గాయం కారణంగా ఏటీపీ ఫైనల్స్ టోర్నీ నుంచి వైదొలిగిన సెర్బియా దిగ్గజం
బెల్‌గ్రేడ్: పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్ టైటిల్‌ను సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఈసారి నిలబెట్టుకోలేకపోతున్నాడు. ఈనెల 10 నుంచి 17 వరకు ఇటలీలోని ట్యూరిన్ నగరంలో ఈ మెగా టోర్నీ జరగనుంది. గాయం కారణంగా తాను ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో పాల్గొనడంలేదని ప్రపంచ ఐదో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ మంగళవారం ప్రకటించాడు.
‘ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో ఆడాలని ఆసక్తితో ఎదురుచూశా. కానీ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఈ టోర్నీలో ఆడటంలేదు. నా ఆట చూసేందుకు ప్రణాళికలు చేసుకున్న వారికి క్షమించాలని కోరుతున్నాను. ఈ టోరీ్నలో ఆడబోతున్న ఆటగాళ్లందరికీ నా తరఫున శుభాకాంక్షలు. త్వరలో మళ్లీ కలుద్దాం’ అని జొకోవిచ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పేర్కొన్నాడు.
ఏడుసార్లు విజేతగా...
54 ఏళ్ల చరిత్ర కలిగిన ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్‌గా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ టైటిల్‌ను జొకోవిచ్ ఏడుసార్లు (2008, 2012, 2013, 2014, 2015, 2022, 2023) సొంతం చేసుకున్నాడు. స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ (6 సార్లు) పేరిట ఉన్న రికార్డును గత ఏడాది జొకోవిచ్ బద్దలు కొట్టాడు.
37 విజయాలతో ముగింపు...
ఇప్పటికే అత్యధికంగా 24 గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా గుర్తింపు పొందిన జొకోవిచ్ ఈ ఏడాది తన కెరీర్‌ను పరిపూర్ణం చేసుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తోన్న ఒలింపిక్స్ వ్యక్తిగత సింగిల్స్ స్వర్ణ పతకాన్ని అతను ‘పారిస్’లో అందుకున్నాడు.
వింబుల్డన్ టోర్నీలో, షాంఘై మాస్టర్స్ టోర్నీలో ఫైనల్ చేరుకున్నా రన్నరప్ ట్రోఫీలతో సంతృప్తి పడ్డాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది జొకోవిచ్ 37 మ్యాచ్‌ల్లో గెలిచి, 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయి మొత్తం 44,21,916 డాలర్ల (రూ. 37 కోట్ల 19 లక్షలు) ప్రైజ్‌మనీని గెల్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment