న్యూఢిల్లీ: వచ్చే మూడేళ్లలో దేశీయంగా డేటా సెంటర్లలోకి దాదాపు 10 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇంటర్నెట్ యాక్సెస్ గణనీయంగా మెరుగుపడటంతో స్టోరేజీ సామర్థ్యాలకు డిమాండ్ పెరగడం, క్లౌడ్ కంప్యూటింగ్.. ఐవోటీ.. 5జీ వినియోగం, ప్రభుత్వం చేపట్టిన డిజిటైజేషన్ ప్రక్రియ మొదలైనవి ఇందుకు దోహదపడనున్నాయి. పరిశ్రమల సమాఖ్య సీఐఐ, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
‘కోవిడ్ మహమ్మారి అనంతరం భారత డేటా సెంటర్ మార్కెట్ భారీగా వృద్ధి చెందింది. 2020 నుంచి మొత్తం 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించింది. గ్లోబల్ డేటా సెంటర్ ఆపరేటర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఈ మేరకు ఇన్వెస్ట్ చేశాయి‘ అని నివేదిక పేర్కొంది. 2023 ఆగస్టు ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా ఏడు నగరాల్లో 1.1 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 819 మెగావాట్ల మేర సామర్థ్యాలతో డేటా సెంటర్లు ఉన్నాయి. 2026 నాటికి విస్తీర్ణం 2.3 కోట్ల చ.అ.కు, సామర్థ్యం 1800 మెగావాట్లకు చేరుతుందని నివేదిక అంచనా వేసింది. కొత్తగా అందుబాటులోకి రాబోయే డేటా సెంటర్ సామర్థ్యాల్లో సగ భాగం ముంబైలోనే ఉండొచ్చని పేర్కొంది.
మెరుగైన రాబడుల కోసం ఇన్వెస్టర్ల ఆసక్తి..
స్థిరమైన ఆదాయం, మెరుగైన రాబడు లు పొందేందుకు డేటా సెంటర్లపై పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నట్లు నివేదిక వివరించింది. డేటా సెంటర్ల ఏర్పాటు కోసం ఆపరేటర్లతో అంతర్జాతీయంగా సంస్థాగత ఇన్వెస్టర్లు, డెవలపర్లు చేతులు కలుపుతున్నారు. సైట్ల కొరత ఉన్న మార్కెట్లలో డెవలపర్లు భవిష్యత్ ప్రాజెక్టుల కోసం ముందుగానే స్థలాన్ని సమకూర్చుకుని ల్యాండ్ బ్యాంకింగ్ వ్యూహాలను అమలు చేస్తున్నట్లు నివేదిక వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment