
న్యూఢిల్లీ: కార్యాలయాల లీజింగ్ స్థలం పెరిగిందని రియల్టీ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా తెలిపింది. ‘ఆరు ప్రధాన నగరాల్లో 2022 ఏప్రిల్–జూన్‌లో స్థూలంగా 1.47 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలోని స్థలాన్ని ఆఫీసులు లీజుకు తీసుకున్నాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది రెండున్నర రెట్లకు పైమాటే.
ఈ ఏడాది జనవరి–జూన్‌లో ఆఫీస్ లీజింగ్ రెండున్నర రెట్లు అధికమై 2.75 కోట్ల చదరపు అడుగులకు చేరింది. డిసెంబర్‌కల్లా ఇది 4–4.5 కోట్ల చదరపు అడుగులకు చేరుకోవచ్చని అంచనా. డిమాండ్ పెరగడంతో అద్దెలు సైతం దూసుకెళ్తాయి.
హైదరాబాద్ మార్కెట్లో ఏప్రిల్–జూన్‌లో స్థూల లీజింగ్ స్థలం 23 లక్షల చదరపు అడుగులకు చేరింది. 2021 ఏప్రిల్–జూన్‌లో ఇది 7 లక్షల చదరపు అడుగులు. జనవరి–జూన్‌లో ఇది 11 లక్షల నుంచి 45 లక్షల చదరపు అడుగులకు ఎగసింది’ అని కొలియర్స్ వివరించింది.