collieries
-
ఇళ్ల ధరలు 12 శాతం అప్
న్యూఢిల్లీ: దేశీయంగా హైదరాబాద్ సహా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇళ్ల ధరలు సగటున 12 శాతం పెరిగాయి. ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో అత్యధికంగా 30 శాతం ఎగిశాయి. రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్, ప్రాపర్టీ కన్సల్టెంట్ కోలియర్స్, డేటా అనలిటిక్స్ సంస్థ లైజాస్ ఫోరాస్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం వార్షిక ప్రాతిపదికన జూన్ త్రైమాసికంలో ఎనిమిది ప్రధాన నగరాలకు గాను ఏడు నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయి. ‘గత కొద్ది త్రైమాసికాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో బుల్ రన్ కొనసాగుతోంది. టాప్ 8 నగరాల్లో నమోదవుతున్న లావాదేవీల పరిమాణం, హౌసింగ్‌పై సానుకూల సెంటిమెంట్ దీన్ని ధృవీకరిస్తోంది. డిమాండ్‌కి మాత్రమే పరిమితం కాకుండా ప్రాధాన్య అసెట్ క్లాస్‌గా ప్రజలు రియల్ ఎస్టేట్ వైపు మళ్లుతుండటమనేది హౌసింగ్ ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది‘ అని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ తెలిపారు. రేట్లు పెరిగినప్పటికీ పలు నగరాల్లో అమ్మకాలు కూడా పెరిగినట్లు లైజాస్ ఫోరాస్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కపూర్ వివరించారు. గత కొద్ది త్రైమాసికాలుగా హౌసింగ్‌కు డిమాండ్ మెరుగ్గా ఉంటోందని కోలియర్స్ ఇండియా సీఈవో బాదల్ యాగి్నక్ పేర్కొన్నారు. అదే సమయంలో వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటం, ఇటీవల బడ్జెట్లో సానుకూల ప్రతిపాదనలు చేయడం మొదలైనవి హౌసింగ్ మార్కెట్‌కి ఊతమిచ్చినట్లు వివరించారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. → హైదరాబాద్‌లో హౌసింగ్ ధరలు 7 శాతం పెరిగాయి. చ.అ.కు రేటు రూ. 10,530 నుంచి రూ. 11,290కి చేరింది. → బెంగళూరులో 28 శాతం వృద్ధితో ధరలు రూ. 8,688 నుంచి రూ. 11,161కి చేరాయి. → చెన్నైలో పెద్దగా మార్పులు లేకుండా చ.అ. రేటు రూ. 7,690 స్థాయిలోనే ఉంది. → ఢిల్లీ–ఎన్సీఆర్లో అత్యధికంగా 30 శాతం పెరిగి రూ. 8,652 నుంచి రూ. 11,279కి చేరింది. → ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల ధరలు చ.అ.కి 6 శాతం పెరిగి రూ. 19,111 నుంచి రూ. 20,275కి చేరాయి. → కోల్‌కతాలో 7 శాతం వృద్ధి చెంది రూ. 7,315 నుంచి రూ. 7,745కి చేరాయి. → పుణెలో రెసిడెన్షియల్ ప్రాపరీ్టల రేట్లు 13% పెరిగి రూ. 9,656కి చేరాయి. → అహ్మదాబాద్‌లో ఇళ్ల ధరలు 13% వృద్ధితో రూ. 6,507 నుంచి రూ. 7,335కి పెరిగాయి. -
డేటా సెంటర్ల జోరు!
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది నగరాల్లో డేటా సెంటర్ల జోరు కొనసాగుతోంది. గ్లోబల్ డేటా సెంటర్లకు చిరునామాగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహాకాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాల పెట్టుబడులు, డిజిటల్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ డేటా సెంటర్ల వృద్ధికి ప్రధాన కారణాలు. ప్రస్తుతం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 47 లక్షల చ.అ.ల్లో 213 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. మరో 27 లక్షల చ.అ.ల్లో 186 మెగావాట్లు నిర్మాణ దశలో, 24 లక్షల చ.అ.ల్లో 168 మెగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయని కొల్లియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యంలో 35 ఆక్యుపెన్సీ బ్యాకింగ్, ఆర్ధిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) విభాగానిదే. ఆ తర్వాత 30 శాతం ఐటీ రంగం, 20% క్లౌడ్ సర్వీస్ విభాగం, ఇతరుల వాటా 15 శాతంగా ఉంది. డేటా సెంటర్ల నెలవారీ చార్జీలు కిలోవాట్‌కు రూ.6,650 నుంచి 8,500లుగా ఉన్నాయి. చెన్నై, బెంగళూరులో.. జలాంతర్గామి కేబుల్ కనెక్టివిటీని అందించే వ్యూహాత్మక తీర ప్రాంతం కారణంగా చెన్నై ప్రధాన డేటా సెంటర్ హబ్‌గా మారింది. ప్రస్తుతం చెన్నైలో 17 లక్షల చ.అ.ల్లో 87 మెగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లు ఉన్నాయి. మరో 23 లక్షల చ.అ.ల్లో 156 మెగావాట్లు నిర్మాణంలో ఉండగా.. 16 లక్షల చ.అ.ల్లో 104 మెగావాట్లు ప్రణాళికలో ఉంది. అనుకూల వాతావరణం, మెరుగైన విద్యుత్ మౌలిక సదుపాయాలు వంటివి చెన్నైని డేటా సెంటర్ల పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చాయి. సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ప్రస్తుతం 20 లక్షల చ.అ.ల్లో 79 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లున్నాయి. మరో లక్ష చ.అ.ల్లో 10 మెగావాట్లు నిర్మాణంలో, 3 లక్షల చ.అ.ల్లో 26 మెగావాట్లు పైప్‌లైన్‌లో ఉన్నాయి. బలమైన సాంకేతిక నైపుణ్యం, నిపుణుల లభ్యత బెంగళూరు డేటా సెంటర్ల మార్కెట్‌కు చోదకశక్తిగా నిలుస్తున్నాయి. 5జీ, ఐఓటీతో డిమాండ్.. 5జీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), క్లౌడ్ సర్వీస్‌లు, ఎంటర్‌ప్రైజ్‌ల డిజిటలైజేషన్ పెరుగుదల కారణంగా డేటా సెంటర్ల డిమాండ్ మరింత పెరుగుతుందని కొల్లియర్స్ ఇండియా అడ్వైజరీ సర్వీసెస్ హెడ్ స్వాప్నిల్ అనిల్ అభిప్రాయపడ్డారు. 2030 నాటికి దక్షిణాది నగరాల్లో డేటా సెంటర్ల సామర్థ్యంలో 80 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేశారు. రాయితీలు, పన్ను ప్రోత్సాహకాలు.. ప్రత్యేకమైన డేటా సెంటర్ పాలసీలు పెట్టుబడిదారులకు స్పష్టమైన, నిర్మాణాత్మక కార్యాచరణకు దోహదపడతాయి. దీంతో ఆయా నగరాల్లో పెట్టుబడుల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణలో గణనీయమైన రాయితీలు, విద్యుత్ టారీఫ్‌లలో తగ్గుదల, గణనీయమైన పన్ను మినహాయింపులు దక్షిణ భారతదేశంలో డేటా సెంటర్ల పెట్టుబడుల ఆకర్షణకు ప్రధాన కారణాలని చెప్పొచ్చు. విద్యుత్, టెలికమ్యూనికేషన్స్ మౌలిక వసతుల్లో పెట్టుబడులు అధిక వేగం, విశ్వసనీయతను నిర్ధారిస్తుంది. ఇది డేటా సెంటర్ల కార్యకలాపాలకు కీలక అంశం. సరళీకృత విధానాలు, వేగవంతమైన అనుమతి ప్రక్రియలు, బ్యూరోక్రాట్స్ నియంత్రణల తగ్గింపులు వంటివి డేటా సెంటర్లను ప్రోత్సహిస్తున్నాయి.హైదరాబాద్‌లో 47 మెగావాట్లు.. ప్రభుత్వ విధానాలు, మెరుగైన మౌలిక వసతులు, కనెక్టివిటీ కారణంగా హైదరాబాద్‌లో డేటా సెంటర్ల జోరు కొనసాగుతోంది. అత్యంత వేగంగా నగరం డేటా సెంటర్ల హాట్‌స్పాట్‌గా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం భాగ్యనగరంలో 10 లక్షల చ.అ.ల్లో 47 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉండగా.. మరో 3 లక్షల చ.అ.ల్లో 20 మెగావాట్లు నిర్మాణంలో, 5 లక్షల చ.అ.ల్లో 38 మెగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో మైక్రోసాఫ్ట్, సీటీఆర్ఎల్ఎస్ వంటి పలు సంస్థలు డేటా సెంటర్లున్నాయి. గచ్చిబౌలి, మేకగూడ, షాద్‌నగర్, చందన్‌వ్యాలీ వంటి పలు ప్రాంతాల్లో మరిన్ని డేటా సెంటర్లు రానున్నాయి. -
హైదరాబాద్‌లో ఆఫీస్ లీజు జోరు
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో కార్యాలయ స్థలాలకు (ఆఫీస్ స్పేస్) మెరుగైన డిమాండ్ నెలకొంది. ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ కాలంలో 57 శాతం పెరిగి 2.9 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన పట్టణాల్లో ఆఫీస్ స్పేస్ లీజు మార్కెట్ 92 శాతం వృద్ధిని ఇదే కాలంలో నమోదు చేసింది. స్థూల ఆఫీస్ స్పేస్ లీజు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 10.5 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) నుంచి 20.2 మిలియన్ ఎస్ఎఫ్టీకి పెరిగింది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా వెల్లడించింది. ఇక డిసెంబర్ త్రైమాసికంలో బలమైన డిమాండ్ మద్దతుతో 2023 మొత్తం మీద ఆరు పట్టణాల్లో ఆఫీస్ స్పేస్ లీజు 16 శాతం వృద్ధితో రూ.58.2 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. పునరుద్ధరించుకున్న లీజులు, ఆసక్తి వ్యక్తీకరించిన వాటిని స్థూల ఆఫీస్ స్పేస్ లీజులో మినహాయించారు. పట్టణాల వారీగా.. ► బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజు 58 శాతం పెరిగి 5.5 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజు పరిమాణం 3.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ► చెన్నై మార్కెట్లో నాలుగు రెట్ల వృద్ధితో మిలియన్ ఎస్ఎఫ్టీ నుంచి 4.3 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. ► ఢిల్లీ ఎన్సీఆర్లో లీజు 61 శాతం పెరిగి 3.1 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ► ముంబై మార్కెట్లో ఏకంగా 87 శాతం పెరిగి 2.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. ► పుణెలో ఆఫీస్ స్పేస్ లీజు డిమాండ్ రెట్టింపై 2 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. డిమాండ్ కొనసాగుతుంది.. ‘‘భారత ఆఫీస్ మార్కెట్ ఆరంభ అనిశి్చతులను అధిగమించడమే కాదు, అంచనాలను మించి విజయాన్ని సాధించింది. 2023లో 58 మిలియన్ ఎస్ఎఫ్టీ మేర లీజు నమోదైంది. ఇది 2024 సంవత్సరంలో ఆఫీస్ మార్కెట్ ఆశావహంగా ప్రారంభమయ్యేందుకు మార్గం వేసింది. అనూహ్య సంఘటనలు జరిగినా, స్థిరమైన ఆర్థిక వృద్ధి అంచనాలు భారత వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు అనుకూలించనున్నాయి. దేశ, విదేశీ కంపెనీల నుంచి ఆఫీస్ స్పేస్ కోసం ఆసక్తి కొనసాగుతూనే ఉంటుంది’’అని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సరీ్వసెస్ హెడ్, ఎండీ అరి్పత్ మెహరోత్రా పేర్కొన్నారు. 2023లో ఆఫీస్ స్పేస్ లీజులో టెక్నాలజీ రంగం వాటా 25 శాతానికి తగ్గిందని, ఇది 2020లో 50 శాతంగా ఉన్నట్టు కొలియర్స్‌ఇండియా నివేదిక తెలిపింది. బీఎఫ్ఎస్ఐ, ఇంజనీరింగ్, తయారీ రంగాల నుంచి డిమాండ్ రెట్టింపైందని.. 2020లో వీటి వాటా 10–12 శాతంగా ఉంటే, 2023లో 16–20 శాతానికి పెరిగినట్టు పేర్కొంది. ఇంజనీరింగ్, తయారీ రంగ కంపెనీల నుంచి లీజు డిమాండ్ 26 శాతానికి చేరుకుంది. ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్ల నుంచి డిమాండ్ 24 శాతం పెరిగి 8.7 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. -
డేటా సెంటర్లలోకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో దేశీయంగా డేటా సెంటర్లలోకి దాదాపు 10 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇంటర్నెట్ యాక్సెస్ గణనీయంగా మెరుగుపడటంతో స్టోరేజీ సామర్థ్యాలకు డిమాండ్ పెరగడం, క్లౌడ్ కంప్యూటింగ్.. ఐవోటీ.. 5జీ వినియోగం, ప్రభుత్వం చేపట్టిన డిజిటైజేషన్ ప్రక్రియ మొదలైనవి ఇందుకు దోహదపడనున్నాయి. పరిశ్రమల సమాఖ్య సీఐఐ, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘కోవిడ్ మహమ్మారి అనంతరం భారత డేటా సెంటర్ మార్కెట్ భారీగా వృద్ధి చెందింది. 2020 నుంచి మొత్తం 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించింది. గ్లోబల్ డేటా సెంటర్ ఆపరేటర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఈ మేరకు ఇన్వెస్ట్ చేశాయి‘ అని నివేదిక పేర్కొంది. 2023 ఆగస్టు ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా ఏడు నగరాల్లో 1.1 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 819 మెగావాట్ల మేర సామర్థ్యాలతో డేటా సెంటర్లు ఉన్నాయి. 2026 నాటికి విస్తీర్ణం 2.3 కోట్ల చ.అ.కు, సామర్థ్యం 1800 మెగావాట్లకు చేరుతుందని నివేదిక అంచనా వేసింది. కొత్తగా అందుబాటులోకి రాబోయే డేటా సెంటర్ సామర్థ్యాల్లో సగ భాగం ముంబైలోనే ఉండొచ్చని పేర్కొంది. మెరుగైన రాబడుల కోసం ఇన్వెస్టర్ల ఆసక్తి.. స్థిరమైన ఆదాయం, మెరుగైన రాబడు లు పొందేందుకు డేటా సెంటర్లపై పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నట్లు నివేదిక వివరించింది. డేటా సెంటర్ల ఏర్పాటు కోసం ఆపరేటర్లతో అంతర్జాతీయంగా సంస్థాగత ఇన్వెస్టర్లు, డెవలపర్లు చేతులు కలుపుతున్నారు. సైట్ల కొరత ఉన్న మార్కెట్లలో డెవలపర్లు భవిష్యత్ ప్రాజెక్టుల కోసం ముందుగానే స్థలాన్ని సమకూర్చుకుని ల్యాండ్ బ్యాంకింగ్ వ్యూహాలను అమలు చేస్తున్నట్లు నివేదిక వివరించింది. -
ఆఫీస్ స్పేస్ లీజింగ్ తగ్గొచ్చు
న్యూఢిల్లీ: కార్యాలయ స్థలాల (ఆఫీస్ స్పేస్) లీజు ఈ ఏడాదిలో 20 శాతం క్షీణించి 40 మిలియన్ చదరపు అడుగులకు (ఎస్ఎఫ్టీ) పరిమితం కావొచ్చని కొలియర్స్ ఇండియా నివేదిక తెలిపింది. కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తుండడం ఇందుకు కారణమని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఆరు ప్రముఖ పట్టణాలపై వివరాలతో కూడిన నివేదికను గురువారం విడుదల చేసింది. స్థూలంగా ఆఫీస్ స్పేస్ లీజు 2023లో 40–45 మిలియన్ ఎస్ఎఫ్టీ మధ్య ఉండొచ్చని, క్రితం ఏడాదిలో ఇది 50.3 మిలియన్ చదరపు అడుగులుగా ఉందని తెలిపింది. కాకపోతే ఈ ఏడాది మార్చిలో వేసిన అంచనా కంటే ఎక్కువే ఉంటున్నట్టు పేర్కొంది. ఇక ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో (జూన్ వరకు) 24.7 మిలియన్ ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ లీజు నమోదైంది. ద్వితీయ ఆరు నెలల్లో (డిసెంబర్ వరకు) మరో 15.3–20.3 మిలియన్ చదరపు అడుగుల మధ్య ఉంటుందని అంచనా వేసింది. స్థూల లీజు పరిమాణంలో రెన్యువల్స్‌ను కలపలేదు. వెలుపలి డిమాండ్ బలహీనంగా ఉన్నప్పటికీ, బలమైన ఆర్థిక కార్యకలాపాలు ఆఫీస్ స్పేస్ లీజు ఈ మాత్రం మెరుగ్గా ఉండడానికి మద్దతుగా నిలిచినట్టు వివరించింది. ‘‘జనవరి–మార్చి మధ్య 10.1 మిలియన్ ఎస్ఎఫ్టీ మేర కార్యాలయ స్థలాలు భర్తీ అయ్యాయి. తర్వాతి మూడు నెలల కాలంలో ఇది మరింత పుంజుకున్నది. ఏప్రిల్–జూన్ మధ్య 14.6 మిలియన్ చదరపు అడుగులు మేర లీజు నమోదైంది. త్రైమాసికం వారీగా చూస్తే 46 శాతం పుంజుకున్నది’’అని కొలియర్స్ ఇండియా వివరించింది. పట్టణాల వారీగా.. బెంగళూరులో అత్యధికంగా 12–14 మిలియన్ ఎస్ఎఫ్టీ కార్యాలయ స్థలాల లీజు నమోదైంది. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో 9–11 మిలియన్ ఎస్ఎఫ్టీ, చెన్నైలో 7–9 మిలియన్ చదరపు అడుగుల మేర కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. హైదరాబాద్, ముంబై, పుణె మార్కెట్లలో ఇది 4–6 మిలియన్ చదరపు అడుగుల మధ్య ఉంది. సరఫరాకు తగ్గట్టు లీజు పరిమాణం నమోదు అవుతుండడం, ఖాళీ స్థలాలు ఫ్లాట్‌గానే ఉండడం వల్ల అద్దెలు పెరిగే అవకాశం ఉన్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది. ఆఫీస్ స్పేస్ డిమాండ్ మృదువుగా ఉన్నప్పటికీ, ఫ్లెక్సిబుల్ వర్క్స్పేసెస్కు డిమాండ్ స్థిరంగా కొనసాగుతున్నట్టు ఈ విభాగంలో సేవలు అందించే అర్బన్వోల్ట్ సహ వ్యవస్థాపకుడు అమల్ మిశ్రా తెలిపారు. -
డేటా సెంటర్స్‌కు రూ.81,247 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోని డేటా సెంటర్స్ 2020 నుంచి రూ.81,247 కోట్ల పెట్టుబడులను అందుకున్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా తెలిపింది. ‘డేటా వినియోగం పెరుగుతుండడంతో ఇటువంటి కేంద్రాలకు డిమాండ్ అధికం అయింది. పైగా అనేక రాష్ట్రాలు అందించే సబ్సిడీ స్థలం, స్టాంప్ డ్యూటీ మినహాయింపు మొదలైన ప్రోత్సాహకాలతో డేటా సెంటర్ ఆపరేటర్లు ఉత్సాహంగా ఉన్నారు. అనుకూలమైన ప్రభుత్వ విధానాలతో గత 2–3 ఏళ్లలో ఈ రంగంలో పెట్టుబడులు పెరిగాయి. ప్రస్తుతం డేటా సెంటర్లు 1.03 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొలువుదీరాయి. 2025 నాటికి ఇది రెండంతలు కానుంది. హైదరాబాద్‌సహా ఏడు ప్రధాన నగరాల్లో డేటా సెంటర్ల సామర్థ్యం 770 మెగావాట్లకు చేరుకుంది. దాదాపు సగం డేటా కేంద్రాలు ముంబైలో కొలువుదీరాయి. విజయవాడ వంటి నగరాల్లోనూ ఇటువంటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రధాన సంస్థలు భావిస్తున్నాయి’ అని వివరించింది. -
ఆఫీస్ లీజింగ్ పెరిగింది
న్యూఢిల్లీ: కార్యాలయాల లీజింగ్ స్థలం పెరిగిందని రియల్టీ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా తెలిపింది. ‘ఆరు ప్రధాన నగరాల్లో 2022 ఏప్రిల్–జూన్‌లో స్థూలంగా 1.47 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలోని స్థలాన్ని ఆఫీసులు లీజుకు తీసుకున్నాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది రెండున్నర రెట్లకు పైమాటే. ఈ ఏడాది జనవరి–జూన్‌లో ఆఫీస్ లీజింగ్ రెండున్నర రెట్లు అధికమై 2.75 కోట్ల చదరపు అడుగులకు చేరింది. డిసెంబర్‌కల్లా ఇది 4–4.5 కోట్ల చదరపు అడుగులకు చేరుకోవచ్చని అంచనా. డిమాండ్ పెరగడంతో అద్దెలు సైతం దూసుకెళ్తాయి. హైదరాబాద్ మార్కెట్లో ఏప్రిల్–జూన్‌లో స్థూల లీజింగ్ స్థలం 23 లక్షల చదరపు అడుగులకు చేరింది. 2021 ఏప్రిల్–జూన్‌లో ఇది 7 లక్షల చదరపు అడుగులు. జనవరి–జూన్‌లో ఇది 11 లక్షల నుంచి 45 లక్షల చదరపు అడుగులకు ఎగసింది’ అని కొలియర్స్ వివరించింది. -
రియల్టీలో టెక్నాలజీకి డిమాండ్
న్యూఢిల్లీ: ప్రాపర్టీ టెక్నాలజీ (ప్రాప్‌టెక్) సంస్థల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఇది ప్రాప్‌టెక్ సంస్థలకు అవకాశాలను విస్తృతం చేయనుంది. ఈ దృష్యా పెట్టుబడులకు ఇవి ఆకర్షణీయంగా మారాయి. 2025 నాటికి ఈ కంపెనీల్లో వార్షిక పెట్టుబడులు బిలియన్ డాలర్లకు (రూ.7,700 కోట్లు) చేరుకోవచ్చని సీఐఐ, కొలియర్స్ సంస్థలు అంచనా వేశాయి. 2020లో ప్రాప్ టెక్నాలజీ సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడులు 551 మిలియన్ డాలర్లు(రూ.4,242 కోట్లు)గా ఉన్నాయి. సీఐఐ, కొలియర్స సంయుక్తంగా ‘రియల్ ఎస్టేట్ 3.0: టెక్నాలజీ లెడ్ గ్రోత్’ పేరుతో ఓ నివేదికను విడుదల చేశాయి. కరోనా మహమ్మారి రియల్ ఎస్టేట్ రంగంలో టెక్నాలజీ వినియోగాన్ని పెంచేందుకు దారితీసినట్టు తెలిపింది. ఈ టెక్నాలజీ సాయంతోనే ఉన్న చోట నుంచే రిమోట్‌గా పనిచేసేందుకు వీలు పడిందని పేర్కొంది. టెక్నాలజీ వినియోగం ఎన్నో రెట్లు.. ‘‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను కరోనాకు పూర్వం వినియోగించారు. అయితే ఈ తరహా టెక్నాలజీల వినియోగం గడిచిన రెండు సంవత్సరాల్లో ఎన్నో రెట్లు పెరిగింది’’ అని ఈ నివేదిక వెల్లడించింది. ఆరోగ్యంపై దృష్టితో స్మార్ట్ బిల్డింగ్ మెటీరియల్స్, వాయు నాణ్యతను ఆటోమేటెడ్‌గా ఉంచే సిస్టమ్స్ వినియోగం పెరిగినట్టు తెలిపింది. ఏఐ, వీఆర్, ఐవోటీ, బ్లాక్ చైన్ రియల్ ఎస్టేట్ వ్యాపార ముఖచిత్రాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేసింది. 5జీ టెక్నాలజీ అమల్లోకి వస్తే బిల్డింగ్ మేనేజ్మెంట్ మరింత సమర్థవంతగా మారుతుందని పేర్కొంది. భారత రియల్ ఎస్టేట్ రంగాన్ని టెక్నాలజీ మరింత పారదర్శకంగా మారుస్తుందని అంచనా వేసింది. ఆవిష్కరణలు ఘనం.. ప్రాపర్టీ రంగంలో టెక్నాలజీ ఆవిష్కరణలు ఇంతకుముందు ఎన్నడూ లేనంత స్థాయిలో ఉన్నట్టు ఈ నివేదిక తెలియజేసింది. ప్రణాళిక దగ్గర్నుంచి, డిజైన్, నిర్మాణంగ టెక్నిక్‌లు, వసతుల నిర్వహణ, పాపర్టీ నిర్వహణ వరకు అన్ని విభాగాల్లోకి టెక్నాలజీ ప్రవేశించినట్టు తెలిపింది. ఈ మార్పుల నేపథ్యంలో వచ్చే కొన్నేళ్లలో ప్రాప్‌టెక్ బాగా వృద్ధిని చూస్తుందని అంచనా వేసింది. కాకపోతే గోప్యత, డేటా భద్రత, కొనుగోలుదారులు, నిర్మాణదారులపై పడే వ్యయాలు, విద్యుత్ సరఫరాపై ఎక్కువగా ఆధారపడాల్సి రావడం ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో టెక్నాలజీల అమలుకు ఉన్న సవాళ్లుగా పేర్కొంది. ‘‘మాన్యువల్‌గా కార్మికులకు డిమాండ్ తగ్గడంతో కొందరికి ఉపాధి నష్టం కలగొచ్చు. అదే సమయంలో ప్రత్యేకమైన కార్మికులకు డిమాండ్ పెరుగుతుంది’’అని తెలిపింది. రియల్ ఎస్టేట్‌లో టెక్నాలజీ వినియోగం వల్ల వ్యయాలు తగ్గుతాయని, ఆస్తి విలువ పెరుగుతుందని రెలోయ్ వ్యవస్థాపకుడు అఖిల్ సరాఫ్ అన్నారు. -
రెండేళ్లలో కో–లివింగ్ రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: గతేడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో కో–లివింగ్ మార్కెట్ తీవ్రంగా దెబ్బతింది. దశల వారీగా విద్యా సంస్థలు, కార్యాలయాలు పునఃప్రారంభం కావటం, రికార్డ్ స్థాయిలో వ్యాక్సినేషన్ చేరుకోవటంతో దేశీయ కో–లివింగ్ మార్కెట్ క్రమంగా రికవరీ అయింది. దీంతో వచ్చే రెండేళ్లలో దేశీయ కో–లివింగ్ మార్కెట్ రెట్టింపు అవుతుందని కొలియర్స్ అడ్వైజరీ అంచనా వేసింది. ఈ ఏడాది నాల్గో త్రైమాసికంలో 60 శాతం ఆక్యుపెన్సీకి చేరుకోవటంతో ఈ విభాగం శరవేగంగా కోలుకుందని పేర్కొంది. ఈ ఏడాది వ్యవస్థీకృత రంగంలో 2.10 లక్షల బెడ్స్ ఉండగా.. 2024 నాటికి రెట్టింపు వృద్ధి రేటుతో 4.50 లక్షల పడకలకు చేరుతుందని అంచనా వేసింది. కోవిడ్ నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోవటం, వర్క్ ఫ్రం హోమ్, వలసల నేపథ్యంలో ఆర్ధిక పరిస్థితులు అనిశ్చితిలోకి వెళ్లిపోయాయి. దీంతో కో–లివింగ్ మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావం పడింది. ఈ ఏడాది మేలో 11.84 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు నవంబర్ నాటికి 7 శాతం క్షీణించింది. కరోనా సమయంలోనూ ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు నియామకాలను పెంచడంతో కో–లివింగ్ మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొందని కొలియర్స్ ఇండియా ఎండీ అండ్ సీఈఓ రమేష్ నాయర్ తెలిపారు. ఉద్యోగ నియామకాలలో వృద్ధి, పట్టణాలకు వలసలు, విద్యార్థుల సంఖ్య పెరగడం, అసంఘటితక రంగంలో కో–లివింగ్ నమూనా వృద్ధి వంటివి ఈ పరిశ్రమ డిమాండ్ పెరిగిందని వివరించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో కో–లివింగ్ ఆక్యుపెన్సీ 45–50 శాతం, ఈ ఏడాది నాల్గో త్రైమాసికంలో 60–70 శాతానికి చేరిందని పేర్కొన్నారు. మధ్యలో సెకండ్ వేవ్ ప్రచారం కారణంగా రెండో త్రైమాసికంలో ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గిందన్నారు. సంప్రదాయ నివాస సముదాయాలలో 2–3 శాతం ఆదాయంతో పోలిస్తే కో–లివింగ్ మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు. -
రియల్టీలో పీఈ పెట్టుబడుల భారీ క్షీణత
న్యూఢిల్లీ: భారత రియల్ ఎస్టేట్‌లో 2020 జనవరి–ఆగస్టు మధ్య ప్రైవేటు ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు భారీగా పడిపోయాయి. 2019 ఇదే కాలంతో పోల్చిచూస్తే ఈ విభాగంలో ఇన్వెస్ట్మెంట్ 85 శాతం పడిపోయి 866 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.6,500 కోట్లు)గా నమోదయ్యింది. 2019 ఇదే కాలంలో ఈ పెట్టుబడుల విలువ 5,795 మిలియన్ డాలర్లు. అసలే మందగమనంలో ఉన్న రియల్టీ రంగాన్ని కరోనా మహమ్మారి ప్రేరిత అంశాలు మరింత దెబ్బతీశాయి. కోలియర్స్ ఇంటర్నేషనల్, ఫిక్కీ నివేదిక ఒకటి ఈ విషయాన్ని తెలిపింది. ‘భవిష్యత్ భారత్: ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడులు, వ్యూహాత్మక చర్యలు’ అన్న పేరుతో రూపొందిన ఈ నివేదికలోని ముఖ్యాంశాలను చూస్తే... ► మొత్తం పెట్టుబడుల్లో గరిష్టంగా 46 శాతాన్ని డేటా సెంటర్స్ విభాగం ఆకర్షించింది. ► ఆఫీస్ సెగ్మెంట్ విషయంలో ఇది 24 శాతంగా ఉంది. విలువలో దాదాపు రూ.1,500 కోట్లు. ► ఇండస్ట్రియల్ విభాగం వాటా 12 శాతం. ► ఆతిధ్య రంగం వాటా 9 శాతం. ► హౌసింగ్, రెంటల్ హౌసింగ్ విభాగానిది 8 శాతం అయితే, కో–లివింగ్ వాటా ఒకశాతం. ► కోవిడ్–19 నేపథ్యంలో ఇటు దేశీయ, అటు విదేశీ ఇన్వెస్టర్లు భారత్ రియల్టీలో పెట్టుబడుల పట్ల అత్యంత జాగరూకతను ప్రదర్శిస్తున్నారు. ► పారిశ్రామిక, రవాణా విభాగాలకు సంబంధించి రియల్టీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. దేశంలో ఉన్న వినియోగ డిమాండ్ ఆయా విభాగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ► క్లౌడ్ కంప్యూటింగ్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడులకు డేటా సెంటర్లపై దృష్టి సారిస్తే, ప్రతిఫలాలు ఉంటాయి. ► చౌక ధరలు, ఒక మోస్తరు ఖర్చుతో నిర్మిస్తున్న నివాసాలకు సంబంధించిన ప్రాజెక్టులపై పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ► ఆతిధ్య రంగం, రిటైల్ రియల్ ఎస్టేట్ విభాగాల్లో అవకాశాలను ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చు. ► రియల్టీలో మందగమనం ఉన్నప్పటికీ, మున్ముందు పుంజుకునే అవకాశం ఉంది. -
సింగరేణి సిరుల గని
► 2015-16లో లాభాలు రూ.1,020 కోట్లు ► సంక్షోభంలోనూ మెరుగైన పనితీరు ► అంతర్జాతీయంగా భారీగా పతనమైన బొగ్గు ధరలు ►టన్ను ధర 110 డాలర్ల నుంచి 40 డాలర్లకు తగ్గుదల ► పనితీరు మెరుగుపర్చుకోవడం, ఉత్పత్తి వ్యయం తగ్గింపుతో లాభాలు ► వార్షిక పురోగతి నివేదికను వెల్లడించిన సంస్థ సీఎండీ శ్రీధర్ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా బొగ్గు ధరలు పతనమైనా, క్లిష్ట పరిస్థితులు నెలకొన్నా.. సింగరేణి సంస్థ సిరులు కురిపిస్తోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.1,020 కోట్ల లాభాలను ఆర్జించింది. ఈ వివరాలను సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ శుక్రవారం సంస్థ ప్రధాన కార్యాలయంలో వెల్లడించారు. ‘‘అంతర్జాతీయ విపణిలో బొగ్గు ధరలు 110 డాలర్ల నుంచి 40 డాలర్లకు పతనమయ్యాయి. ధరల పతనం కొనసాగి టన్ను బొగ్గు 30 డాలర్లకు చేరే సూచనలున్నాయి. తక్కువ ధరకే నాణ్యమైన విదేశీ బొగ్గు లభిస్తుండడంతో నాణ్యత, ధరలు సింగరేణికి సవాలుగా మారాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం సంస్థ 15 శాతం వృద్ధితో 2015-16లో 60.3 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి రూ.1,020 కోట్ల లాభాలను ఆర్జించింది..’’ అని చెప్పారు. ఉత్పత్తి వ్యయాన్ని 12 శాతం తగ్గించుకున్నామని, నాణ్యత కోసం ఔట్సోర్సింగ్ విధానంలో కొత్తగా 21 కోల్ వాషరీలను నెలకోల్పబోతున్నామని తెలిపారు. సంస్థ టర్నోవర్ రూ.14వేల కోట్ల నుండి రూ.16వేల కోట్లకు పెరిగిందన్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక జెన్కోలకు బొగ్గు సరఫరాను 39 మిలియన్ టన్నుల నుంచి 47.4 మిలియన్ టన్నులకు పెంచామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,151 కోట్లు, కేంద్రానికి రూ.2,500 కోట్లు కలిపి రూ.4,651 కోట్లు పన్నులు, రాయల్టీలు చెల్లించామన్నారు. సింగరేణి నిర్వహిస్తున్న 31 భూగర్భ గనుల్లో 30 గనులు రూ.1,300 కోట్లు నష్టాలను చవిచూశాయని... అయితే 16 ఓపెన్ కాస్ట్ గనుల నుంచి వచ్చిన లాభాలతో వాటిని అధిగమించామని తెలిపారు. ఇక 2016-17లో 66 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం పెట్టుకున్నామని శ్రీధర్ చెప్పారు. రూ.20వేల కోట్ల పెట్టుబడితో ఐదేళ్లలో 25 కొత్త గనులను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. అందులో ఈ ఏడాది ఏడింటిని ప్రారంభిస్తామన్నారు. మరో 56 ఏళ్లకు సరిపడా బొగ్గు నిక్షేపాలు సింగరేణి గనుల్లో ఉన్నాయన్నారు. యంత్రాల ధరలు పెరగడం వల్లే దిగుమతి చేసుకునే యంత్రాల ధరలు పెరగడంతో జైపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన బాయిలర్, టర్బైన్, జనరేటర్(బీటీజీ) ప్యాకేజీ అంచనా వ్యయాన్ని పెంచాల్సి వచ్చిందని శ్రీధర్ వివరించారు. మే నాటికి జైపూర్ నుంచి 1,200 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామన్నారు. 600 మెగావాట్ల ప్రతిపాదిత మూడో యూనిట్‌ను సబ్ క్రిటికల్ లేక సూపర్ క్రిటికల్ బాయిలర్ పరిజ్ఞానంతో నిర్మించాలా? అన్నది సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారని తెలిపారు. బొగ్గు విక్రయాలకు సంబంధించి తెలంగాణ జెన్కో నుంచి రూ.2 వేల కోట్లు, ఏపీ జెన్కో నుంచి రూ.1,500 కోట్లు, కర్ణాటక జెన్కో నుంచి రూ.600 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు.