ita
-
డబ్బు ఇస్తేనే భారత్‌కు ఆడతా.. కారణం చెప్పిన నగాల్
భారత టెన్నిస్ స్టార్, నంబర్‌వన్ సింగిల్స్ ప్లేయర్ సుమిత్ నగాల్ గురించి షాకింగ్ విషయం బయటకు వచ్చింది. దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు అతడు ఫీజును డిమాండ్ చేసినట్లు తెలిసింది. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మరోవైపు నగాల్ కూడా దీన్ని తోసిపుచ్చలేదు. ‘స్టాండర్డ్ ప్రాక్టీస్’ కోసమే అడిగినట్లు సోషల్ మీడియా వేదికగా అంగీకరించాడు కూడా!‘ఐటా’ విమర్శలుకాగా నగాల్ ఈ ఏడాది అదేపనిగా డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1 టైలకు దూరమయ్యాడు. ఫిబ్రవరిలో పాకిస్తాన్లో ఆడేందుకు నిరాకరించిన అతను ఇటీవల స్వీడెన్‌లో జరిగిన పోటీలకు వెన్ను గాయం సాకుతో దూరంగా ఉన్నాడు. అయితే చైనాలో జరుగుతున్న హాంగ్జౌ ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్ ఆడేందుకు వెళ్లడంపై ‘ఐటా’ బాహాటంగా విమర్శలు గుప్పించింది. దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు సాకులు చెబుతున్న ఆటగాడు ఏటీపీ టోర్నీ ఆడేందుకు సై అంటున్నాడని నగాల్‌ను ఉద్దేశించి ‘ఐటా’ వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే.. యూకీ బాంబ్రీ, శశికుమార్ ముకుంద్‌లు కూడా డేవిస్ కప్ ఆడలేదు. ఈ నేపథ్యంలో స్వీడెన్‌తో స్పెషలిస్ట్ సింగిల్స్ ప్లేయర్ అందుబాటులో లేకపోవడంతో భారత్ 0–4తో చిత్తుగా ఓడింది. రూ.45 లక్షలు అడిగాడుఈ నేపథ్యంలో.. ‘ఐటా’ అధ్యక్షుడు అనిల్ ధూపర్ మాట్లాడుతూ ‘ఎవరైనా దేశానికి ఆడేందుకు డబ్బులు డిమాండ్ చేస్తారా చెప్పండి. సుమిత్ నగాల్ తనకు వార్షిక ఫీజుగా 50 వేల డాలర్లు (సుమారు రూ.45 లక్షలు) చెల్లించాలని డిమాండ్ చేశాడు. చెల్లింపులు జరగలేదు కాబట్టే అతను ఆడటం లేదు.ఇదేం పద్ధతి. ఇది తప్పా ఒప్పా అనేది జాతి తెలుసుకోవాలి. ప్రభుత్వం నిర్ణయానికి రావాలి. ఎందుకంటే ప్రతిభ, ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేసిన ఆటగాళ్లకు ‘టాప్స్’ నిధులు అందుతున్నాయి. డేవిస్ కప్ ఆడేందుకు నిర్ణీత మొత్తం చెల్లింపులు కూడా జరుగుతున్నాయి.అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) నుంచి డేవిస్ కప్‌లో ఆడుతున్నందుకు పార్టిసిపేషన్ ఫీజుగా సుమారు రూ.30 లక్షలు వస్తున్నాయి. ఇందులో నుంచి 70 శాతం ఆటగాళ్లకే చెల్లిస్తున్నాం. కేవలం 30 శాతం మాత్రమే ‘ఐటా’ వద్ద ఉంటున్నాయి’ అని వివరించారు. ఇదీ సుమిత్ వాదన... అందుకే ఫీజు అడిగాను‘ఐటా’ వ్యాఖ్యల్ని టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగాల్ ఖండించలేదు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన వాదన వినిపించాడు. ‘ఫీజు అడిగిన మాట వాస్తవమే. దీనిపై మీకు స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఆటగాళ్లు సన్నద్ధమయ్యేందుకు ఖర్చులెన్నో ఉంటాయి. నేను డిమాండ్ చేసిన పరిహారం కూడా ఆ కోవకే చెందుతుంది.స్టాండర్డ్ ప్రాక్టీస్ కోసమే నేను డిమాండ్ చేశాను తప్ప... డబ్బులు గుంజాలనే ఉద్దేశం కాదు. దేశానికి ఆడటమనేది ఎవరికైనా గర్వకారణమే. అదో గొప్ప గౌరవం. అయితే నేను వెన్నునొప్పి వల్లే స్వీడెన్‌తో డేవిస్ కప్ ఆడలేకపోయాను. ఇప్పుడు కూడా ఇదే సమస్య వల్ల చైనా ఓపెన్ నుంచి కూడా వైదొలిగాను’ అని వివరణ ఇచ్చాడు.చదవండి: చెస్ ఒలింపియాడ్: పసిడి వేటలో మరో విజయం -
ది కశ్మీర్ ఫైల్స్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డ్.. వివేక్ అగ్నిహోత్రి ట్వీట్
ఎలాంటి అంచనాలు లేకుండా సంచలన విజయం సాధించిన హిందీ చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. కశ్మీర్ పండిట్ల ఊచకోత నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా రూ.340 కోట్లు వసూళ్లతో రికార్డు సృష్టించింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నీహోత్రి దర్శకత్వం వహించగా.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ఇండియన్ టెలివిజన్ అకాడమీ-2022 అవార్డుకు ఎంపికైంది. ఈ చిత్రం గోల్డెన్ ఫిల్మ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా గుర్తింపు పొందింది. తాజాగా ఈ అవార్డును చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఈ అవార్డు ఉగ్రవాద బాధితులందరికీ అంకితమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. This award for #TheKashmirFiles being honoured as the Golden Film of Indian cinema is dedicated to all the victims of religious terrorism. @TheITA_Official #KashmirHinduGenocide pic.twitter.com/Uc6RpREPbm — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) December 12, 2022 -
నేషనల్ టెన్నీస్ క్రీడలు
కావలిఅర్బన్ : ఆల్ ఇండియా టెన్నీస్ అసోసియేషన్ (ఐటా) ఆధ్వర్యంలో బుధవారం జరిగిన నేషనల్ సిరీస్ అండర్-16 క్రీడలు హోరాహోరీగా సాగాయి. 14 రాష్ట్రాలకు చెందిన 24 మంది క్రీడాకారులు బాలుర, బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో తలపడ్డారు. విట్స్ కళాశాల, జవహార్ భారతి డిగ్రీ కళాశాల, అఫిషియల్ క్లబ్ ప్రాంగణాల్లో ఈ క్రీడలు జరిగాయి. బాలుర సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో అనేక మంది క్రీడాకారులు గెలుపొందారు. కవన్ సోము కుమార్ (కర్ణాటక), ఇక్బాల్ మహ్మద్‌ఖాన్ (ఏపీ)పై 6–4, 6–7 స్కోర్ తేడాతో విజయం సాధించాడు. ఎస్ భూపతి (టీఎన్), అర్తవ వీమా(ఎంపీ)పై 6–4, 6–3 తేడాతో గెలుపొందారు. అమాంక్ పటేల్ (గుజరాత్), నితిన్ ధీటా (టీఎన్)పై 6–4,6–7 తేడాతో విజయం సాధించారు. తనిష్క మల్పానీ (ఏపీ) అముర్తజాయ్ మోహంతి (ఒడిశా)పై 6–1, 6–0 తో గెలుపొందారు. విపుల్ మెహతా (ఢిల్లీ), అఖిల్‌కుమార్‌రెడ్డి(టీఎస్)పై 6–1,6–2తో విజయం సాధించాడు. ముషరత్ అర్జున్ షేక్ (ఏపీ), పూజా ఇంగాలే (ఎంపీ)పై 6–4, 6–2 తేడాతో గెలుపొందారు. అసపర్ జనరిట (ఏపీ), త్రిష వినోద్ పి (కేఎల్)పై 4–6,5–7 స్కోర్ తేడాతో గెలుపొందాడు. భక్లిభరత్ పర్వానీ (జీజే), సృజన రాయ్రాల(టీఎస్)పై 7–5, 7–5 తేడాతో గెలుపొందారు. హెహనా సురేష్(టీఎస్), ఆనంద్ ధర్న ముదలియార్ (సీఎల్)పై 6–4, 6–4 తేడాతో గెలుపొందాడు. టోర్నమెంట్ చైర్మన్ డాక్టర్ లక్ష్మీనరసారెడ్డి, అధ్యక్షుడు వినయకుమార్ రెడ్డి, టోర్నమెంట్ డైరెక్టర్ విద్యాధర్కుమార్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అనుమాలశెట్టి రామకృష్ణ, పీడీలు మాల్యాద్రి, కోటేశ్వరమ్మ, ప్రసాద్ రెడ్డి, విట్స్ పీడీ చిన్నా, రమణయ్య, వెక్ పీడీ భాస్కర్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
టీ అసోసియేషన్ కీలక నిర్ణయం
జమ్మూ కాశ్మీర్ లో టెర్రర్ దాడుల నేపథ్యంలో ఇండియన్ టీ ఆసోసియేషన్ (ఐటీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కోరితే పాకిస్తాన్ తో టీ వ్యాపారం రద్దు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఐటీఏ ప్రకటించింది. ఈ మేరకు బోర్డు నిర్ణయించినట్టు ఐటీఏ ఛైర్మన్ అజాం మెనం పీటీఐకి చెప్పారు. టీ వాణిజ్యానికి సంబంధించి పాకిస్తాన్ ముఖ్యమైనప్పటికీ, ఎగుమతులు నిలిపివేత ప్రభావం తమ వ్యాపారంపై అంతగా ఉండదన్నారు. ఈ అంశంలో తమకు టీ బోర్డు మార్గనిర్దేశం చేస్తుందని భావిస్తున్నానన్నారు. దక్షిణ భారతంనుంచి80 శాతం, ఉత్తర భారతదేశం నుంచి 20 శాతం పాకిస్తాన్ టీ దిగుమతి చేసుకుంటుందని మెనం వివరించారు. మొత్తం 230 మిలియన్ కేజీల ఎగుమతుల్లో పాకిస్తాన్ వాటా15 నుంచి 18 మిలియన్ కేజీలని వివరించారు. భారతదేశం యొక్క ఎగుమతి మార్కెట్లలో రష్యా, కజఖిస్తాన్, అమెరికా, చైనా, ఇరాన్, ఈజిప్ట్ , లాటిన్ అమెరికా ఉన్నాయన్నారు. సాధారణంగా శ్రీలంక, కెన్యాలనుంచి పాకిస్తాన్ టీ కొనుగోలు చేస్తుందని,ధరలు చవగ్గా ఉన్నపుడు భారత్ నుంచి దిగుమతి చేసుకుంటుందని తెలిపారు. కన్సల్టేటివ్ కమిటీ ఆఫ్ ప్లాంటేషన్ అసోసియేషన్ (సీసీపీఏ) ప్రెసిడెంట్ కూడా అయిన అజాం దక్షిణ భారత యునైటెడ్ ప్లాంటర్స్ అసోసియేషన్ కి కూడా విజ్ఞప్తి చేశారు. -
హోరాహోరీగా టెన్నిస్ పోటీలు
గుంటూరు స్పోర్ట్స్ : అండర్–14 బాలబాలికల ఐటా టెన్నిస్ టోర్నమెంట్ హోరాహోరీగా సాగుతోంది. టోర్నమెంట్ బాలికల విభాగంలో సెమీ ఫైనల్స్‌కు చేరగా, బాలుర విభాగంలో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ టెన్నిస్ కోర్టులలో ఆదివారం బాలికల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లలో లేళ్ళ ఆశ్రిత (గుంటూరు) 7–1 స్కోర్‌తో పి.లావణ్య (విజయవాడ)పై విజయం సాధించింది. అలాగే, ఆర్ఆర్వీ శరణ్య (విశాఖ) 7–5 స్కోర్‌తో ప్రవల్లిక (విజయవాడ)పై, సాత్విక (విశాఖ) 7–0 స్కోర్‌తో ఈషసాయి మండవ (హైదరాబాద్)పై, జ్ఞానిత (విశాఖ) 7–0 స్కోర్‌తో చింత రాగిణి (విశాఖ)పై విజయం సాధించి సెమీ ఫైనల్స్‌కు చేరారు. టెన్నిస్ పోటీలను ఐటా చీఫ్ రిఫరీ శ్రీకుమార్, టెన్నిస్ కోచ్ శివ ప్రసాద్ పర్యవేక్షించారు. -
ఐటా టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం
గుంటూరు స్పోర్ట్స్: రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు అన్నారు. శనివారం బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అండర్–14 బాల బాలికల ఐటా టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం అయ్యింది. ముఖ్యఅతిథులు దామచర్ల శ్రీనివాసరావు, డాక్టర్ పోట్ల శివయ్య క్రీడాకారులను పరిచయం చేసుకొన్నారు. ఈ సందర్భంగా పోట్ల శివయ్య క్రీడాకారులకు అల్పహరం అందించారు. టోర్నమెంట్లో ఆంధ్ర, తెలంగాణ , కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. టోర్నమెంట్‌ను ఐటా చీఫ్ రిఫరీ శ్రీకుమార్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో సంపత్ కుమార్, డాక్టర్ రవి, కమల్, చౌదరి, టెన్నిస్ కోచ్ శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.