భారత టెన్నిస్ స్టార్, నంబర్‌వన్ సింగిల్స్ ప్లేయర్ సుమిత్ నగాల్ గురించి షాకింగ్ విషయం బయటకు వచ్చింది. దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు అతడు ఫీజును డిమాండ్ చేసినట్లు తెలిసింది. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మరోవైపు నగాల్ కూడా దీన్ని తోసిపుచ్చలేదు. ‘స్టాండర్డ్ ప్రాక్టీస్’ కోసమే అడిగినట్లు సోషల్ మీడియా వేదికగా అంగీకరించాడు కూడా!
‘ఐటా’ విమర్శలు
కాగా నగాల్ ఈ ఏడాది అదేపనిగా డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 టైలకు దూరమయ్యాడు. ఫిబ్రవరిలో పాకిస్తాన్‌లో ఆడేందుకు నిరాకరించిన అతను ఇటీవల స్వీడెన్‌లో జరిగిన పోటీలకు వెన్ను గాయం సాకుతో దూరంగా ఉన్నాడు. అయితే చైనాలో జరుగుతున్న హాంగ్జౌ ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్ ఆడేందుకు వెళ్లడంపై ‘ఐటా’ బాహాటంగా విమర్శలు గుప్పించింది.
దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు సాకులు చెబుతున్న ఆటగాడు ఏటీపీ టోర్నీ ఆడేందుకు సై అంటున్నాడని నగాల్‌ను ఉద్దేశించి ‘ఐటా’ వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే.. యూకీ బాంబ్రీ, శశికుమార్ ముకుంద్‌లు కూడా డేవిస్ కప్ ఆడలేదు. ఈ నేపథ్యంలో స్వీడెన్‌తో స్పెషలిస్ట్ సింగిల్స్ ప్లేయర్ అందుబాటులో లేకపోవడంతో భారత్ 0–4తో చిత్తుగా ఓడింది.
రూ.45 లక్షలు అడిగాడు
ఈ నేపథ్యంలో.. ‘ఐటా’ అధ్యక్షుడు అనిల్ ధూపర్ మాట్లాడుతూ ‘ఎవరైనా దేశానికి ఆడేందుకు డబ్బులు డిమాండ్ చేస్తారా చెప్పండి. సుమిత్ నగాల్ తనకు వార్షిక ఫీజుగా 50 వేల డాలర్లు (సుమారు రూ.45 లక్షలు) చెల్లించాలని డిమాండ్ చేశాడు. చెల్లింపులు జరగలేదు కాబట్టే అతను ఆడటం లేదు.
ఇదేం పద్ధతి. ఇది తప్పా ఒప్పా అనేది జాతి తెలుసుకోవాలి. ప్రభుత్వం నిర్ణయానికి రావాలి. ఎందుకంటే ప్రతిభ, ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేసిన ఆటగాళ్లకు ‘టాప్స్’ నిధులు అందుతున్నాయి. డేవిస్ కప్ ఆడేందుకు నిర్ణీత మొత్తం చెల్లింపులు కూడా జరుగుతున్నాయి.
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) నుంచి డేవిస్ కప్‌లో ఆడుతున్నందుకు పార్టిసిపేషన్ ఫీజుగా సుమారు రూ.30 లక్షలు వస్తున్నాయి. ఇందులో నుంచి 70 శాతం ఆటగాళ్లకే చెల్లిస్తున్నాం. కేవలం 30 శాతం మాత్రమే ‘ఐటా’ వద్ద ఉంటున్నాయి’ అని వివరించారు.
ఇదీ సుమిత్ వాదన... అందుకే ఫీజు అడిగాను
‘ఐటా’ వ్యాఖ్యల్ని టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగాల్ ఖండించలేదు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన వాదన వినిపించాడు. ‘ఫీజు అడిగిన మాట వాస్తవమే. దీనిపై మీకు స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఆటగాళ్లు సన్నద్ధమయ్యేందుకు ఖర్చులెన్నో ఉంటాయి. నేను డిమాండ్ చేసిన పరిహారం కూడా ఆ కోవకే చెందుతుంది.
స్టాండర్డ్ ప్రాక్టీస్ కోసమే నేను డిమాండ్ చేశాను తప్ప... డబ్బులు గుంజాలనే ఉద్దేశం కాదు. దేశానికి ఆడటమనేది ఎవరికైనా గర్వకారణమే. అదో గొప్ప గౌరవం. అయితే నేను వెన్నునొప్పి వల్లే స్వీడెన్‌తో డేవిస్ కప్ ఆడలేకపోయాను. ఇప్పుడు కూడా ఇదే సమస్య వల్ల చైనా ఓపెన్ నుంచి కూడా వైదొలిగాను’ అని వివరణ ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment