స్వీడన్‌తో ఈనెల 14, 15వ తేదీల్లో జరిగే డేవిస్ కప్ టీమ్ టెన్నిస్ మ్యాచ్‌కు భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ దూరమయ్యాడు. వెన్నెముక గాయంతో సతమతమవుతున్న అతను ఈ ఏడాది వరుసగా రెండోసారి డేవిస్ కప్ టోర్నీకి గైర్హాజరు కానున్నాడు. పాకిస్తాన్‌లో ఫిబ్రవరిలో జరిగిన ఈవెంట్‌లోనూ అతను బరిలోకి దిగలేదు. దీంతో రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న ఆర్యన్ షాను ప్రధాన జట్టులోకి తీసుకున్నారు.
అదే విధంగా.. మానస్ ధామ్నేను స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు. కాగా స్టాక్‌హోమ్‌లో జరిగే వరల్డ్ గ్రూప్–1 పోరులో ఆతిథ్య స్వీడన్‌తో భారత్ తలపడుతుంది. ఇదివరకే అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) భారత జట్టును ప్రకటించింది. జాతీయ మాజీ చాంపియన్ అశుతోష్ సింగ్‌ను కోచ్‌గా నియమించింది.
అందుకే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా
‘స్వీడన్‌తో జరిగే పోరుకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని భావించాను. కానీ దురదృష్టవశాత్తూ కొన్ని వారాలుగా వెన్నునొప్పి బాధిస్తోంది. దీంతో డాక్టర్లు కనీసం రెండు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో సన్నద్ధమయ్యేందుకు సరైన సమయంలేదు.
కాబట్టే స్వీడన్ ఈవెంట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఇటీవల యూఎస్ ఓపెన్ ఆడుతున్నప్పుడు కూడా వెన్ను సమస్య వేధించింది. ఏదేమైనా డేవిస్ కప్ టోర్నీకి దూరమవడం చాలా బాధగా ఉంది. ఆ టోర్నీలో ఆడబోయే జట్టు రాణించాలని ఆకాంక్షిస్తున్నా’ అని నగాల్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment