న్యూఢిల్లీ: భారత రియల్ ఎస్టేట్‌లో 2020 జనవరి–ఆగస్టు మధ్య ప్రైవేటు ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు భారీగా పడిపోయాయి. 2019 ఇదే కాలంతో పోల్చిచూస్తే ఈ విభాగంలో ఇన్వెస్ట్‌మెంట్ 85 శాతం పడిపోయి 866 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.6,500 కోట్లు)గా నమోదయ్యింది. 2019 ఇదే కాలంలో ఈ పెట్టుబడుల విలువ 5,795 మిలియన్ డాలర్లు. అసలే మందగమనంలో ఉన్న రియల్టీ రంగాన్ని కరోనా మహమ్మారి ప్రేరిత అంశాలు మరింత దెబ్బతీశాయి. కోలియర్స్ ఇంటర్నేషనల్, ఫిక్కీ నివేదిక ఒకటి ఈ విషయాన్ని తెలిపింది. ‘భవిష్యత్ భారత్: ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడులు, వ్యూహాత్మక చర్యలు’ అన్న పేరుతో రూపొందిన ఈ నివేదికలోని ముఖ్యాంశాలను చూస్తే...
► మొత్తం పెట్టుబడుల్లో గరిష్టంగా 46 శాతాన్ని డేటా సెంటర్స్ విభాగం ఆకర్షించింది.
► ఆఫీస్ సెగ్మెంట్ విషయంలో ఇది 24 శాతంగా ఉంది. విలువలో దాదాపు రూ.1,500 కోట్లు.
► ఇండస్ట్రియల్ విభాగం వాటా 12 శాతం.
► ఆతిధ్య రంగం వాటా 9 శాతం.
► హౌసింగ్, రెంటల్ హౌసింగ్ విభాగానిది 8 శాతం అయితే, కో–లివింగ్ వాటా ఒకశాతం.
► కోవిడ్–19 నేపథ్యంలో ఇటు దేశీయ, అటు విదేశీ ఇన్వెస్టర్లు భారత్ రియల్టీలో పెట్టుబడుల పట్ల అత్యంత జాగరూకతను ప్రదర్శిస్తున్నారు.
► పారిశ్రామిక, రవాణా విభాగాలకు సంబంధించి రియల్టీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. దేశంలో ఉన్న వినియోగ డిమాండ్ ఆయా విభాగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
► క్లౌడ్ కంప్యూటింగ్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడులకు డేటా సెంటర్లపై దృష్టి సారిస్తే, ప్రతిఫలాలు ఉంటాయి.
► చౌక ధరలు, ఒక మోస్తరు ఖర్చుతో నిర్మిస్తున్న నివాసాలకు సంబంధించిన ప్రాజెక్టులపై పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి.
► ఆతిధ్య రంగం, రిటైల్ రియల్ ఎస్టేట్ విభాగాల్లో అవకాశాలను ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చు.
► రియల్టీలో మందగమనం ఉన్నప్పటికీ, మున్ముందు పుంజుకునే అవకాశం ఉంది.
రియల్టీలో పీఈ పెట్టుబడుల భారీ క్షీణత
Published Thu, Sep 24 2020 6:45 AM | Last Updated on Thu, Sep 24 2020 6:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment