతూజ 7–6 (8/4), 1–6, 6–1తో కజకిస్తాన్‌కు చెందిన ఐదో సీడ్‌ జిబెక్‌ కులంబయెవాను కంగుతినిపించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement