బొగాటా: 2014 ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీ క్వార్టర్స్ నుంచి నిష్కమించిన అనంతరం స్వదేశానికి చేరుకున్న కొలంబియాకు ఆ దేశ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ప్రపంచకప్ ఫేవరెట్లలో ఒకటైన బ్రెజిల్ చేతిలో కంగుతిన్న కొలంబియా జట్టు ఆదివారం స్వదేశానికి చేరుకుంది. ఈ క్రమంలో ఎల్డార్డో ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఆటగాళ్లకు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికారు. వరల్డ్ కప్ వీరోచితంగా పోరాడి క్వార్టర్స్ కు చేరుకున్న జట్టు సభ్యులను చూచేందుకు వీధులన్నీ భారీ జనంతో నిండిపోయాయి. కోచ్ తో సహా 23 మంది కొలంబియా హీరోల కోసం దాదాపు 1,25,000 మంది ప్రజలు నిరీక్షించారు. ' దేశంలోని ప్రజలు మాకు పూర్తి సహకారం అందించారు. వారి బలమే మమ్ముల్ని ఈ స్థితికి చేర్చింది'అంటూ జట్టు కోచ్ జోస్ పెకర్మాన్ ఆనందం వ్యక్తం చేశారు.
టోర్నీ ఆద్యంతం ఆకట్టుకున్న కొలంబియా ప్రిక్వార్టర్ ఫైనల్లో ఉరుగ్వేకు షాక్ ఇచ్చింది. కాగా క్వార్టర్స్ లో వీరోచితంగా పోరాడిన కొలంబియా 1-2 తేడాతో బ్రెజిల్ పై ఓటమి చవిచూసింది.