భారత డేవిస్‌ కప్‌ జట్టులో నగాల్‌ | Nagal in the Indian Davis Cup team | Sakshi
Sakshi News home page

భారత డేవిస్‌ కప్‌ జట్టులో నగాల్‌

Aug 17 2024 4:00 AM | Updated on Aug 17 2024 4:00 AM

Nagal in the Indian Davis Cup team

యూకీ బాంబ్రీ దూరం 

వచ్చేనెల 14, 15 తేదీల్లో స్వీడన్‌తో పోరు 

న్యూఢిల్లీ: భారత సింగిల్స్‌ టాప్‌స్టార్‌ సుమిత్‌ నగాల్‌ తిరిగి డేవిస్‌ కప్‌ జట్టులోకి వచ్చేశాడు. వరల్డ్‌ గ్రూప్‌–1 పోరులో భాగంగా భారత్‌ వచ్చే నెల స్వీడన్‌తో తలపడనుంది. సెపె్టంబర్‌ 14, 15 తేదీల్లో స్టాక్‌హోమ్‌లోని ఇండోర్‌ హార్డ్‌ కోర్ట్‌ వేదికపై జరిగే ఈ పోటీలకు డబుల్స్‌ స్టార్‌ యూకీ బాంబ్రీ దూరమయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో నగాల్‌... ఇస్లామాబాద్‌లో పాకిస్తాన్‌తో జరిగిన డేవిస్‌ కప్‌ పోరుకు దూరంగా ఉన్నాడు. అక్కడ గ్రాస్‌కోర్ట్‌పై అనాసక్తి కనబరిచిన సుమిత్‌ ఇప్పుడు హార్డ్‌కోర్ట్‌లో జరిగే పోటీలకు అందుబాటులోకి వచ్చాడు. 

భారత టాప్‌–3 ప్లేయర్, ప్రపంచ 476 ర్యాంకర్‌ శశికుమార్‌ ముకుంద్‌పై రెండు ‘టై’ల సస్పెన్షన్‌ ఉండటంతో అతన్ని ఎంపిక చేయలేదు. వరుసగా డేవిస్‌ కప్‌ టోరీ్నలకు గైర్హాజరు అవుతుండటంతో అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సమావేశమైన ఐటా సెలక్షన్‌ కమిటీ సుమిత్‌ నగాల్, రామ్‌కుమార్‌ రామనాథన్, శ్రీరామ్‌ బాలాజీ, నికీ పునాచా,  సిద్ధార్థ్‌ విశ్వకర్మలను ఎంపిక చేసింది. రోహిత్‌ రాజ్‌పాల్‌ కెప్టెన్‌గా వ్యవహరించే ఈ జట్టుకు ఆర్యన్‌ షా రిజర్వ్‌ ప్లేయర్‌గా ఉంటాడు. 

యూకీ అందుబాటులో లేకపోవడంతో రామ్‌కుమార్‌ సింగిల్స్‌తో పాటు డబుల్స్‌లోనూ బరిలోకి దిగుతాడు. యూకీ తన గైర్హాజరుకు గల కారణాలు బయటికి వెల్లడించనప్పటికీ... పారిస్‌ ఒలింపిక్స్‌కు రోహన్‌ బోపన్నకు జోడీగా తనను పంపకపోవడంపై కినుక వహించినట్లు తెలిసింది. అయితే ఇందులో ‘ఐటా’ చేసిందేమీ లేదని వెటరన్‌ స్టార్‌ బోపన్న తన భాగస్వామిగా శ్రీరామ్‌ బాలాజీని ఎంచుకోవడంతో అతన్నే పంపాల్సివచ్చిందని ఐటా వర్గాలు వెల్లడించాయి. 

జీషాన్‌ అలీ కోచ్‌ పదవి నుంచి తప్పుకోవడంతో మాజీ ఢిల్లీ ప్లేయర్‌ అశుతోశ్‌ సింగ్‌కు కోచింగ్‌ బాధ్యతలు అప్పగించే అవకాశముంది.బాలచంద్రన్‌ పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ ఐటా సెలక్షన్‌ కమిటీ అశుతోశ్‌ వైపు మొగ్గుచూపుతోంది. ప్రస్తుతానికి భారత డేవిస్‌ కప్‌ జట్టును ఎంపిక చేశామని కోచ్‌పై తుది నిర్ణయం తీసుకోలేదని ఐటా కార్యదర్శి అనిల్‌ ధూపర్‌ తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement