న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో కార్యాలయ స్థలాలకు (ఆఫీస్ స్పేస్) మెరుగైన డిమాండ్ నెలకొంది. ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ కాలంలో 57 శాతం పెరిగి 2.9 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన పట్టణాల్లో ఆఫీస్ స్పేస్ లీజు మార్కెట్ 92 శాతం వృద్ధిని ఇదే కాలంలో నమోదు చేసింది.
స్థూల ఆఫీస్ స్పేస్ లీజు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 10.5 మిలియన్ చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) నుంచి 20.2 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి పెరిగింది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా వెల్లడించింది. ఇక డిసెంబర్ త్రైమాసికంలో బలమైన డిమాండ్ మద్దతుతో 2023 మొత్తం మీద ఆరు పట్టణాల్లో ఆఫీస్ స్పేస్ లీజు 16 శాతం వృద్ధితో రూ.58.2 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి చేరింది. పునరుద్ధరించుకున్న లీజులు, ఆసక్తి వ్యక్తీకరించిన వాటిని స్థూల ఆఫీస్ స్పేస్ లీజులో మినహాయించారు.
పట్టణాల వారీగా..
► బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజు 58 శాతం పెరిగి 5.5 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజు పరిమాణం 3.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది.
► చెన్నై మార్కెట్లో నాలుగు రెట్ల వృద్ధితో మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ నుంచి 4.3 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి చేరింది.
► ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో లీజు 61 శాతం పెరిగి 3.1 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది.
► ముంబై మార్కెట్లో ఏకంగా 87 శాతం పెరిగి 2.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది.
► పుణెలో ఆఫీస్ స్పేస్ లీజు డిమాండ్ రెట్టింపై 2 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీకి చేరింది.
డిమాండ్ కొనసాగుతుంది..
‘‘భారత ఆఫీస్ మార్కెట్ ఆరంభ అనిశి్చతులను అధిగమించడమే కాదు, అంచనాలను మించి విజయాన్ని సాధించింది. 2023లో 58 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ మేర లీజు నమోదైంది. ఇది 2024 సంవత్సరంలో ఆఫీస్ మార్కెట్ ఆశావహంగా ప్రారంభమయ్యేందుకు మార్గం వేసింది. అనూహ్య సంఘటనలు జరిగినా, స్థిరమైన ఆర్థిక వృద్ధి అంచనాలు భారత వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు అనుకూలించనున్నాయి.
దేశ, విదేశీ కంపెనీల నుంచి ఆఫీస్ స్పేస్ కోసం ఆసక్తి కొనసాగుతూనే ఉంటుంది’’అని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సరీ్వసెస్ హెడ్, ఎండీ అరి్పత్ మెహరోత్రా పేర్కొన్నారు. 2023లో ఆఫీస్ స్పేస్ లీజులో టెక్నాలజీ రంగం వాటా 25 శాతానికి తగ్గిందని, ఇది 2020లో 50 శాతంగా ఉన్నట్టు కొలియర్స్‌ఇండియా నివేదిక తెలిపింది. బీఎఫ్‌ఎస్‌ఐ, ఇంజనీరింగ్, తయారీ రంగాల నుంచి డిమాండ్ రెట్టింపైందని.. 2020లో వీటి వాటా 10–12 శాతంగా ఉంటే, 2023లో 16–20 శాతానికి పెరిగినట్టు పేర్కొంది. ఇంజనీరింగ్, తయారీ రంగ కంపెనీల నుంచి లీజు డిమాండ్ 26 శాతానికి చేరుకుంది. ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్ల నుంచి డిమాండ్ 24 శాతం పెరిగి 8.7 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment