
చార్ల్స్‌టన్ : అమెరికా టెన్నిస్ స్టార్ జెస్సికా పెగూలా తన కెరీర్‌లో ఎనిమిదో సింగిల్స్ టైటిల్‌ను సాధించింది. చార్ల్స్‌టన్ ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో పెగూలా చాంపియన్‌గా అవతరించింది. అమెరికాకే చెందిన సోఫియా కెనిన్‌తో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో పెగూలా 6–3, 7–5తో గెలుపొందింది.
ఈ సీజన్‌లోని పెగూలాకిది రెండో టైటిల్. ఈ విజయంతో పెగూలా తన కెరీర్ బెస్ట్ మూడో ర్యాంక్‌ను అందుకుంది. విజేతగా నిలిచిన పెగూలాకు 1,64,000 డాలర్ల (రూ. 1 కోటీ 40 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
మెయిన్ ‘డ్రా’కు నగాల్ అర్హత
మోంజా (ఇటలీ): భారత పురుషుల టెన్నిస్ సింగిల్స్ నంబర్‌వన్ సుమిత్ నగాల్ మోంజా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. ఫెడరికో ఇనాకోన్ (ఇటలీ)తో సోమవారం జరిగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌లో సుమిత్ నగాల్ 6–4, 6–2తో గెలుపొంది మెయిన్ ‘డ్రా’లో చోటు సంపాదించాడు.
93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నగాల్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. అంతకుముందు క్వాలిఫయింగ్ తొలి రౌండ్ మ్యాచ్‌లో నగాల్ 5–7, 7–6 (7/2), 6–2తో ఎర్గీ కిర్‌కిన్ (టర్కీ)పై గెలుపొందాడు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో ఆస్ట్రియా ప్లేయర్ ఫిలిప్ మిసోలిచ్‌తో సుమిత్ ఆడతాడు.
28వ ర్యాంక్‌లో యూకీ బాంబ్రీ
సోమవారం విడుదల చేసిన ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో యూకీ బాంబ్రీ భారత నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. యూకీ రెండు స్థానాలు పడిపోయి 28వ ర్యాంక్‌లో నిలిచాడు. ఆరేళ్లుగా డబుల్స్‌లో భారత నంబర్‌వన్‌గా ఉన్న రోహన్ బోపన్న గతవారం టాప్ ర్యాంక్‌ను యూకీకి కోల్పోయాడు. ప్రస్తుతం బోపన్న 43వ స్థానంలో ఉన్నాడు.