సింగరేణి వార్షిక లాభాలు రూ.2,222 కోట్లు | Singareni annual profits are Rs 2222 crore | Sakshi
Sakshi News home page

సింగరేణి వార్షిక లాభాలు రూ.2,222 కోట్లు

Published Sat, Jul 8 2023 5:08 AM | Last Updated on Sat, Jul 8 2023 7:59 AM

Singareni annual profits are Rs 2222 crore - Sakshi

గోదావరిఖని: సింగరేణి ఆల్‌టైం రికార్డ్‌ సిరులు కురిపించింది. సంస్థ చరిత్రలోనే ఈ ఏడాది అత్యధిక లాభాలు ఆర్జించింది. కోల్‌ ఇండియాసహా మహారత్న కంపెనీలన్నింటి కన్నా లాభాల వృద్ధిలో అగ్ర స్థానంలో నిలిచింది. సింగరేణి సంస్థ చరిత్రలోనే అత్యధికంగా ఈ ఆర్థిక సంవత్సరం రూ.33,065 కోట్ల టర్నోవర్‌తో రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించినట్లు సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ శుక్రవారం వెల్లడించారు.

బొగ్గు, విద్యుత్‌ అమ్మకాల ద్వారా మొత్తం రూ.3,074 కోట్ల స్థూల లాభాలను ఆర్జించగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర పన్నుల చెల్లింపుల అనంతరం రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించినట్లు ప్రకటించారు. సింగరేణి చరిత్రలోనే ఇది ఆల్‌టైం రికార్డు అని పేర్కొన్నారు.

గతేడాది రూ.1,227 కోట్ల లాభాలు రాగా, ఈసారి 81 శాతం అధికంగా వచ్చాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం టర్నోవర్‌ రూ.26,585 కోట్లుకాగా, ఈ ఏడాది రూ.33,065 కోట్లు సాధించామని, గతం కన్నా 24 శాతం అధికమని పేర్కొన్నారు. బొగ్గు అమ్మకాల ద్వారా రూ.28,650 కోట్లు, విద్యుత్‌ అమ్మకాల ద్వారా రూ.4,415 కోట్లు గడించినట్లు చెప్పారు.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత అత్యద్భుత వృద్ధి
సింగరేణి సంస్థ తన 134 ఏళ్ల చరిత్రలో తెలంగాణ ఆవిర్భా వం తర్వాత అత్యద్భుత ప్రగతి సాధించిందని శ్రీధర్‌ తెలిపారు. బొగ్గు ఉత్పత్తిలో 33 శాతం, రవాణాలో 39, అమ్మకాల్లో 177 శాతం లాభాలతో 430 శాతం వృద్ధి సాధించిందన్నారు. థర్మల్‌ విద్యుత్‌ ఉత్పాదన ద్వారా గణనీయమైన టర్నోవర్, లాభాలు సాధించిందన్నారు.

కార్మికులు ఉద్యోగులు అంకితభావంతో పని  చేసి కంపెనీని దేశంలోనే అగ్రస్థానంలో నిలి పారని కొని యాడారు. లాభాల ద్వారా సింగరేణి మరిన్ని కొత్త ప్రాజెక్టులు, కార్మికులకు లాభాల్లో వాటా, మరిన్ని సంక్షేమ కార్య క్రమాలు చేపడతామని తెలిపారు. ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలు సాధిస్తే రూ.4 వేల కోట్ల లాభాలు సాధించే అవకాశం ఉందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement