ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ తగ్గొచ్చు | Office space leasing may fall 20percent to 40 million sq feet | Sakshi
Sakshi News home page

ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ తగ్గొచ్చు

Published Sat, Aug 26 2023 5:25 AM | Last Updated on Sat, Aug 26 2023 5:25 AM

Office space leasing may fall 20percent to 40 million sq feet - Sakshi

న్యూఢిల్లీ: కార్యాలయ స్థలాల (ఆఫీస్‌ స్పేస్‌) లీజు ఈ ఏడాదిలో 20 శాతం క్షీణించి 40 మిలియన్‌ చదరపు అడుగులకు (ఎస్‌ఎఫ్‌టీ) పరిమితం కావొచ్చని కొలియర్స్‌ ఇండియా నివేదిక తెలిపింది. కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తుండడం ఇందుకు కారణమని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఆరు ప్రముఖ పట్టణాలపై వివరాలతో కూడిన నివేదికను గురువారం విడుదల చేసింది.

స్థూలంగా ఆఫీస్‌ స్పేస్‌ లీజు 2023లో 40–45 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ మధ్య ఉండొచ్చని, క్రితం ఏడాదిలో ఇది 50.3 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉందని తెలిపింది. కాకపోతే ఈ ఏడాది మార్చిలో వేసిన అంచనా కంటే ఎక్కువే ఉంటున్నట్టు పేర్కొంది. ఇక ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో (జూన్‌ వరకు) 24.7 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ ఆఫీస్‌ స్పేస్‌ లీజు నమోదైంది. ద్వితీయ ఆరు నెలల్లో (డిసెంబర్‌ వరకు) మరో 15.3–20.3 మిలియన్‌ చదరపు అడుగుల మధ్య ఉంటుందని అంచనా వేసింది.

స్థూల లీజు పరిమాణంలో రెన్యువల్స్‌ను కలపలేదు. వెలుపలి డిమాండ్‌ బలహీనంగా ఉన్నప్పటికీ, బలమైన ఆర్థిక కార్యకలాపాలు ఆఫీస్‌ స్పేస్‌ లీజు ఈ మాత్రం మెరుగ్గా ఉండడానికి మద్దతుగా నిలిచినట్టు వివరించింది. ‘‘జనవరి–మార్చి మధ్య 10.1 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ మేర కార్యాలయ స్థలాలు భర్తీ అయ్యాయి. తర్వాతి మూడు నెలల కాలంలో ఇది మరింత పుంజుకున్నది. ఏప్రిల్‌–జూన్‌ మధ్య 14.6 మిలియన్‌ చదరపు అడుగులు మేర లీజు నమోదైంది. త్రైమాసికం వారీగా చూస్తే 46 శాతం పుంజుకున్నది’’అని కొలియర్స్‌ ఇండియా వివరించింది.  

పట్టణాల వారీగా..
బెంగళూరులో అత్యధికంగా 12–14 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ కార్యాలయ స్థలాల లీజు నమోదైంది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో 9–11 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ, చెన్నైలో 7–9 మిలియన్‌ చదరపు అడుగుల మేర కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. హైదరాబాద్, ముంబై, పుణె మార్కెట్లలో ఇది 4–6 మిలియన్‌ చదరపు అడుగుల మధ్య ఉంది. సరఫరాకు తగ్గట్టు లీజు పరిమాణం నమోదు అవుతుండడం, ఖాళీ స్థలాలు ఫ్లాట్‌గానే ఉండడం వల్ల అద్దెలు పెరిగే అవకాశం ఉన్నట్టు కొలియర్స్‌ ఇండియా నివేదిక అంచనా వేసింది. ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌ మృదువుగా ఉన్నప్పటికీ, ఫ్లెక్సిబుల్‌ వర్క్‌స్పేసెస్‌కు డిమాండ్‌ స్థిరంగా కొనసాగుతున్నట్టు ఈ విభాగంలో సేవలు అందించే అర్బన్‌వోల్ట్‌ సహ వ్యవస్థాపకుడు అమల్‌ మిశ్రా తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement