నెదర్లాండ్స్: పురుషల ప్రపంచకప్ హాకీలో అర్జెంటీనా చరిత్ర సృష్టించింది. ఈ మెగా టోర్నీలో అప్రతిహత జైత్రయాత్ర కొనసాగించిన అర్జెంటీనా తొలిసారి సెమీ ఫైనల్ కు చేరింది. ఈ రోజు ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 5-1 తేడాతో గెలుపొందిన అర్జెంటీనా సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. అర్జెంటీనా ఆటగాళ్లో లుకాస్ విలా, గోంజాగో పీలట్ లు తలో రెండు గోల్స్ చేసి జట్టకు పరిపూర్ణమైన విజయాన్ని అందించారు. ఈ టోర్నీలో ఇప్పటివరకూ మొత్తం ఐదు లీగ్ లు ఆడిన అర్జెంటీనా.. ఒక మ్యాచ్ లో మాత్రమే ఓటమి పాలైంది. దీంతో ఆ జట్టు తన ఖాతాలో 12 పాయింట్లను జమ చేసుకోవడంతో పాటు వరల్డ్ ర్యాంకింగ్ ను కూడా మరింత మెరుగుపరుచుకుంది. అంతే కాకుండా జర్మనీని ఇంటికి పంపించింది.
నాలుగు మ్యాచ్ లు గాను ఆరు పాయింట్లు మాత్రమే సాధించిన జర్మనీ సెమీస్ రేస్ నుంచి నిష్కమించింది. ఇలా జర్మనీ సెమీస్ చేరకుండా వైదొలగడం ప్రపంచ కప్ చరిత్రలో రెండో సారి. ఇదిలా ఉండగా గ్రూప్ -బి నుంచి ఒలింపిక్ రజత పతక విజేత నెదర్లాండ్స్ కూడా వరుస నాలుగు విజయాలతో సెమీస్ కు చేరుకుంది.