2014 ప్రపంచకప్ ఫైనల్లో గోల్ చేస్తున్న మారియో గోట్జె (ఫైల్)
అది 2014 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ తుది సమరం. జర్మనీ, అర్జెంటీనా మధ్య హోరాహోరీ సమరం సాగుతోంది. నిర్ణీత 90 నిమిషాల్లో రెండు జట్లూ గోల్ చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్ అదనపు సమయానికి దారి తీసింది. అప్పటికీ, తొలి 15 నిమిషాల్లో ఎవరూ ఖాతా తెరవలేకపోయారు. రెండో భాగమూ కరిగి పోసాగింది. ఇక జగజ్జేత ఎవరో తేల్చేది పెనాల్టీ షూటౌటేనని అందరూ నిశ్చయానికొచ్చారు. కానీ, 113వ నిమిషంలో జరిగిందో అద్భుతం. ఆండ్రీ షుర్ల్ నుంచి అందిన క్రాస్ పాస్‌ను ఛాతీతో చక్కగా నిలువరించిన మారియో గోట్జె... అర్జెంటీనా కీపర్ రొమెరోను బోల్తా కొట్టిస్తూ అంతే లాఘవంగా బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. అలా జర్మనీ 1–0 ఆధిక్యంలోకి వెళ్లడం, మ్యాచ్‌ను ముగించడం, విజేతగా కప్ అందుకోవడం చకచకా జరిగిపోయాయి. ఈ గోల్‌తో గోట్జె కీర్తి శిఖరానికి చేరింది. అప్పటికి అతడి వయసు 22 ఏళ్లే కావడంతో ఫుట్‌బాల్ ప్రపంచానికి మరో మెరుపు వీరుడు దొరికాడంటూ కొనియాడారు. మేటి ఆటగాడిగా నిలుస్తాడంటూ లెక్కలేశారు. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదుగా. ఈ నాలుగేళ్లలో ఎంతో జరిగింది. జట్టుగా జర్మనీ ప్రదర్శన బాగా మెరుగుపడింది. మరోసారి హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. జట్టులో గోట్జె మాత్రం లేడు. ఇంతకీ ఎక్కడున్నాడతడు? ఏమైపోయాడు? ఇతడే కాదు మరికొందరు మెరికల్లాంటి ఆటగాళ్లను పెద్ద పెద్ద జట్లు వేర్వేరు కారణాలతో ప్రస్తుత ప్రపంచ కప్‌నకు ఎంపిక చేయలేదు. ఎందుకో చదవండి మరి...!
గాయాలు... ఫామ్... గోట్జె
వేగం, నైపుణ్యంతో పాటు బంతిని డ్రిబ్లింగ్ చేయడంలో మేటి అయిన గోట్జె అటాకింగ్ మిడ్ ఫీల్డర్. క్లబ్ జట్లకు ఆడుతూ టీనేజ్‌లోనే సంచలనాలు సృష్టించాడు. ఓ దశలో జర్మనీలోనే అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడిగా ప్రశంసలు అందుకున్నాడు. 18 ఏళ్లకే జాతీయ జట్టులోకి వచ్చాడు. ప్రపంచ కప్ తర్వాత లీగ్‌లలోనూ ఆకట్టుకున్న అతడు... ప్రతిష్ఠాత్మక ‘బ్యాలెన్‌డి ఓర్’ పురస్కారానికి ఫిఫా షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలోనూ ఉన్నాడు. కానీ ఆట పట్ల దృక్పథంలో, క్లబ్ జట్ల మార్పుతో 2015 నుంచి గోట్జె విమర్శలెదుర్కొన్నాడు. జట్టంతా ప్రపంచకప్ సన్నాహాల్లో ఉండగా సరిగ్గా ఏడాదిన్నర క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. జీవ క్రియల్లో మార్పుతో అలిసిపోవడం, బరువు పెరగడం వంటి లక్షణాలున్న ఈ వ్యాధిని ‘మియోపతి’గా మీడియా పేర్కొంది. దీంతో ప్రదర్శన పడిపోయింది. 16 మ్యాచ్‌ల్లో రెండే గోల్స్ చేయగలిగాడు. ఏడాది క్రితం కోలుకున్నప్పటికీ ఫిట్‌నెస్ ప్రమాణాలపై సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో వరల్డ్ కప్‌కే దూరమయ్యాడు. ‘అతడి టైం బాగోలేదు. తనదైన అద్భుత నైపుణ్యాన్ని కనబర్చే స్థితిలో లేడు. అందుకని వ్యక్తిగతంగా నేను చేయగలిగింది ఏమీ లేదు’ అంటూ జర్మనీ కోచ్ జోచిమ్ లో మరో మాట లేకుండా పక్కన పెట్టేశాడు.
సేన్‌ది మరో బాధ...
గోట్జె కథ ఇలా ఉంటే అత్యంత ధనిక లీగ్ అయిన ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)లో ఉత్తమ యువ ఆటగాడిగా నిలిచిన లెరోయ్ సేన్‌ది మరో బాధ. జర్మనీకే చెందిన 22 ఏళ్ల సేన్ ఈపీఎల్ టైటిల్ నెగ్గిన మాంచెస్టర్ సిటీ క్లబ్ సభ్యుడు. యువ ఫుట్‌బాలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డునూ అందుకున్నాడు. మాంచెస్టర్ తరఫున 10 గోల్స్ చేయడంతో పాటు మరో 15 గోల్స్‌కు పరోక్షంగా కారకుడయ్యాడు. కానీ జర్మనీ తరఫున 12 మ్యాచ్‌లు ఆడినా ఒక్క గోలూ చేయలేకపోయాడు. దీనినే కారణంగా చూపిస్తూ అతడిని జాతీయ జట్టులోకి తీసుకోలేదు. ‘సేన్ ఇంకా జాతీయ స్థాయికి ఎదగలేదు. అతడిని తీసుకుంటే జట్టులో సమతుల్యం దెబ్బతింటుంది’ అనేది కోచ్ జోచిమ్ లో మాట.
జగడాలమారి... మారో ఇకార్డి
ప్రతిభకు కొదవలేని ఆటగాడు మారో ఇకార్డి. ఇంటర్ మిలాన్ క్లబ్ కెప్టెన్ కూడా. రెండు సీజన్లలో 53 గోల్స్ చేశాడు. మెస్సీ, హిగుయెన్, అగ్యురో వంటి వారితో ఆడాల్సిన వాడు. కానీ సహచరులతో తరచూ వివాదాలకు దిగే స్వభావంతో 25 ఏళ్ల ఈ అర్జెంటీనా స్ట్రయికర్‌ను జట్టు నుంచి తప్పించాల్సి వచ్చింది. ఇకార్డిని తీసుకుంటే ఇబ్బందులను కొని తెచ్చుకోవడమేనని భావించిన కోచ్ జార్జ్ సంపోలీ... అతడి రికార్డులనూ లెక్కచేయలేదు.
అయ్యో బఫన్...
ఇటలీ దిగ్గజ గోల్ కీపర్. ఆరో వరల్డ్ కప్ ఆడిన రికార్డును సమం చేయాల్సినవాడు. కానీ క్వాలిఫై మ్యాచ్‌ల్లో ఇటలీ వైఫల్యంతో 40 ఏళ్ల బఫన్ కన్నీటి పర్యంతమై అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
ఫామ్‌లేక.. మొరాటా
చెల్సీ ఆటగాడు అల్వరో మొరాటా అత్యుత్తమ స్ట్రయికర్. ఇటీవల ఫామ్‌లో లేడు. దీంతో స్పెయిన్ జట్టుకు ఎంపిక చేయలేదు. ‘ఇది ఎప్పుడైనా కఠిన నిర్ణయమే. అతడిపై వ్యతిరేకత ఏమీ లేదు. తన స్థానంలో ఇతరులను తీసుకుంటే మాకు మరింత సులువుగా ఉంటుందని భావించాం’ అని స్పెయిన్ కోచ్ సులెన్ లొప్టెగీ పేర్కొనడం గమనార్హం.
రాబియోట్... అవకాశం వదులుకొని
అసలే అవకాశాలు అంతంతగా ఉంటే... వాటినీ కాలదన్నుకున్నాడు ఫ్రాన్స్ ఆటగాడు ఆడ్రియన్ రాబియోట్. ఇతడిని ప్రపంచకప్ రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో ఉంచారు. దీంతో తుది జట్టులో స్థానంపై నమ్మకంలేక తనంతట తానే వైదొలిగాడు. ‘నేను నిజంగా ఆశ్చర్యపోయా. అతడిది పూర్తి నిరుత్సాహకర చర్య. తను చేసింది పెద్ద తప్పేనని నేను సమాధాన పడ్డా’ అని కోచ్ డైడర్ డె చాంప్స్ వెల్లడించాడు.
ఇబ్రహిమోవిక్... వస్తాడనుకున్నా...
స్వీడన్ సూపర్ స్టార్ స్ట్రయికర్. 36 ఏళ్ల ఇబ్రహిమోవిక్... 2016 యూరో కప్ తర్వాత రిటైరయ్యాడు. జట్టు ప్రపంచకప్‌నకు అర్హత సాధించినందున మళ్లీ వచ్చే అవకాశం ఉందని భావించారు. అతడు వీటిని తోసిపుచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment