మన హాకీ ఘనం... కానీ ఇది గతం! మరిప్పుడు... సొంతగడ్డపై ఆడుతున్నా... వేలాదిమంది ప్రేక్షకులు మైదానంలోకి వచ్చి మద్దతిస్తున్నా... భారత జట్టు పేలవమైన ప్రదర్శనతో మళ్లీ నిరాశపరిచింది. 2018 ప్రపంచకప్ హాకీలో నేరుగా క్వార్టర్ ఫైనల్ చేరిన టీమిండియా... ఈసారి ‘క్రాస్ ఓవర్’తోనే సరిపెట్టుకుంది. క్వార్టర్ ఫైనల్లో బెర్త్ కోసం న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో భారత్ అన్ని రంగాల్లో విఫలమై ఓడిపోయింది. దాంతో ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత పతక నిరీక్షణ మరో నాలుగేళ్లు కొనసాగనుంది. 1975 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత్ ఆ తర్వాత ఏనాడూ సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయింది.
భువనేశ్వర్: ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్‌లో భారత పతకం కథ కంచికి చేరింది. కళింగ స్టేడియంలో ఆదివారం జరిగిన ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో భారత్ ‘షూటౌట్’లో 4–5తో న్యూజిలాండ్ చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో పతకం బరిలో లేని భారత్ ఇప్పుడు 9 నుంచి 16 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌లు ఆడనుంది. ఈనెల 26న జపాన్‌తో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే 9 నుంచి 12 స్థానాల కోసం 28న రెండో మ్యాచ్ ఆడుతుంది. జపాన్ చేతిలో భారత్ ఓడిపోతే 13 నుంచి 16 స్థానాల కోసం ఆడుతుంది.
న్యూజిలాండ్‌తో కీలకమైన సమయంలో రక్షణ శ్రేణి నిర్లక్ష్యం భారత జట్టు కొంపముంచింది. మూడో క్వార్టర్ వరకు 3–2తో ఆధిక్యంలో ఉన్న భారత్ నాలుగో క్వార్టర్‌లో పెనాల్టీ కార్నర్ అవకాశాలు ఎన్నో వచ్చినా... ఒక గోల్ చేయకపోగా... ప్రత్యర్థి గోల్‌నూ అడ్డుకోలేకపోయింది. దీంతో నిర్ణీత సమయం (నాలుగు క్వార్టర్లు) ముగిసే సమయానికి 3–3తో మ్యాచ్ ‘డ్రా’ అయ్యింది. టీమిండియా జట్టులో లలిత్ కుమార్ ఉపాధ్యాయ్ (17వ ని.లో), సుఖ్‌జీత్ సింగ్ (25వ ని.లో), వరుణ్ కుమార్ (41వ ని.లో) తలా ఒక గోల్ చేశారు.
న్యూజిలాండ్ తరఫున సామ్ లేన్ (29వ ని.లో), కేన్ రసెల్ (44వ ని.లో), సీన్ ఫిండ్లే (50వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు 10 పెనాల్టీ కార్నర్‌లు రాగా రెండింటిని సద్వి నియోగం చేసుకొని మిగితా ఎనిమిదింటిని వృథా చేసుకుంది. న్యూజిలాండ్ జట్టుకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలిచింది. ఆట 54వ నిమిషంలో న్యూజిలాండ్ ప్లేయర్ నిక్ రాస్‌కు ఎల్లో కార్డు లభించడంతో ఆ జట్టు చివరి ఆరు నిమిషాలు పది మంది ఆటగాళ్లతోనే ఆడింది. ఈ అవకాశాన్నీ భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది.
హోరాహోరీ షూటౌట్...
నిర్ణీత సమయంలో రెండు జట్లు సమంగా నిలువడంతో ఫలితం తేలడానికి ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో తొలి ఐదు షాట్‌ల తర్వాత రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. దాంతో ‘సడెన్ డెత్’ అనివార్యమైంది. ‘సడెన్ డెత్’ నిబంధనల ప్రకారం ఒక జట్టు ప్లేయర్ గోల్ చేసి.. ఆ వెంటనే మరో జట్టు ప్లేయర్ విఫలమైనా... ఒక జట్టు ప్లేయర్ విఫలమై... ఆ వెంటనే మరో జట్టు ప్లేయర్ సఫలమైనా మ్యాచ్ ముగుస్తుంది. ‘సడెన్ డెత్’ తొలి షాట్‌లో న్యూజిలాండ్ ప్లేయర్ నిక్ వుడ్స్ విఫలమయ్యాడు. ఫలితంగా తదుపరి షాట్‌లో గోల్ చేస్తే భారత్‌కు విజయం దక్కేది.
కానీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ తడబడ్డాడు. రెండో షాట్‌లో రెండు జట్ల ఆటగాళ్లు సఫలమయ్యారు. మూడో షాట్‌లో కివీస్ ప్లేయర్ హేడెన్ ఫిలిప్స్ విఫలం కావడంతో గెలిచేందుకు భారత్‌కు రెండో అవకాశం దక్కింది. అయితే మూడో షాట్‌లో భారత ప్లేయర్ సుఖ్‌జీత్ విఫలమయ్యాడు. నాలుగో షాట్‌లో కివీస్ ఆటగాడు సామ్ లేన్ గోల్ చేయగా... భారత ప్లేయర్ షంషేర్ సింగ్ గోల్ చేయకపోవడంతో న్యూజిలాండ్ విజయం ఖరారైంది. అంతకుముందు మరో ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో స్పెయిన్ ‘షూటౌట్’లో 4–3తో మలేసియాను ఓడించింది. ఈనెల 24న జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో స్పెయిన్; బెల్జియంతో న్యూజిలాండ్ ఆడతాయి.
Comments
Please login to add a commentAdd a comment