
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023లో కొత్తగా 11 షాపింగ్ మాల్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటి మొత్తం విస్తీర్ణం 59.48 లక్షల చదరపు అడుగులు అని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. భారతీయ మార్కెట్లోకి ప్రవేశం, విస్తరించడం కోసం రిటైలర్ల నుండి బలమైన ఆసక్తిని ఇది ప్రతిబింబిస్తోందని వివరించింది.
అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు, వినియోగ విధానాలను మార్చడం, సహాయక వ్యాపార వాతావరణం ఈ వృద్ధికి ఆజ్యం పోసిందని తెలిపింది. ‘ఏడు ప్రధాన నగరాల్లో ఈ మాల్స్ ఏర్పాటయ్యాయి. 2022తో పోలిస్తే గతేడాది కొత్తగా తోడైన రిటైల్ స్పేస్‌లో 72 శాతం వృద్ధి నమోదైంది. 2022లో హైదరాబాద్, పుణే, చెన్నై, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కత నగరాల్లో నూతనంగా 34.49 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎనమిది మాల్స్ ప్రారంభం అయ్యాయి’ అని నివేదిక తెలిపింది.
హైదరాబాద్‌లోనే అధికం..
‘గతేడాది అందుబాటులోకి వచ్చిన మాల్స్‌లో హైదరాబాద్ ఏకంగా మూడు మాల్స్‌ను సొంతం చేసుకుంది. పుణే, చెన్నై రెండు, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరు, అహ్మదాబాద్ ఒక్కొక్కటి చేజిక్కించుకున్నాయి. కోవిడ్ తదనంతరం ఈ నగరాల్లో ఇంత మొత్తంలో రిటైల్ స్పేస్ తోడవడం ఇదే తొలిసారి. రానున్న రోజుల్లో ఈ జోరు కొనసాగుతుంది.
2019లో కొత్తగా సుమారు 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రేడ్–ఏ, బీ–ప్లస్ మాల్స్ తెరుచుకున్నాయి. 2020–22 మధ్య ఏటా సగటున 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రిటైల్ స్పేస్ తోడైంది. కోవిడ్ తదనంతరం చాలా గ్రేడ్–ఏ మాల్స్ ఖాళీ లేక రిటైలర్లు నాణ్యమైన రిటైల్ స్థలం కొరతను ఎదుర్కొన్నారు’ అని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment