సింగరేణి సిరుల గని | singareni collieries got profit | Sakshi
Sakshi News home page

సింగరేణి సిరుల గని

Published Sat, Apr 2 2016 3:17 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

singareni collieries got profit

► 2015-16లో లాభాలు రూ.1,020 కోట్లు
► సంక్షోభంలోనూ మెరుగైన పనితీరు
► అంతర్జాతీయంగా భారీగా పతనమైన బొగ్గు ధరలు
►టన్ను ధర 110 డాలర్ల నుంచి 40 డాలర్లకు తగ్గుదల 
► పనితీరు మెరుగుపర్చుకోవడం, ఉత్పత్తి వ్యయం తగ్గింపుతో లాభాలు
► వార్షిక పురోగతి నివేదికను వెల్లడించిన సంస్థ సీఎండీ శ్రీధర్

సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా బొగ్గు ధరలు పతనమైనా, క్లిష్ట పరిస్థితులు నెలకొన్నా.. సింగరేణి సంస్థ సిరులు కురిపిస్తోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.1,020 కోట్ల లాభాలను ఆర్జించింది. ఈ వివరాలను సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ శుక్రవారం సంస్థ ప్రధాన కార్యాలయంలో వెల్లడించారు. ‘‘అంతర్జాతీయ విపణిలో బొగ్గు ధరలు 110 డాలర్ల నుంచి 40 డాలర్లకు పతనమయ్యాయి. ధరల పతనం కొనసాగి టన్ను బొగ్గు 30 డాలర్లకు చేరే సూచనలున్నాయి. తక్కువ ధరకే నాణ్యమైన విదేశీ బొగ్గు లభిస్తుండడంతో నాణ్యత, ధరలు సింగరేణికి సవాలుగా మారాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం సంస్థ 15 శాతం వృద్ధితో 2015-16లో 60.3 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి రూ.1,020 కోట్ల లాభాలను ఆర్జించింది..’’ అని చెప్పారు.

ఉత్పత్తి వ్యయాన్ని 12 శాతం తగ్గించుకున్నామని, నాణ్యత కోసం ఔట్‌సోర్సింగ్ విధానంలో కొత్తగా 21 కోల్ వాషరీలను నెలకోల్పబోతున్నామని తెలిపారు. సంస్థ టర్నోవర్ రూ.14వేల కోట్ల నుండి రూ.16వేల కోట్లకు పెరిగిందన్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక జెన్‌కోలకు బొగ్గు సరఫరాను 39 మిలియన్ టన్నుల నుంచి 47.4 మిలియన్ టన్నులకు పెంచామని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,151 కోట్లు, కేంద్రానికి రూ.2,500 కోట్లు కలిపి రూ.4,651 కోట్లు పన్నులు, రాయల్టీలు చెల్లించామన్నారు. సింగరేణి నిర్వహిస్తున్న 31 భూగర్భ గనుల్లో 30 గనులు రూ.1,300 కోట్లు నష్టాలను చవిచూశాయని... అయితే 16 ఓపెన్ కాస్ట్ గనుల నుంచి వచ్చిన లాభాలతో వాటిని అధిగమించామని తెలిపారు. ఇక 2016-17లో 66 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం పెట్టుకున్నామని శ్రీధర్ చెప్పారు. రూ.20వేల కోట్ల పెట్టుబడితో ఐదేళ్లలో 25 కొత్త గనులను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. అందులో ఈ ఏడాది ఏడింటిని ప్రారంభిస్తామన్నారు. మరో 56 ఏళ్లకు సరిపడా బొగ్గు నిక్షేపాలు సింగరేణి గనుల్లో ఉన్నాయన్నారు.

యంత్రాల ధరలు పెరగడం వల్లే
దిగుమతి చేసుకునే యంత్రాల ధరలు పెరగడంతో జైపూర్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన బాయిలర్, టర్బైన్, జనరేటర్(బీటీజీ) ప్యాకేజీ అంచనా వ్యయాన్ని పెంచాల్సి వచ్చిందని శ్రీధర్ వివరించారు. మే నాటికి జైపూర్ నుంచి 1,200 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామన్నారు. 600 మెగావాట్ల ప్రతిపాదిత మూడో యూనిట్‌ను సబ్ క్రిటికల్ లేక సూపర్ క్రిటికల్ బాయిలర్ పరిజ్ఞానంతో నిర్మించాలా? అన్నది సీఎం కేసీఆర్ నిర్ణయిస్తారని తెలిపారు. బొగ్గు విక్రయాలకు సంబంధించి తెలంగాణ జెన్‌కో నుంచి రూ.2 వేల కోట్లు, ఏపీ జెన్‌కో నుంచి రూ.1,500 కోట్లు, కర్ణాటక జెన్‌కో నుంచి రూ.600 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement