సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ సంచలన విషయం బయటపెట్టాడు. మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడేందుకు వచ్చినపుడు తనపై విష ప్రయోగం జరిగిన మాట నిజమేనని వెల్లడించాడు. 2022లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు రాగా తనకు వడ్డించిన ఆహారంలో తీవ్రస్థాయిలో మెర్క్యూరీ, లోహం అవశేషాలున్నట్లు పరీక్షల్లో తెలిందని చెప్పాడు.
ఆ మేగజైన్ తిరగేస్తే మీకే తెలుస్తుంది
‘ఈ విషయం జీకే మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాను. ఇప్పుడు మళ్లీ స్పందించకుండా ఉండాలనుకుంటున్నా. అందుకు నన్ను నేను అభినందించుకోవాలి. ఎందుకంటే ఇక్కడికొచ్చిన పని వేరు.
ఈ స్పందన వేరు. ఇక్కడ నేను టోర్నీ ఆడాలి. ఆ పనేదో చూసుకుంటే మంచిది’ అని జొకోవిచ్ అన్నాడు. ఆసక్తి గలవారికి మరిన్ని వివరాలు కావాలనుకుంటే తాను ఇంటర్వ్యూ ఇచ్చిన మేగజైన్‌ను తిరగేస్తే బాగుంటుందని పేర్కొన్నాడు.
కాగా... మూడేళ్ల క్రితం కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకోని కారణంగా జొకోను టోర్నీ ఆడేందుకు నిరాకరించారు. విమానాశ్రయంలోని హోటల్ గదిలోనే నిర్బంధించారు. ‘ఆ సమయంలో నాకు ఇచ్చిన ఆహరం తినడం వల్లే అస్వస్థతకు గురయ్యాను. కానీ ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎవరికీ, ఎక్కడ చెప్పనేలేదు.
సెర్బియా వెళ్లాక ల్యాబ్ పరీక్షల్లో అత్యధిక స్థాయిలో ప్రమాదకర మెర్క్యురి, లెడ్ అవశేషాలు ఉన్నట్లు తేలింది’ అని 37 ఏళ్ల నొవాక్ గత చేదు అనుభవాన్ని తాజాగా వివరించాడు. ప్రస్తుతం 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌తో ఉన్న ఈ సెర్బియన్ సూపర్‌స్టార్ 25వ రికార్డు టైటిల్‌పై దృష్టి పెట్టాడు.
మరిన్ని క్రీడా వార్తలు
పోరాడి ఓడిన యూకీ–ఒలివెట్టి జోడీ
ఏఎస్‌బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్–ఏటీపీ 250 టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ ప్లేయర్ యూకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) ద్వయం 3–6, 6–1, 5–10తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ నికోల్ మెక్‌టిక్ (క్రొయేషియా)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ, ఒలివెట్టి ఒక్క ఏస్ కూడా సంధించకుండానే ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేయడం గమనార్హం.
తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయిన యూకీ–ఒలివెట్టి ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేశారు. చెరో సెట్ గెలిచాక నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో మెక్‌టిక్–వీనస్ ద్వయం పైచేయి సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో ఓడిన యూకీ–ఒలివెట్టి జంటకు 11,310 డాలర్ల (రూ. 9 లక్షల 74 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
తమిళనాడు డ్రాగన్స్ జోరు
రూర్కేలా: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో తమిళనాడు డ్రాగన్స్ జట్టు జోరు కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న డ్రాగన్స్ నాలుగో గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో తమిళనాడు డ్రాగన్స్ 2–1 గోల్స్ తేడాతో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్‌పై విజయం సాధించింది. తమిళనాడు డ్రాగన్స్ తరఫున సెల్వం కార్తీ (16వ నిమిషంలో), ఉత్తమ్ సింగ్ (37వ నిమిషంలో) చెరో ఫీల్డ్ గోల్ సాధించారు.
బెంగాల్ టైగర్స్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (35వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. తొలి క్వార్టర్‌లో ఇరు జట్లు గోల్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా... రెండో క్వార్టర్ ఆరంభంలోనే కార్తి గోల్‌తో తమిళనాడు బోణీ కొట్టింది. మూడో క్వార్టర్‌లో టైగర్స్ ప్లేయర్ రూపిందర్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంతో స్కోరు సమం కాగా... మరో రెండు నిమిషాల వ్యవధిలో ఉత్తమ్ సింగ్ గోల్ చేయడంతో డ్రాగన్స్ తిరిగి ఆధిక్యంలోకి వెళ్లింది.
చివరి వరకు అదే జోరు కొనసాగించిన తమిళనాడు జట్టు విజయం సాధించింది. తాజా సీజన్‌లో 5 మ్యాచ్‌లాడి నాలుగు విజయాలు సాధించిన డ్రాగన్స్ 12 పాయింట్లతో పట్టిక అగ్రస్థానానంలో నిలిచింది. 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 2 పరాజయాలతో 9 పాయింట్లు ఖాతాలో వేసుకున్న బెంగాల్ టైగర్స్ పట్టికలో రెండో స్థానంలో ఉంది. లీగ్‌లో భాగంగా శనివారం జరిగే మ్యాచ్‌ల్లో హైదరాబాద్ తూఫాన్స్‌తో సూర్మా హాకీ క్లబ్, ఢిల్లీ ఎస్జీ పైపర్స్‌తో యూపీ రుద్రాస్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment