డేవిస్‌కప్ టెన్నిస్ టోర్నీలో ఓటమి
ఇక వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌లో పోటీ
స్టాక్‌హోమ్: అగ్రశ్రేణి క్రీడాకారులు సుమిత్ నగాల్, యూకీ బాంబ్రీ లేకుండానే డేవిస్‌కప్ ప్రపంచ టీమ్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్–1లో పోటీపడ్డ భారత జట్టుకు నిరాశాజనక ఫలితం ఎదురైంది. స్వీడన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారతజట్టు 0–4తో ఓడిపోయింది. డేవిస్‌కప్ టోర్నీ చరిత్రలో స్వీడన్ జట్టు చేతిలో భారత జట్టుకిది వరుసగా ఆరో పరాజయం కావడం గమనార్హం. స్వీడన్‌తో పోటీపడ్డ ఆరుసార్లూ భారత జట్టు ఓడిపోయింది.
ఈసారి మాత్రం భారత ఆటగాళ్లు నాలుగు మ్యాచ్‌లు ఆడినా కనీసం ఒక్క సెట్ కూడా గెలవలేకపోయారు. తొలి రోజు శనివారం రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో భారత క్రీడాకారులు ఓడిపోయారు. ఫలితంగా తదుపరి దశకు అర్హత పొందాలంటే ఆదివారం మూడు మ్యాచ్‌ల్లోనూ (డబుల్స్, రెండు రివర్స్ సింగిల్స్) భారత ప్లేయర్లు తప్పనిసరిగా గెలవాలి.
అయితే డబుల్స్ మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ–రామ్‌కుమార్ రామనాథన్ జోడీ 3–6, 4–6తో ఆండ్రీ గొరాన్సన్–ఫిలిప్ బెర్గెవి జంట చేతిలో ఓటమి పాలైంది. దాంతో స్వీడన్ జట్టు 3–0తో విజయాన్ని ఖరారు చేసుకొని వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు అర్హత పొందింది. ఫలితం తేలిపోవడంతో నాలుగో మ్యాచ్‌గా జరిగిన నామమాత్రమైన సింగిల్స్‌లో జాతీయ మాజీ చాంపియన్ సిద్ధార్థ్ విశ్వకర్మను బరిలోకి దించారు.
డేవిస్‌కప్‌లో తొలిసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధార్థ్ 2–6, 2–6తో ఇలియాస్ యామెర్ చేతిలో ఓడిపోయాడు. ఈ పరాజయంతో భారత జట్టు వచ్చే ఏడాది డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1లో చోటు సంపాదించేందుకు ప్లే ఆఫ్ దశ మ్యాచ్‌లు ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment