world cup hockey
-
Hockey World Cup 2023: హాకీ జగజ్జేత జర్మనీ
భువనేశ్వర్: 13 ఏళ్ల విరామం తర్వాత జర్మనీ జట్టు పురుషుల హాకీలో జగజ్జేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ప్రపంచకప్ హాకీ టోర్నీ ఫైనల్లో జర్మనీ ‘షూటౌట్’లో 5–4తో డిఫెండింగ్ చాంపియన్ బెల్జియం జట్టును ఓడించింది. నిర్ణీత సమయం ముగిసే సరికి రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో నిర్ణీత ఐదు షాట్ల తర్వాత రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. ‘సడెన్ డెత్’లో తొలి షాట్లో రెండు జట్ల ఆటగాళ్లు సఫలమయ్యాయి. రెండో షాట్లో జర్మనీ సఫలంకాగా... బెల్జియం ఆటగాడు విఫలంకావడంతో జర్మనీ విజయం ఖరారైంది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్ల తర్వాత మూడుసార్లు ప్రపంచకప్ నెగ్గిన మూడో జట్టుగా జర్మనీ గుర్తింపు పొందింది. జర్మనీ 2002, 2006ల లో టైటిల్ నెగ్గింది. కాంస్య పతకం మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3–1తో ఆస్ట్రేలియాను ఓడించింది. -
టీమిండియా పాలిట కొరకరాని కొయ్యలా మారిన న్యూజిలాండ్.. క్రికెట్‌తో పాటు హాకీలోనూ..!
భారత దేశంలోని చిన్న రాష్ట్రాల జనాభా కంటే తక్కువ జనాభా ఉండే న్యూజిలాండ్ దేశం క్రీడల్లో మన పాలిట కొరకరాని కొయ్యలా మారింది. పురుషుల వరల్డ్‌కప్ హాకీలో నిన్న (జనవరి 22) బ్లాక్ క్యాప్స్ చేతిలో ఊహించని ఎదురుదెబ్బ తిన్న తర్వాత ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ విషయానికొస్తే.. కివీస్ చేతిలో భారత్‌కు ఇలాంటి షాక్‌లు తగలడం షరా మామూలే అయినప్పటికీ.. హకీలో మాత్రం మనకంటే కింది స్థాయి జట్టైన కివీస్ చేతిలో ఇలాంటి ఊహించని పరాభవం ఎదురుకావడం ఇదే మొదటిసారి. సునాయాసంగా క్వార్టర్ ఫైనల్‌కు క్వాలిఫై కావాల్సిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఏమరపాటుగా వ్యవహరించడంతో తగిన మూల్యమే చెల్లించుకున్నారు. చిన్న జట్టే కదా అని తేలిగ్గా తీసుకోవడంతో కివీస్ 3-3 (5-4) తేడాతో (పెనాల్టీ షూటౌట్లో) భారత్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాట ఆడినప్పటికీ.. నిర్ణీత సమయంలో చేసిన అనవసర తప్పిదాల కారణంగా, పెనాల్టీ షూటౌట్లో ఆఖరి ఛాన్స్‌ను షంషేర్ మిస్ చేయడం కారణంగా భారత్ వరల్డ్‌కప్ రేసు నుంచి నిష్క్రమించింది. వరల్డ్‌కప్ హాకీలో కివీస్ చేతిలో ఎదురైన ఈ ఊహించని పరాభవం.. భారత క్రీడాభిమానులకు 2019 వన్డే వరల్డ్‌కప్ (క్రికెట్)లో ఇదే జట్టు చేతిలో సెమీస్‌లో ఎదురైన పరాజయాన్ని గుర్తు చేసింది. నాటి మ్యాచ్‌లోనూ భారత్ విజయానికి చేరువగా వచ్చినా అదృష్టం కివీస్ వైపే నిలిచింది. ఆ మ్యాచ్‌లో ధోని రనౌట్ అయిన దృశ్యం భారత క్రికెట్ ప్రేమికుల కళ్లల్లో నేటికీ మెదలుతూనే ఉంది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. భారత్‌కు 240 పరుగుల టార్గెట్ నిర్ధేశించగా, ఛేదనలో తడబడిన భారత్ విజయానికి 19 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ధోని (50), జడేజా (77), హార్ధిక్ (32) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. కివీస్ చేతిలో ఇలాంటి అపజయాలు (క్రికెట్) ఏదో నిన్న మొన్న మొదలయ్యాయని అనుకుంటే పొరబడ్డట్టే. వరల్డ్‌కప్ టోర్నీల్లో ఈ పరాభవాల పరంపర ఎప్పుడో 70ల్లోనే మొదలైంది. 1975, 1979, 1992 వరల్డ్‌కప్‌ల్లో న్యూజిలాండ్.. భారత్‌కు ఇలాంటి షాకులే ఇచ్చింది. అలాగే 2021లో జరిగిన ఐసీసీ తొట్టతొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ న్యూజిలాండ్.. భారత్‌ను భారీ దెబ్బేసింది. -
Hockey World Cup 2023: హతవిధి!.. ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో భారత్ బోల్తా
మన హాకీ ఘనం... కానీ ఇది గతం! మరిప్పుడు... సొంతగడ్డపై ఆడుతున్నా... వేలాదిమంది ప్రేక్షకులు మైదానంలోకి వచ్చి మద్దతిస్తున్నా... భారత జట్టు పేలవమైన ప్రదర్శనతో మళ్లీ నిరాశపరిచింది. 2018 ప్రపంచకప్ హాకీలో నేరుగా క్వార్టర్ ఫైనల్ చేరిన టీమిండియా... ఈసారి ‘క్రాస్ ఓవర్’తోనే సరిపెట్టుకుంది. క్వార్టర్ ఫైనల్లో బెర్త్ కోసం న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో భారత్ అన్ని రంగాల్లో విఫలమై ఓడిపోయింది. దాంతో ఈ మెగా ఈవెంట్ చరిత్రలో భారత పతక నిరీక్షణ మరో నాలుగేళ్లు కొనసాగనుంది. 1975 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత్ ఆ తర్వాత ఏనాడూ సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయింది. భువనేశ్వర్: ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత పతకం కథ కంచికి చేరింది. కళింగ స్టేడియంలో ఆదివారం జరిగిన ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో భారత్ ‘షూటౌట్’లో 4–5తో న్యూజిలాండ్ చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో పతకం బరిలో లేని భారత్ ఇప్పుడు 9 నుంచి 16 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌లు ఆడనుంది. ఈనెల 26న జపాన్‌తో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే 9 నుంచి 12 స్థానాల కోసం 28న రెండో మ్యాచ్ ఆడుతుంది. జపాన్ చేతిలో భారత్ ఓడిపోతే 13 నుంచి 16 స్థానాల కోసం ఆడుతుంది. న్యూజిలాండ్‌తో కీలకమైన సమయంలో రక్షణ శ్రేణి నిర్లక్ష్యం భారత జట్టు కొంపముంచింది. మూడో క్వార్టర్ వరకు 3–2తో ఆధిక్యంలో ఉన్న భారత్ నాలుగో క్వార్టర్లో పెనాల్టీ కార్నర్ అవకాశాలు ఎన్నో వచ్చినా... ఒక గోల్ చేయకపోగా... ప్రత్యర్థి గోల్‌నూ అడ్డుకోలేకపోయింది. దీంతో నిర్ణీత సమయం (నాలుగు క్వార్టర్లు) ముగిసే సమయానికి 3–3తో మ్యాచ్ ‘డ్రా’ అయ్యింది. టీమిండియా జట్టులో లలిత్ కుమార్ ఉపాధ్యాయ్ (17వ ని.లో), సుఖ్జీత్ సింగ్ (25వ ని.లో), వరుణ్ కుమార్ (41వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. న్యూజిలాండ్ తరఫున సామ్ లేన్ (29వ ని.లో), కేన్ రసెల్ (44వ ని.లో), సీన్ ఫిండ్లే (50వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు 10 పెనాల్టీ కార్నర్లు రాగా రెండింటిని సద్వి నియోగం చేసుకొని మిగితా ఎనిమిదింటిని వృథా చేసుకుంది. న్యూజిలాండ్ జట్టుకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచింది. ఆట 54వ నిమిషంలో న్యూజిలాండ్ ప్లేయర్ నిక్ రాస్కు ఎల్లో కార్డు లభించడంతో ఆ జట్టు చివరి ఆరు నిమిషాలు పది మంది ఆటగాళ్లతోనే ఆడింది. ఈ అవకాశాన్నీ భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. హోరాహోరీ షూటౌట్... నిర్ణీత సమయంలో రెండు జట్లు సమంగా నిలువడంతో ఫలితం తేలడానికి ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో తొలి ఐదు షాట్ల తర్వాత రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. దాంతో ‘సడెన్ డెత్’ అనివార్యమైంది. ‘సడెన్ డెత్’ నిబంధనల ప్రకారం ఒక జట్టు ప్లేయర్ గోల్ చేసి.. ఆ వెంటనే మరో జట్టు ప్లేయర్ విఫలమైనా... ఒక జట్టు ప్లేయర్ విఫలమై... ఆ వెంటనే మరో జట్టు ప్లేయర్ సఫలమైనా మ్యాచ్ ముగుస్తుంది. ‘సడెన్ డెత్’ తొలి షాట్లో న్యూజిలాండ్ ప్లేయర్ నిక్ వుడ్స్ విఫలమయ్యాడు. ఫలితంగా తదుపరి షాట్లో గోల్ చేస్తే భారత్‌కు విజయం దక్కేది. కానీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ తడబడ్డాడు. రెండో షాట్లో రెండు జట్ల ఆటగాళ్లు సఫలమయ్యారు. మూడో షాట్లో కివీస్ ప్లేయర్ హేడెన్ ఫిలిప్స్ విఫలం కావడంతో గెలిచేందుకు భారత్‌కు రెండో అవకాశం దక్కింది. అయితే మూడో షాట్లో భారత ప్లేయర్ సుఖ్జీత్ విఫలమయ్యాడు. నాలుగో షాట్లో కివీస్ ఆటగాడు సామ్ లేన్ గోల్ చేయగా... భారత ప్లేయర్ షంషేర్ సింగ్ గోల్ చేయకపోవడంతో న్యూజిలాండ్ విజయం ఖరారైంది. అంతకుముందు మరో ‘క్రాస్ ఓవర్’ మ్యాచ్‌లో స్పెయిన్ ‘షూటౌట్’లో 4–3తో మలేసియాను ఓడించింది. ఈనెల 24న జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో స్పెయిన్; బెల్జియంతో న్యూజిలాండ్ ఆడతాయి. -
భారత్ తొలి ప్రత్యర్థి ఫ్రాన్స్
లుసాన్ (స్విట్జర్లాండ్): వచ్చే నెల 24 నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వేదికగా జరిగే జూనియర్ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్ షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు. డిఫెండింగ్ చాంపియన్ భారత్ నవంబర్ 24న జరిగే తమ తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ తర్వాత 25న జరిగే రెండో మ్యాచ్‌లో కెనడాతో, 27న జరిగే మూడో మ్యాచ్‌లో పోలాండ్‌తో టీమిండియా ఆడుతుంది. పూల్ ‘బి’లో భారత్‌తోపాటు కెనడా, ఫ్రాన్స్, పోలాండ్ జట్లకు చోటు కల్పించారు. పూల్ ‘ఎ’లో బెల్జియం, చిలీ, మలేసియా, దక్షిణాఫ్రికా... పూల్ ‘సి’లో దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, స్పెయిన్, అమెరికా... పూల్ ‘డి’లో అర్జెంటీనా, ఈజిప్‌్ట, జర్మనీ, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. డిసెంబర్ 3న సెమీఫైనల్స్, 5న ఫైనల్స్ జరుగుతాయి. 2016 ప్రపంచకప్ టోర్నీకి కూడా భారతే వేదికగా నిలిచింది. మరోవైపు డిసెంబర్ 5 నుంచి 16 వరకు దక్షిణాఫ్రికాలో జరిగే మహిళల జూనియర్ ప్రపంచకప్ షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. పూల్ ‘సి’లో ఉన్న భారత్ డిసెంబర్ 6న తొలి మ్యాచ్‌లో రష్యాతో ఆడుతుంది. ఆ తర్వాత 7న అర్జెంటీనాతో, 9న జపాన్‌తో భారత్ తలపడుతుంది. -
మళ్లీ ఒడిశాలోనే 2023 ప్రపంచ కప్ హాకీ
భువనేశ్వర్: ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్‌కు మళ్లీ తామే ఆతిథ్యమిస్తామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. 2023లో జరిగే పురుషుల ప్రపంచకప్ పోటీలను భువనేశ్వర్, రూర్కేలా నగరాల్లో నిర్వహిస్తామని బుధవారం ఆయన వెల్లడించారు. గతేడాది కూడా హాకీ మెగా ఈవెంట్‌కు భువనేశ్వరే ఆతిథ్యమిచ్చింది. ఇటీవల అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వరుసగా రెండోసారి కూడా భారత్‌కే నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. 2023లో జనవరి 13 నుంచి 29 వరకు హాకీ పోటీలు జరుగుతాయి. బుధవారం కళింగ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ ‘మేం 2018 ప్రపంచకప్ హాకీని నిర్వహించాం. అలాగే వచ్చే మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తాం’ అని ప్రకటించారు. ఈ సమావేశంలో ఎఫ్ఐహెచ్, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా, హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు మహ్మద్ ముస్తాక్ అహ్మద్ పాల్గొన్నారు. -
తొలిసారి విశ్వవిజేత బెల్జియం
భువనేశ్వర్: భారత గడ్డ బెల్జియం హాకీ జట్టు తలరాతను మార్చేసింది. ప్రపంచకప్ హాకీలో స్వర్ణ చరిత్రను ‘రెడ్ లయన్స్’ పేరిట రాసింది. ఇన్నేళ్లుగా క్వార్టర్స్ దాటని జట్టును ఈసారి చాంపియన్‌గా చేసింది. కళింగ స్టేడియంలో ఆదివారం నిర్ణీత సమయానికల్లా ఒక్క గోల్ కానీ ఫైనల్ మ్యాచ్ చివరికొచ్చేసరికి నరాలు తెగే ఉత్కంఠను రేపింది. ఇదీ చాలదన్నట్లు సడెన్‌డెత్ దాకా హైడ్రామా కొనసాగింది. ఈ థ్రిల్లర్ మ్యాచ్‌లో... ఆఖరి క్షణం వరకు దోబూచులాడిన విజయం చివరకు బెల్జియంను వరించింది. బెల్జియం ‘సడెన్ డెత్’లో 3–2తో నెదర్లాండ్స్‌పై గెలుపొందింది. దీంతో గత ప్రపంచకప్‌లాగే ఈసారి డచ్ జట్టు రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. అంతకుముందు కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 8–1తో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. -
తీరని వేదన
భువనేశ్వర్: నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలనుకున్న భారత ఆశలు అడియాసలయ్యాయి. ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్లో భారత్ 1–2తో ప్రపంచ మాజీ చాంపియన్ నెదర్లాండ్స్ చేతిలో పరాజయం పాలైంది. సొంతగడ్డపై అశేష ప్రేక్షకుల జయజయధ్వానాల మధ్య బరిలో దిగిన మన్‌ప్రీత్ సింగ్ సేన ఆరంభంలో ఆకట్టుకున్నా... చివర్లో ప్రత్యర్థికి ఆధిక్యం సమర్పించుకునే పాత అలవాటును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించి మూల్యం చెల్లించుకుంది. గురువారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ (13వ నిమిషంలో) ఏకైక గోల్ చేయగా... నెదర్లాండ్స్ తరఫున బ్రింక్‌మన్ థీరీ (15వ నిమిషంలో), వాన్ డెర్ వీర్డెన్ మింక్ (50వ నిమిషంలో) చెరో గోల్ చేసి జట్టును గెలిపించారు. ఆరంభంలో అదరగొట్టి... తొలి క్వార్టర్లో డిఫెన్స్‌తో పాటు అటాకింగ్‌లో అదరగొట్టిన ప్రపంచ ఐదో ర్యాంకర్ భారత జట్టు... ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై పదేపదే దాడులకు యత్నిస్తూ నాలుగో ర్యాంకర్ నెదర్లాండ్స్‌పై ఒత్తిడి పెంచింది. దీనికి తోడు రక్షణ పంక్తి కూడా డచ్ ఆటగాళ్లను సమర్థంగా అడ్డుకుంది. ఈ క్రమంలో ఆట 13వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని భారత్ గోల్‌గా మలిచింది. హర్మన్‌ప్రీత్ సింగ్ కొట్టిన షాట్‌ను ముందు ప్రత్యర్థి గోల్‌కీపర్ అడ్డుకున్నా... గోల్ పోస్ట్ దగ్గరే కాచుకొని ఉన్న స్ట్రయికర్ ఆకాశ్‌దీప్ సింగ్ రివర్స్ ఫ్లిక్ ద్వారా మెరుపు వేగంతో బంతిని నెట్లోకి పంపి తొలి గోల్ అందించాడు. దీంతో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. మన్‌ప్రీత్ సేనకు ఈ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. మరి కొద్ది క్షణాల్లో తొలి క్వార్టర్ ముగుస్తుందనగా... బ్రింక్‌మన్ థీరీ కళ్లు చెదిరే ఫీల్డ్‌గోల్‌తో స్కోరు సమం చేశాడు. రెండో క్వార్టర్లోనూ పదే పదే దాడులకు యత్నించిన భారత్ ఓ దశలో ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టింది. దీంతో నెదర్లాండ్స్ ఆటగాళ్లు దాడులు చేయడం మాని తమ గోల్‌పోస్ట్‌కు అడ్డుగోడలా నిలిచారు. మూడో క్వార్టర్లో ఇరు జట్ల రక్షణాత్మక ధోరణి కారణంగా ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. చివర్లో డచ్ జట్టు దాడులు ఉధృతం చేసింది. మూడు క్వార్టర్ల పాటు ప్రత్యర్థిని కాచుకున్న భారత్ ఆఖర్లో తేలిపోయింది. ప్రత్యర్థి దాడులను అడ్డుకోలేక చేతులెత్తేసింది. 50వ నిమిషంలో లభించిన పెనాల్టీని వీర్డెన్ మింక్ గోల్‌గా మలచడంతో నెదర్లాండ్స్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆట చివర్లో భారత్ గోల్కీపర్ను ఉపసంహరించుకొని అదనపు ఆటగాడితో ఆడినా ఫలితం లేకపోయింది. చివర్లో ప్రత్యర్థికి మరో పెనాల్టీ కార్నర్ అవకాశం దక్కింది. మన ఆటగాళ్లు ఆ షాట్‌ను సమర్థంగా అడ్డుకోగలిగారే కానీ... స్కోరు సమం చేయడంలో విఫలమయ్యారు. ప్రపంచకప్ హాకీలో భారత్ ప్రస్థానం క్వార్టర్స్‌లోనే ముగియడంతో ఆటగాళ్లు కన్నీరుమున్నీరవుతూ మైదానాన్ని వీడారు. బెల్జియం తొలిసారి సెమీస్‌కు... ఒలింపిక్ రన్నరప్ బెల్జియం ప్రపంచకప్‌లో చరిత్రకెక్కే విజయాన్ని సాధించింది. తొలిసారి మెగా ఈవెంట్లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ప్రపంచ మూడో ర్యాంకరైన బెల్జియం ఇప్పటివరకు క్వార్టర్ ఫైనల్ అంచెను దాటలేకపోయింది. అయితే గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బెల్జియం జట్టు 2–1 స్కోరుతో జర్మనీపై విజయం సాధించింది. అలెగ్జాండర్ హెండ్రిక్స్ (18వ ని.), టామ్ బూన్ (50వ ని.) చెరో గోల్ చేసి బెల్జియంను సరికొత్త చరిత్రలో భాగం చేయగా, జర్మనీ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను డిటెర్ లిన్నెకొగెల్ (14వ ని.) తొలి క్వార్టర్లో సాధించాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో రెడ్ లయన్స్ మరిన్ని గోల్స్ సాధించాల్సింది. కానీ 9 పెనాల్టీ కార్నర్లను పటిష్టమైన జర్మనీ డిఫెన్స్ ఆటగాళ్లు అడ్డుకున్నారు. -
సంచలనానికి భారత్ సై
భువనేశ్వర్: భారత హాకీ జట్టు సెమీఫైనలే లక్ష్యంగా ప్రపంచకప్‌లో సంచలనానికి సై అంటోంది. గురువారం పటిష్ట నెదర్లాండ్స్ జట్టుతో క్వార్టర్ ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఈ ఒక్క విజయంతో సంచలనంతో పాటు 43 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకూ తెరదించాలని భావిస్తోంది. హాకీకి స్వర్ణయుగమైన 70వ దశకంలో చివరిసారిగా భారత్ సెమీస్ చేరింది. 1975 తర్వాత మళ్లీ ఆ ఘనతకు చేరలేదు. ఇప్పుడు మేటి జట్టును ఓడించి నాలుగు దశాబ్దాల ఎదురుచూపులకు తెరదించాలని మన్‌ప్రీత్ సింగ్ సేన గట్టి పట్టుదలతో ఉంది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడలేదు. అయితే ప్రపంచకప్ చరిత్ర మాత్రం భారత్‌ను కలవరపెడుతోంది. వరల్డ్‌కప్‌ల్లో డచ్ టీమ్‌పై టీమిండియా ఇక్కసారి కూడా గెలవలేదు. ఆరుసార్లు తలపడితే ఐదుసార్లు ఓడింది. ఒక మ్యాచ్ ‘డ్రా’ అయింది. ఒకవేళ తాజా క్వార్టర్ ఫైనల్స్‌లో మన్‌ప్రీత్ అండ్ కో గెలిస్తే కొత్త చరిత్రను లిఖిస్తుంది. అయితే ఈ టోర్నీలో ఫామ్ పరంగా చూస్తే ఇరు జట్లకు సమాన అవకాశాలున్నాయి. నాలుగో ర్యాంకులో ఉన్న నెదర్లాండ్స్‌కు దీటుగా ఐదో ర్యాంకర్ భారత్ రాణిస్తోంది. 2013 నుంచి ఇప్పటివరకు 9 సార్లు తలపడితే ఇరుజట్లు నాలుగేసి మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఒకటి ‘డ్రా’గా ముగిసింది. గురువారమే జరిగే మరో క్వార్టర్ ఫైనల్లో జర్మనీతో బెల్జియం ఆడుతుంది. అర్జెంటీనాకు ఇంగ్లండ్ షాక్ బుధవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ 3–2తో రియో ఒలింపిక్స్ చాంపియన్ అర్జెంటీనా జట్టును కంగుతినిపించి సెమీస్ చేరింది. ఇంగ్లండ్ తరఫున బారీ మిడిల్టన్ (27వ ని.), విల్ కాల్నన్ (45వ ని.), హ్యారీ మార్టిన్ (49వ ని.) గోల్స్ చేయగా, అర్జెంటీనా జట్టులో పెలట్ (17వ, 48వ ని.) రెండు గోల్స్ సాధించాడు. రెండో క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 3–0తో ఫ్రాన్స్‌ను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. షటప్... అండ్ గెటౌట్! భారత హాకీ కెప్టెన్, ఆటగాళ్లపైహెచ్ఐ సీఈఓ నోటి దురుసు భువనేశ్వర్: కీలకమైన క్వార్టర్స్ పోరుకు ముందు భారత హాకీ కెప్టెన్, ఆటగాళ్లను కుంగదీసే విధంగా హాకీ ఇండియా (హెచ్ఐ) సీఈఓ ప్రవర్తించింది. కేవలం వీఐపీ లాంజ్‌లోకి వచ్చారన్న కారణంతో నోటికి పనిచెప్పింది. కళింగ స్టేడియంలో కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, మన్దీప్ సింగ్, గుర్జంత్ సింగ్, కృషన్ పాఠక్‌లు వీఐపీ లాంజ్‌లో మాట్లాడుకుంటుండగా అక్కడే ఉన్న హెచ్ఐ సీఈఓ ఎలీనా నార్మన్ బిగ్గరగా అరచింది. ‘నోరు మూసుకొని... బయటికెళ్లండి. మిమ్మల్ని ఎవరు రానిచ్చారు ఇక్కడికి’ (షటప్ అండ్ గెటౌట్... హూ ఇన్వైటెడ్ యు హియర్) అని తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మరోవైపు హెచ్ఐ అధికారదర్పంపై పలువురు మండిపడ్డారు. సీఈఓ పదజాలాన్ని, వ్యవహారశైలిని తప్పుబట్టారు. హెచ్ఐ పని చేస్తున్నది ఆటగాళ్ల కోసమే కానీ అధికారుల కోసం కాదని, అలాంటప్పుడు వీఐపీ లాంజ్‌లోకి ఆటగాళ్లు వస్తే తప్పేంటని అన్నారు. చివరకు వివాదాన్ని ఏదో రకంగా ముగించాలన్నట్లు ఆమె క్షమాపణలు చెప్పిందని అధికారులు ముక్తాయించారు. కెప్టెన్ మన్‌ప్రీత్ మాత్రం మేమే పొరపాటుగా వెళ్లామని, కీలకమైన మ్యాచ్‌కు ముందు ఇలా జరగాల్సింది కాదని అన్నాడు. ►రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
పూల్ ‘సి’లో భారత్
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వనున్న ప్రపంచకప్ హాకీ షెడ్యూల్‌ను అంతర్జాతీయ హాకీ సమాఖ్య విడుదల చేసింది. మొత్తం 16 జట్లను నాలుగు పూల్స్‌గా విభజించారు. టీమిండియా పూల్ ‘సి’లో బెల్జియం, కెనడా, దక్షిణాఫ్రికాలతో ఉంది. భువనేశ్వర్‌లో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16 వరకు ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. టోర్నీ ప్రారంభోత్సవ మ్యాచ్‌లో ఆతిథ్య భారత్... దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. అనంతరం డిసెంబర్ 2న బెల్జియంతో, 8న కెనడాతో టీమిండియా పోటీపడుతుంది. నవంబరు 28 నుంచి డిసెంబర్ 9 వరకు లీగ్ పోటీలు, 12, 13 తేదీల్లో క్వార్టర్ ఫైనల్స్ జరుగుతాయి. ప్రతీ పూల్‌లోని టాపర్ నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తుంది. రెండు, మూడో స్థానంలో నిలిచిన జట్లు 10, 11 తేదీల్లో జరిగే క్రాస్ ఓవర్ మ్యాచ్‌ల్లో తలపడి గెలిస్తేనే క్వార్టర్స్ బెర్త్ దక్కుతుంది. 15న సెమీస్, 16న ఫైనల్ జరుగనుంది. ఏ పూల్‌లో ఎవరంటే... పూల్ ‘ఎ’: అర్జెంటీనా, న్యూజిలాండ్, స్పెయిన్, ఫ్రాన్స్; పూల్ ‘బి’: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఐర్లాండ్, చైనా; పూల్ ‘సి’: భారత్, బెల్జియం, కెనడా, దక్షిణాఫ్రికా; పూల్ ‘డి’: నెదర్లాండ్స్, జర్మనీ, మలేసియా, పాకిస్తాన్. -
తొలిసారి ప్రపంచకప్ హాకీ సెమీస్ కు అర్జెంటీనా
నెదర్లాండ్స్: పురుషల ప్రపంచకప్ హాకీలో అర్జెంటీనా చరిత్ర సృష్టించింది. ఈ మెగా టోర్నీలో అప్రతిహత జైత్రయాత్ర కొనసాగించిన అర్జెంటీనా తొలిసారి సెమీ ఫైనల్ కు చేరింది. ఈ రోజు ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 5-1 తేడాతో గెలుపొందిన అర్జెంటీనా సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. అర్జెంటీనా ఆటగాళ్లో లుకాస్ విలా, గోంజాగో పీలట్ లు తలో రెండు గోల్స్ చేసి జట్టకు పరిపూర్ణమైన విజయాన్ని అందించారు. ఈ టోర్నీలో ఇప్పటివరకూ మొత్తం ఐదు లీగ్ లు ఆడిన అర్జెంటీనా.. ఒక మ్యాచ్ లో మాత్రమే ఓటమి పాలైంది. దీంతో ఆ జట్టు తన ఖాతాలో 12 పాయింట్లను జమ చేసుకోవడంతో పాటు వరల్డ్ ర్యాంకింగ్ ను కూడా మరింత మెరుగుపరుచుకుంది. అంతే కాకుండా జర్మనీని ఇంటికి పంపించింది. నాలుగు మ్యాచ్ లు గాను ఆరు పాయింట్లు మాత్రమే సాధించిన జర్మనీ సెమీస్ రేస్ నుంచి నిష్కమించింది. ఇలా జర్మనీ సెమీస్ చేరకుండా వైదొలగడం ప్రపంచ కప్ చరిత్రలో రెండో సారి. ఇదిలా ఉండగా గ్రూప్ -బి నుంచి ఒలింపిక్ రజత పతక విజేత నెదర్లాండ్స్ కూడా వరుస నాలుగు విజయాలతో సెమీస్ కు చేరుకుంది. -
భారత్ బోణి
మలేసియాపై 3-2తో విజయం ప్రపంచకప్ హాకీ ది హేగ్: ప్రపంచకప్ హాకీలో భారత జట్టు బోణీ చేసింది. ఆకాశ్‌దీప్ అద్భుత ఆటతీరు కారణంగా మలేసియాతో శనివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌ను 3-2తో గెలుచుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగింది. దీంతో 13వ నిమిషంలో భారత్ తరఫున జస్జిత్ సింగ్ కులార్ గోల్ చేశాడు. ప్రథమార్ధం 1-0 ఆధిక్యంతో ముగించినా 45వ నిమిషంలో మలేసియా తమకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకుంది. మొహమ్మద్ రజీ చేసిన ఈ గోల్‌తో స్కోరు 1-1తో సమమైంది. అయితే మూడు నిమిషాల (49వ) అనంతరం రూపిందర్ పాల్ సింగ్ పాస్‌ను అందుకున్న ఆకాశ్‌దీప్ భారత్‌కు రెండో గోల్ అందించాడు. ఇదే జోరుతో ఇన్సైడ్ సర్కిల్లో కెప్టెన్ సర్దార్ సింగ్ ఇచ్చిన పాస్‌ను 52వ నిమిషంలో గోల్‌గా మలిచి జట్టుకు 3-1 ఆధిక్యాన్ని అందించాడు. అయితే 61వ నిమిషంలో గోల్ కీపర్ శ్రీజేష్ను తాకి బయటకు వచ్చిన బంతిని మలేసియా ఆటగాడు మర్హన్ జలీల్ గోల్ చేసి ఆధిక్యాన్ని తగ్గించినా ఫలితం లేకపోయింది. టోర్నీలో ఇప్పటిదాకా భారత్ రెండు ఓటములు, ఒక డ్రా, ఒక విజయం సాధించింది. ఇక తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. -
స్పెయిన్‌ను నిలువరించిన భారత్
1-1తో మ్యాచ్ డ్రా ప్రపంచకప్ హాకీ ది హేగ్: ప్రపంచ కప్ హాకీలో వరుసగా రెండు పరాజయాలతో నిరాశ పరిచిన భారత జట్టు స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడింది. ఫలితంగా గురువారం జరిగిన ఈ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో ఖాతా తెరవగలిగింది. బెల్జియం, ఇంగ్లండ్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో చివరి నిమిషంలో గోల్ సమర్పించుకుని పరాజయాలను ఎదుర్కొన్న సర్దార్ సింగ్ సేన ఈ మ్యాచ్‌లో అలాంటి పొరపాట్లకు తావీయలేదు. ముఖ్యంగా గోల్ కీపర్ శ్రీజేష్ స్పెయిన్ గోల్స్ అవకాశాలను గండికొట్టడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. అంతకుముందు చురుకైన కదలికలకు మారుపేరైన స్పెయిన్ ఆటగాళ్లు మ్యాచ్ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగారు. దీంతో ఏడో నిమిషంలోనే వారికి పెనాల్టీ కార్నర్ లభించినా కీపర్ శ్రీజేష్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత మరో పీసీని కూడా స్పెయిన్ విఫలం చేసుకోగా.. భారత్ 28వ నిమిషంలో తొలి గోల్ సాధించింది. ‘డి’ సర్కిల్ లోపల మన్దీప్ అందించిన పాస్‌ను రూపిందర్ సింగ్ గోల్‌గా మలిచి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే ఈ ఆనందం ఎంతో సేపు నిలువలేదు. ప్రథమార్ధం మరో నిమిషంలో ముగుస్తుందనగా రాక్ ఒలివా (34వ) గోల్‌తో స్కోరు 1-1తో సమమైంది. ఇక ద్వితీయార్ధంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. హోరాహోరీ పోరుతో ఆకట్టుకున్నారు. గోల్స్ కోసం ఎంత ప్రయత్నించినా ఇరువురికీ నిరాశే ఎదురైంది. 55వ నిమిషంలో స్పెయిన్‌కు లభించిన నాలుగో పెనాల్టీ కార్నర్‌ను కూడా శ్రీజేష్ అద్భుతంగా అడ్డుకోగలిగాడు. ఆ తర్వాత కూడా ఎంతగా ప్రయత్నించినా ఇరు జట్ల నుంచి గోల్స్ నమోదు కాలేదు. -
దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
ది హేగ్: ప్రపంచకప్‌కు ముందు భారత హాకీ జట్టు స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకుంది. తమ చివరి ప్రాక్టీస్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 4-1 తేడాతో నెగ్గి టోర్నీని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించనుంది. తొలి ప్రాక్టీస్ గేమ్‌లో అర్జెంటీనా చేతిలో ఓడిన భారత్.. సఫారీలపై మాత్రం చెలరేగింది. గాయాల కారణంగా రమణ్‌దీప్ సింగ్, తిమ్మయ్య జట్టుకు దూరమైనా మ్యాచ్‌లో భారత్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించగలిగింది. నాలుగింటిలో మూడు గోల్స్ పెనాల్టీ కార్నర్ ద్వారానే లభించడం విశేషం. వీటిని రూపిందర్ పాల్ సింగ్ (2), రఘునాథ్ సాధించగా, కెప్టెన్ సర్దార్ సింగ్ ఫీల్డ్ గోల్ చేశాడు. తొలి మ్యాచ్ ఆడిన లలిత్ ఉపాధ్యాయ్, యువరాజ్ వాల్మీకి ప్రదర్శనపై కోచ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 31 నుంచి జూన్ 15 వరకు జరిగే ప్రపంచకప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌ను శనివారం బెల్జియంతో ఆడనుంది. -
భారత హాకీ సారథిగా సర్దార్ సింగ్
ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించిన హెచ్ఐ గుర్బాజ్ సింగ్‌కు టీమ్‌లో చోటు న్యూఢిల్లీ: స్టార్ మిడ్‌ఫీల్డర్ సర్దార్ సింగ్ ప్రపంచకప్ హాకీలో భారత జట్టు సారథిగా వ్యవహరించనున్నాడు. మే 31 నుంచి నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో జరగనున్న ప్రపంచకప్ కోసం హాకీ ఇండియా(హెచ్ఐ) 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అనుభవజ్ఞుడు, మిడ్‌ఫీల్డర్ గుర్బాజ్ సింగ్ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. సర్దార్ సారథ్యంలోని భారత జట్టు ఈ నెల 21 హేగ్‌కు బయల్దేరి వెళ్లనుంది. ప్రపంచకప్‌లో భారత్ జట్టుకు పూల్-ఎలో ఆస్ట్రేలియా, బెల్జియం, ఇంగ్లండ్, స్పెయిన్, మలేసియాలతో గట్టి పోటీ ఎదురుకానుంది. మే 31న జరిగే తొలి మ్యాచ్‌లో భారత జట్టు బెల్జియంతో తలపడనుంది. భారత జట్టు: సర్దార్ సింగ్(కెప్టెన్), గోల్‌కీపర్లు-శ్రీజేష్, హర్జోత్సింగ్, డిఫెండర్లు-గుర్బాజ్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, రఘునాథ్, వీరేంద్ర లాక్రా, కోథాజిత్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, మిడ్‌ఫీల్డర్లు-ఉతప్ప, ధరమ్వీర్ సింగ్, జస్జిత్ సింగ్, చింగ్లెన్సనా సింగ్, ఫార్వర్డ్లు-సునీల్, రమణ్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, తిమ్మయ్య, మన్దీప్ సింగ్. -
బెల్జియంతో భారత్ తొలి పోరు
న్యూఢిల్లీ: ప్రపంచకప్ హాకీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను బెల్జియంతో ఆడనుంది. ఈమేరకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) టోర్నీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. నెదర్లాండ్స్ రాజధాని ది హేగ్‌లో మే 31 నుంచి జూన్ 15 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. పటిష్ట జట్లున్న పూల్ ‘ఎ’లో భారత్.. 31న బెల్జియంతో, జూన్ 2న ఇం గ్లండ్‌తో, 5న స్పెయిన్‌తో, 7న మలేసియాతో 9న ప్రపంచ చాంపియన్స్ ఆసీస్‌తో తలపడుతుంది. ఓవరాల్‌గా 76 మ్యాచ్‌లు జరుగనుండగా పూల్ దశలో రోజుకు 6 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మహిళల ప్రపంచకప్ హాకీ కూడా సమాంతరంగా జరుగనుంది.