
జనవరి–మార్చి మధ్య 41 శాతం తగ్గుదల
ఏడు నగరాల్లో ఆఫీస్ వసతులకు డిమాండ్
కొలియర్స్ ఇండియా నివేదిక విడుదల
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టాప్–7 నగరాల్లో ఈ ఏడా ది తొలి మూడు నెలల కాలంలో ఆఫీస్ వసతుల లీజింగ్ మెరుగైన వృద్ధిని చూడగా.. హైదరాబాద్, కోల్‌కతా పట్టణాల్లో క్షీణించింది. జనవరి–మార్చి త్రైమాసికంలో ఇప్పటి వరకు నమోదైన లావాదేవీల ఆధారంగా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘కొలియర్స్ ఇండియా’ ఒక నివేదికను విడుదల చేసింది. టాప్–7 నగరాల్లో స్థూలంగా 159 లక్షల చదరపు అడుగుల మేర (ఎస్‌ఎఫ్‌టీ) ఆఫీస్ లీజింగ్ లావాదేవీలు జరిగాయి. క్రితం ఏడాది మొదటి మూడు నెలల కాలంలోని లీజింగ్ 138 లక్షల ఎస్‌ఎఫ్‌టీతో పోల్చి చూస్తే 15 శాతం వృద్ధి నమోదైంది. దేశ, విదేశీ కంపెనీల నుంచి బలమైన డిమాండ్ కనిపించింది.
పట్టణాల వారీగా లీజింగ్..
→ హైదరాబాద్‌లో 17 లక్షల చదరపు అడుగుల లీజింగ్ లావాదేవీలు జరిగాయి. క్రితం ఏడాది మొదటి మూడు నెలల్లో లీజింగ్ 29 లక్షలతో పోల్చి చూస్తే 41 శాతం తగ్గినట్టు తెలుస్తోంది.
→ కోల్‌కతాలోనూ క్రితం ఏడాది మొదటి త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 50 శాతం తక్కు వగా లక్ష ఎస్‌ఎఫ్‌టీ లీజింగ్ లావాదేవీలే జరిగాయి.
→ బెంగళూరులో స్థూల లీజింగ్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 13 శాతం వృద్ధితో 45 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది.
→ చెన్నై మార్కెట్లో ఆఫీస్ లీజింగ్ ఏకంగా 93 శాతం పెరిగింది. 29 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాలను కంపెనీలు లీజుకు తీసుకున్నాయి.
→ ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 32 శాతం అధికంగా 33 లక్షల ఎస్‌ఎఫ్‌టీ లీజింగ్ నమోదైంది. క్రితం ఏడాది తొలి క్వార్టర్‌లో లీజింగ్ 25 లక్షల చదరపు అడుగులుగా ఉంది.
→ పుణెలో 12 లక్షల చదరపు అడుగుల లీజింగ్ నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజింగ్ 8 లక్షల ఎస్‌ఎఫ్‌టీతో పోలి్చతే 50 శాతం పెరగడం గమనార్హం.
→ ఏడు నగరాల్లో మొత్తం 159 లక్షల ఎస్‌ఎఫ్‌టీ లీజింగ్‌లో 137 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాలను కార్పొరేట్ కంపెనీలు తీసుకున్నాయి. ఇందులోనూ 75 శాతం మేర టెక్నాలజీ కంపెనీలు, బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలు, ఇంజనీరింగ్, తయారీ రంగ కంపెనీలు తీసుకున్నవే.
→ మిగిలిన 22 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాలను కోవర్కింగ్ ఆపరేటర్లు లీజుకు తీసుకున్నారు. వీరు తిరిగి చిన్న కంపెనీలకు సబ్ లీజింగ్‌కు ఇస్తుంటారు.
2025లో బలమైన డిమాండ్..
‘‘కీలక మార్కెట్లో గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ లీజింగ్ బలంగా ఉంది. కార్పొరేట్ కంపెనీల విస్తరణతోపాటు దేశీయ వృద్ధి ఆశావహంగా ఉండడంతో వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెరుగుతున్నాయి’’అని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్విసెస్ ఎండీ అరి్పత్ మెహరోత్రా తెలిపారు. ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ 2025 అంతటా కొనసాగుతుందని అంచనా వేశారు. టెక్నాలజీ, ఇంజనీరింగ్, తయారీ, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాల్లో కంపెనీల విస్తరణ ప్రణాళికలు ఇందుకు మద్దతుగా నిలుస్తాయని అంచనా వేశారు.