అభిమానం హద్దుల్ని చెరిపేస్తుంది. ఆట మీద, ఆటగాడి మీద ప్రేమ ఎన్ని వందల, వేల కిలోమీటర్ల దూరమైనా ప్రయాణించేలా చేస్తుంది. హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ఎస్.ఎన్. కార్తికేయ పాడి అందుకు తాజా ఉదాహరణ. పందొమ్మిది ఏళ్ళ ఈ కుర్రాడు తన అభిమాన ఫుట్‌బాల్ ఆటగాడైన ప్రసిద్ధ అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినెజ్‌ను కలిసేందుకు కష్టపడి కలకత్తా దాకా ప్రయాణించారు.
ఈ జూలై మొదటివారంలో భారత సందర్శనకు వచ్చిన ఆ ప్రపంచ ప్రసిద్ధ ఫుట్బాల్ ఆటగాణ్ణి అతి కష్టం మీద స్వయంగా కలిసి, తన అభిమానాన్ని చాటుకున్నారు. కొద్ది నెలల క్రితమే అర్జెంటీనా జట్టు గెలిచినప్పుడు ‘2022 ప్రపంచ కప్ (ఫిఫా -2022)’ నిర్వాహకులు అందించిన నమూనా ట్రోఫీ చేత ధరించిన తన ఆరాధ్య ఆటగాడితో కలసి ఫోటో దిగారు.
మార్టినెజ్ పై మనోడికి అంత పిచ్చి ప్రేమకు కారణం లేకపోలేదు. 1986లో డీగో మ్యారడోనా సారథ్యంలో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత అర్జెంటీనా జట్టు మళ్ళీ గత ఏడాదే ప్రపంచ కప్‌లో విజేతగా విజయపతాకాన్ని రెపరెపలాడించింది. ఈ తాజా విజయంలో గోల్‌కీపర్ ఎమిలియానో మార్టినెజ్ కీలక పాత్ర పోషించారు. మెస్సీ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్ళు అర్జెంటీనాకు ఉన్నప్పటికీ... ఫ్రాన్స్ జట్టుతో ఈ ఫిఫా-2022 ఫైనల్ మ్యాచ్ 3 – 3 గోల్స్‌తో సమం అయింది.
మార్టినెజ్‌ది కీలక పాత్ర
విజేతను నిశ్చయించే పెనాల్టీ షూటౌట్‌లో గోల్‌కీపర్ మార్టినెజ్ ప్రతిభా నైపుణ్యాలు అర్జెంటీనాకు కలిసొచ్చాయి. ఫ్రాన్స్ పెనాల్టీ కిక్‌ను నిలువరించి, 4-2 గోల్స్ తేడాతో అర్జెంటీనా జట్టును విజేతగా నిలపడంలో ముఖ్యుడు మార్టినెజ్. అంతకు ముందు 2021 కోపా కప్ సెమీ ఫైనల్‌లో సైతం మూడు పెనాల్టీ కార్నర్లను నిలువరించి, అర్జెంటీనా జట్టు ఫైనల్‌కు చేరి, కప్పు సాధించేలా చేయడంలోనూ మార్టినెజ్ కీలకం. అందుకే, ఆయన ఆటతీరును అభిమానులు మరవలేరు.
అంతటి దిగ్గజ ఆటగాడు మన దేశానికి వస్తున్నారని తెలుసుకున్న టీనేజ్ స్టూడెంట్ కార్తికేయ పాడి తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకోవాలని శ్రమించారు. ప్రముఖ మోహన్ బగాన్ క్లబ్‌లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మార్టినెజ్ గత వారం కలకత్తా వచ్చారు. అంతగా ప్రచారం లేని ఈ కార్యక్రమం గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కార్తికేయ ఎలాగైనా తన ఫేవరెట్ ప్లేయర్‌ను కలవాలనుకున్నారు.
ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, కలకత్తా వెళ్ళారు. ఎలాగోలా అక్కడ తన ఆరాధ్యదైవాన్ని చేరుకోగలిగారు. ఫుట్‌బాల్ ప్రేమికుడూ, స్వయంగా స్కూలు, కాలేజీ స్థాయిలో సోకర్ ఆటగాడూ అయిన కార్తికేయ తన అభిమాన జట్టు గోల్ కీపర్‌ను ఆయన హోటల్ విడిదిలో ప్రత్యేకంగా కలిసే అదృష్టం దక్కించుకున్నారు.
వందల కిలోమీటర్లు ప్రయాణించి
ఖతార్‌లో జరిగిన ఫిఫా-2022 ప్రపంచ కప్ తర్వాత విశ్వవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్, అభిమానుల్ని సంపాదించుకున్న మార్టినెజ్ తన కోసం ఓ తెలుగు విద్యార్థి వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చిన వివరాలు విని, ముగ్ధుడయ్యారు. వీరాభిమాని కార్తికేయ కోరికను మన్నించి ఫోటో దిగడమే కాక, తమ అర్జెంటీనా జట్టు జెర్సీపై ఆటోగ్రాఫ్ ఇచ్చారు.
ఆరాధ్య దైవమైన అర్జెంటీనా ఆటగాడిని కలసి, మాట్లాడి, ఫోటో, అరుదైన జెర్సీపై ఆటోగ్రాఫ్ తీసుకొని, హైదరాబాద్‌కు తిరిగొచ్చిన కార్తికేయ పాడి ఆనందానికి అవధులు లేవు. “ఫుట్ బాల్ దిగ్గజాల్లో ఒకరైన మార్టినెజ్‌ను స్వయంగా కలసి, మాట్లాడడం ఏ ఫుట్‌బాల్ ప్రేమికుడికైనా ఓ కల. అలా నా కల నిజమైన క్షణమిది. ఈ మధురానుభూతిని మాటల్లో వర్ణించలేను” అని ఈ టీనేజ్ విద్యార్థి ఉద్వేగంగా చెప్పారు.
సంగీతం, ఆటలు
ఈ తెలుగు కుర్రాడు హైదరాబాద్ శివార్లలోని డాక్టర్ బీవీ రాజు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ) నర్సాపూర్ క్యాంపస్‌లో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థికి చదువుతో పాటు సంగీతం, ఆటల పట్ల అమితమైన ఆసక్తి. స్వయంగా ఫుట్‌బాల్ ఆడడంతో పాటు లండన్‌లోని రాయల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్‌లో పాశ్చాత్య సంగీత గానంలోనూ, అలాగే పియానో వాదనలోనూ 5వ గ్రేడ్ ఉత్తీర్ణుడయ్యారు.
“శ్రమిస్తే ఏ స్థాయికైనా ఎదగవచ్చనడానికి మార్టినెజ్ ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన స్ఫూర్తితో, రాబోయే రోజుల్లో అటు సంగీతం, ఇటు ఆటలు కొనసాగిస్తూనే, చదువులో మంచి మార్కులు సాధించి, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి. మా అమ్మానాన్న, తమ్ముడు గర్వపడేలా చేయాలనేది నా లక్ష్యం” అన్నారు
నవతరానికి ప్రతినిధి అయిన కార్తికేయ. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కార్తికేయ తండ్రి రవి పాడి సైతం తెలుగునాట మారుమూల ప్రాంతం నుంచి వచ్చి, ఎంతో శ్రమించి ఇండియన్ రైల్వే సర్వీసులో ఉన్నతాధికారిగా ఎదిగారు. సంగీత, సాహిత్య, సినీ ప్రేమికుడిగా, అరుదైన సినిమా గ్రామ్‌ఫోన్ రికార్డులు, పోస్టల్ స్టాంపులు, ప్రత్యేక కవర్ల సేకర్తగా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.
-రెంటాల జయదేవ
Comments
Please login to add a commentAdd a comment