ఏటీపీ ఫైనల్స్ టోర్నీ టైటిల్ నెగ్గిన వరల్డ్ నంబర్‌వన్
ఫైనల్లో అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్‌పై విజయం
ఒక్క మ్యాచ్, ఒక్క సెట్ కూడా ఓడిపోకుండా విజేతగా నిలిచిన ఇటలీ స్టార్
రూ. 41 కోట్ల 20 లక్షల ప్రైజ్‌మనీ సొంతం
రోజర్ ఫెడరర్, రాఫెల్ నాదల్ ఇప్పటికే టెన్నిస్ నుంచి వీడ్కోలు తీసుకోగా... సెర్బియా స్టార్ జొకోవిచ్ కూడా త్వరలోనే వీరి బాటలో నడిచే అవకాశముంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పురుషుల టెన్నిస్ ‘ముఖచిత్రం’ ఎవరనే ప్రశ్నకు సమాధానంగా ఇటలీ ప్లేయర్ యానిక్ సినెర్ దూసుకొచ్చాడు.
సీజన్ ముగింపు టోర్నమెంట్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ఫైనల్స్‌లో సినెర్ తొలిసారి చాంపియన్‌గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సింగిల్స్ ఫైనల్లో సినెర్ అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్‌పై వరుస సెట్‌లలో విజయం సాధించాడు.
ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని సినెర్... 1986లో ఇవాన్ లెండిల్ తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా ఘనత సాధించాడు. ఇటీవల డోపింగ్ వివాదంతో విమర్శలపాలైనా... ఉద్దేశపూర్వకంగా తాను ఎలాంటి తప్పిదం చేయలేదని వివరణ ఇచి్చన సినెర్... తాజా విజయంతో సీజన్‌ను చిరస్మరణీయంగా ముగించాడు.
ట్యూరిన్: సొంతగడ్డపై ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ అదరగొట్టాడు. ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో తొలిసారి విజేతగా అవతరించాడు. అమెరికా ప్లేయర్, యూఎస్ ఓపెన్ రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్‌తో జరిగిన సింగిల్స్ ఫైనల్లో సినెర్ 6–4, 6–4తో గెలుపొందాడు. 84 నిమిషాలపాటు జరిగిన ఈ తుది సమరంలో సినెర్ 14 ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. తొలి సర్వీస్ లో 40కుగాను 33 పాయింట్లు... రెండో సర్వీస్‌లో 16కు 13 పాయింట్లు సాధించాడు. ప్రత్యర్థి సర్వీస్ ను రెండుసార్లు బ్రేక్ చేసిన సినెర్ తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోలేదు.
నెట్ వద్దకు 5 సార్లు దూసుకొచ్చిన ఇటలీ స్టార్ మూడుసార్లు పాయింట్లు నెగ్గాడు. 28 విన్నర్స్ కొట్టిన సినెర్ కేవలం 9 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు ఫ్రిట్జ్ 8 ఏస్‌లు సంధించి, 2 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్ వద్దకు 8 సార్లు దూసుకొచ్చి 7 సార్లు పాయింట్లు నెగ్గిన ఫ్రిట్జ్ 15 అనవసర తప్పిదాలు చేశాడు. టోర్నీ మొత్తంలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా విజేతగా నిలిచినందుకు సినెర్ 48,81,100 డాలర్ల (రూ. 41 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీ, 1500 ర్యాంకింగ్ పాయింట్లు గెల్చుకున్నాడు.
టేలర్ ఫ్రిట్జ్‌కు 22,47,400 డాలర్ల (రూ. 18 కోట్ల 96 లక్షలు) ప్రైజ్‌మనీ, 800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 2006లో జేమ్స్ బ్లేక్ తర్వాత ఏటీపీ ఫైనల్స్ టోర్నీ తుది పోరులో ఆడిన అమెరికన్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన ఫ్రిట్జ్ కీలక సమరంలో తడబడ్డాడు. ఒకవేళ ఫ్రిట్జ్ గెలిచి ఉంటే 1999లో సంప్రాస్ తర్వాత ఏటీపీ ఫైనల్స్ టైటిల్ సాధించిన అమెరికా ప్లేయర్‌గా గుర్తింపు పొందేవాడు.
మరోవైపు ఇవాన్ లెండిల్ (1986లో; చెక్ రిపబ్లిక్/అమెరికా) తర్వాత ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా ఘనత వహించాడు. 2024 ఏడాదిని సినెర్ 70 విజయాలు, 6 పరాజయాలతో ముగించాడు. ఆండీ ముర్రే (బ్రిటన్; 2016లో) తర్వాత ఒకే సీజన్ లో 70 విజయాలు సాధించిన ప్లేయర్‌గా సినెర్ నిలిచాడు.
8 ఈ ఏడాదిలో సినెర్ సాధించిన టైటిల్స్ సంఖ్య. ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ, రోటర్‌డామ్ ఓపెన్, మయామి మాస్టర్స్, హాలె ఓపెన్, సిన్సినాటి మాస్టర్స్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ, షాంఘై మాస్టర్స్, ఏటీపీ ఫైనల్స్ టోర్నీలలో సినెర్ విజేతగా నిలిచాడు. ఓవరాల్‌గా సినెర్ కెరీర్‌లో 18 టైటిల్స్ నెగ్గాడు.
Comments
Please login to add a commentAdd a comment