న్యూఢిల్లీ: భారత సింగిల్స్ స్టార్ సుమిత్ నగాల్ ఉద్దేశపూర్వకంగానే వరుసగా డేవిస్ కప్ పోటీలకు దూరమవుతున్నాడని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ఆరోపించింది. గాయాలు, ఇతరత్రా కారణాలతో ఈ ఏడాది నగాల్... పాకిస్తాన్, స్వీడెన్‌లతో జరిగిన డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 టై లకు గైర్హాజరయ్యాడు.
ఇటీవల స్టాక్‌హోమ్‌లో జరిగిన పోరులో భారత్ 0–4తో స్వీడెన్‌తో చిత్తుగా ఓడింది. సుమిత్, యూకీ బంబ్రీలాంటి స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగితే కచ్చితంగా ఫలితాలు మరోలా ఉండేవని ‘ఐటా’ కార్యదర్శి అనిల్ ధూపర్ వివరించారు. స్టాక్‌హోమ్‌కు వెళ్లిన భారత జట్టులో ఒక్క రామ్‌కుమార్ రామనాథన్ మాత్రమే అనుభవజు్ఞడని, డబుల్స్ స్పెషలిస్టు శ్రీరామ్ బాలాజీని సింగిల్స్‌లో ఆడించామని చెప్పారు.
ఆర్యన్ షా, సిద్ధార్థ్ విశ్వకర్మ అరంగేట్రం చేసిన ఆటగాళ్లని... అందువల్లే భారత్ చిత్తుగా ఓడిందని ఆయన అన్నారు. వెన్ను గాయాన్ని కారణంగా చూపించిన నగాల్ అదే సమయంలో చైనాలో ఏటీపీ టోర్నీ ఆడుతున్నాడని దుయ్యబట్టారు. డేవిస్ కప్ అనేది కేవలం ఒక టెన్నిస్ టోర్నమెంట్ కాదని... దేశానికి ప్రాతినిధ్యం వహించడమని చెప్పుకొచ్చారు. ముకుంద్ శశికుమార్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తామని, వచ్చి డేవిడ్ కప్ ఆడాలని విజ్ఞప్తి చేసినా...అతనూ పట్టించుకోలేదని ధూపర్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment