న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సవాళ్లతో కూడుకున్న పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్ ప్రకాశవంతమైన కాంతిపుంజంగా నిలుస్తోందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఒక సర్వే నివేదికలో వెల్లడించింది. ప్రైవేట్ పెట్టుబడులకు దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత అనుకూలంగా ఉందని పేర్కొంది. గత ముప్ఫై రోజులుగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ సర్వే ఫిబ్రవరి తొలి వారంలో పూర్తవుతుందని. ఇప్పటివరకు అందిన వివరాల ఆధారంగా మధ్యంతర నివేదికను రూపొందించినట్లు వివరించింది.
మొత్తం 500 సంస్థలు సర్వేలో పాల్గొంటుండగా.. 300 సంస్థల అభిప్రాయాల ఆధారంగా ప్రస్తుత నివేదిక రూపొందింది. దీని ప్రకారం 79 శాతం సంస్థలు గత మూడేళ్లలో మరింత మంది ఉద్యోగులను తీసుకున్నట్లు వివరించాయి. 75 శాతం సంస్థలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు .. ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో తాము ఇన్వెస్ట్ చేస్తామంటూ 70 శాతం సంస్థలు వెల్లడించిన దాన్ని బట్టి చూస్తే వచ్చే కొద్ది త్రైమాసికాల్లో ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వివరించారు. కీలక వృద్ధి చోదకాలైన ప్రైవేట్ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన సానుకూలంగా కనిపిస్తున్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు స్థిరంగా 6.4–6.7 శాతం స్థాయిలో, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7 శాతం మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: అడుగు పెట్టిన చోటల్లా.. ఆధిపత్యం!
రాబోయే సంవత్సరకాలంలో వచ్చే పెట్టుబడుల ప్రణాళికలతో తయారీ, సేవల రంగాల్లో ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన సగటున వరుసగా 15 నుండి 22 శాతంగా ఉండొచ్చని అంచనా. ఈ రెండు రంగాల్లో పరోక్ష ఉద్యోగాల కల్పన దాదాపు 14 శాతం పెరగవచ్చనే అంచనాలు నెలకొన్నాయి.
సర్వేలో పాల్గొన్న సంస్థల ప్రకారం సీనియర్ మేనేజ్‌మెంట్, మేనేజ్‌మెంట్/సూపర్‌వైజరీ స్థాయిలోని ఖాళీల భర్తీ కోసం 1 నుండి 6 నెలల సమయం పడుతోండగా, రెగ్యులర్.. కాంట్రాక్ట్ వర్కర్లను భర్తీ చేసుకోవడానికి తక్కువ సమయం పడుతోంది.
గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోను సీనియర్ మేనేజ్‌మెంట్, మేనేజీరియల్/సూపర్‌వైజరీ ఉద్యోగులు, రెగ్యులర్ వర్కర్లకు వేతన వృద్ధి సగటున 10 నుండి 20 శాతంగా ఉంటుందని 40–45 శాతం సంస్థలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment