
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఆఫీస్ స్పేస్ నికర లీజింగ్ ఏడు ప్రధాన నగరాల్లో 41–49 శాతం వృద్ధి చెందుతుందని జేఎల్‌ఎల్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్, చెన్నై, కోల్‌కత, ముంబై, పుణేలో నికర లీజింగ్ 2021లో 2.62 కోట్ల చదరపు అడుగులు నమోదైంది. 2022లో ఇది 3.7–3.9 కోట్ల చదరపు అడుగులు ఉండే అవకాశం ఉంది. మహమ్మారికి ముందు 2019లో నికర లీజింగ్ ఏకంగా 4.79 కోట్ల చదరపు అడుగులు నమోదైంది. 2022 జనవరి–సెప్టెంబర్‌లో కార్యాలయ స్థలాల నికర లీజింగ్ మూడేళ్ల గరిష్టం 3.03 కోట్ల చదరపు అడుగులుగా ఉంది. ప్రస్తుత సంవత్సరంలో మార్కెట్ అయిదేళ్ల (2015–19) సగటు దిశగా వెళ్తోంది.
వచ్చే ఏడాది సైతం..
నూతనంగా కార్యాలయ స్థలాలను చేజిక్కించుకునే విషయంలో టెక్ కంపెనీల నుంచి డిమాండ్ తగ్గినప్పటికీ, తయారీ, ఆరోగ్య సేవలు, ఫ్లెక్స్ విభాగాల నుంచి పెరిగింది. 2023లోనూ ఇదే ట్రెండ్ ఉంటుంది. వచ్చే ఏడాది ఆఫీస్ స్పేస్ నికర లీజింగ్ 3.7–4 కోట్ల చదరపు అడుగులు నమోదయ్యే చాన్స్ ఉంది. ఇక రెసిడెన్షియల్ విభాగంలో ఈ ఏడాది అమ్మకాలు 2 లక్షల యూనిట్లు దాటే అవకాశం ఉంది. ఇదే జరిగితే దశాబ్దంలో అత్యధిక విక్రయాలు నమోదు కావొచ్చు. 2010లో దేశంలో ఏడు ప్రధాన నగరాల్లో 2.16 లక్షల యూనిట్ల ఇళ్ల అమ్మకాలు జరిగాయి. 2022లో ప్రతి త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు 50,000 యూనిట్లను దాటాయి. గిడ్డంగులు, అసెంబ్లింగ్, విలువ ఆధారిత తయారీ విభాగంలో స్థల డిమాండ్ 2021 కంటే అధికంగా ఈ ఏడాది 4 కోట్ల చదరపు అడుగులు మించనుంది.
Comments
Please login to add a commentAdd a comment