
కాలిఫోర్నియా: తన కెరీర్‌లో ఆడుతున్న తొలి మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్ యూకీ బాంబ్రీ జోరు కొనసాగుతోంది. ఇండియన్ వెల్స్ మాస్టర్స్–1000 సిరీస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–ఆండ్రీ గొరాన్సన్ (స్వీడన్) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ–గొరాన్సన్ జంట 6–2, 5–7, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్, ప్రపంచ మూడో, నాలుగో ర్యాంకుల్లో ఉన్న హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్)–హెలియోవారా (ఫిన్‌లాండ్)లను బోల్తా కొట్టించింది.
85 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ–గొరాన్సన్ ఒక ఏస్ సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. వాస్తవానికి ఈ టోర్నీలో తమ ర్యాంకింగ్ ప్రకారం యూకీ–గొరాన్సన్‌లకు క్వాలిఫయింగ్‌తోపాటు మెయిన్ ‘డ్రా’లోనూ చోటు దక్కలేదు.
అయితే మెయిన్ ‘డ్రా’లో ఉన్న మార్కోస్ గిరోన్–లెర్నర్ టియెన్ (అమెరికా) చివరి నిమిషంలో వైదొలగడంతో ‘రిజర్వ్’ పూల్‌లో ఉన్న యూకీ–గొరాన్సన్‌లకు ఈ టోర్నీలో ఆడే అవకాశం లభించింది. క్వార్టర్ ఫైనల్ చేరడంతో యూకీ బాంబ్రీ –గొరాన్సన్‌లకు 65 వేల డాలర్ల (రూ. 56 లక్షల 67 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్ పాయింట్లు ఖరారయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment