ఫుట్బాల్ లేదా సాకర్ అంటే చాలు.. కోల్కతా నగరం ఆనందోత్సాహాలతో ఉరకలెత్తుతుంది. ఇక ప్రపంచకప్ అంటే మాటలా! ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్ అలా ముగిసి, జర్మనీ విశ్వవిజేతగా నిలిచిందో లేదో.. కోల్కతాలో ఒక్కసారిగా సంబరాలు అంబరాన్నంటాయి. బాణాసంచా కాలుస్తూ వీధుల్లో సంబరాలు చేసుకున్నారు. జర్మనీ, అర్జెంటీనా జట్ల మధ్య జరిగిన ఫైనల్ పోరును టీవీలలో ప్రత్యక్ష ప్రసారం చూశారు. కోల్కతా నగరంలో పలుచోట్ల భారీ ఎల్సీడీ స్క్రీన్లు ఏర్పాటుచేసి అక్కడ ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటుచేశారు.
వందలాది మంది అభిమానులు ప్రతిచోటా రాత్రంతా ఉండి.. మారియో గోయెట్జ్ గోల్ కొట్టగానే ఆనందంతో గంతులు వేశారు. 24 ఏళ్ల తర్వాత మళ్లీ జర్మనీ కప్పు గెలుచుకుందని తెలియగానే ఇక ఒక్కసారిగా అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. మోటార్ సైకిళ్లు తీసుకుని నగరంలో పలుచోట్ల ఊరేగింపులు జరిపారు. భారీఎత్తున బాణాసంచా కాల్చడంతో అర్ధరాత్రి ఆకాశం మిరుమిట్లు గొలిపింది. కోల్కతా అభిమానులు కూడా మెస్సీ, ముల్లర్ మధ్య రెండుగా విడిపోయారు. ఇద్దరి కటౌట్లు నగరంలో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పెట్టారు.
మెస్సీ గోల్ కొట్టడానికి వచ్చిన ప్రతిసారీ నగరంలో పెద్దపెట్టున నినాదాలు వినిపించాయి.
కోల్కతాలో సాకర్ సంబరాలు
Published Mon, Jul 14 2014 3:31 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM
Advertisement