పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్‌లో ఈసారి నూతన చాంపియన్ అవతరించనున్నాడు. ఇటలీలోని ట్యూరిన్ వేదికగా జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అమెరికా ప్లేయర్, ఈ ఏడాది యూఎస్ ఓపెన్ రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్(Taylor Fritz) 6–3, 3–6, 7–6 (7/3)తో రెండుసార్లు చాంపియన్ (2018, 2021), ప్రపంచ రెండో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలుపొందాడు.
18 ఏళ్ల తర్వాత
ఫలితంగా 18 ఏళ్ల తర్వాత ఈ మెగా టోర్నీలో ఓ అమెరికా ఆటగాడు టైటిల్ కోసం తలపడనున్నాడు. చివరిసారి 2006లో అమెరికా ప్లేయర్ జేమ్స్ బ్లేక్ ఫైనల్లోకి ప్రవేశించి తుది సమరంలో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. 1999లో పీట్ సంప్రాస్ తర్వాత మరో అమెరికా ప్లేయర్ ఏటీపీ ఫైనల్స్‌లో టైటిల్ సాధించలేకపోయాడు.
ఇక జ్వెరెవ్‌తో 2 గంటల 21 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో ఫ్రిట్జ్ 15 ఏస్‌లు సంధించాడు. ఒకసారి తన సర్వీస్‌ను కోల్పోయి, ఒకసారి జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. 31 విన్నర్స్ కొట్టిన ఫ్రిట్జ్ 34 అనవసర తప్పిదాలు చేశాడు.
ఫ్రిట్జ్‌తో సినెర్ అమీతుమీ
ఇదిలా ఉంటే.. ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ), ప్రపంచ ఆరో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే) మధ్య జరిగిన రెండో సెమీఫైనల్‌లో.. సినెర్ అద్భుత విజయం సాధించాడు. రూడ్‌ను 6-1, 6-2తో చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ఈ క్రమంలో టేలర్ ఫ్రిట్జ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.
రొనాల్డో మ్యాజిక్
పోర్టో: యూరోప్ నేషన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పోర్చుగల్ జట్టు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. పోలాండ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టు 5–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. పోర్చుగల్ తరఫున రొనాల్డో రెండు గోల్స్ (72వ, 87వ నిమిషాల్లో) సాధించాడు.
87వ నిమిషంలో రొనాల్డో గాల్లో ఎగురుతూ ఓవర్‌హెడ్ కిక్‌తో చేసిన గోల్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. రాఫెల్ లియో (59వ నిమిషంలో), ఫెర్నాండెస్ (80వ నిమిషంలో), పెడ్రో నెటో (83వ నిమిషంలో) పోర్చుగల్‌కు ఒక్కో గోల్ సాధించి పెట్టారు. పోలాండ్ జట్టుకు మార్జుక్ (88వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment