న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ నగరాల్లో ఈ ఏడాది స్థూల ఆఫీస్ స్పేస్ (కార్యాలయ వసతి) డిమాండ్ 80 మిలియన్ చదరపు అడుగులు (ఎస్‌ఎఫ్‌టీ) దాటుతుందని కుష్‌మ్యాన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక తెలిపింది. 2023లో 74 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండడం గమనార్హం. హైదరాబాద్‌తోపాటు, పుణె, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్ నగరాల గణాంకాలు ఈ నివేదికలో ఉన్నాయి.
డీఎల్‌ఎఫ్ రెంటల్ వ్యాపారం ఎండీ, వైస్ చైర్మన్ శ్రీరామ్ ఖట్టర్ ఈ నివేదికపై స్పందిస్తూ.. భారత్ అంతర్జాతీయంగా పోటీతత్వంతో కూడిన సానుకూల ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నట్టు చెప్పారు. మన దేశంలో యువ, సాంకేతిక నిపుణులు అధిక సంఖ్యలో ఉన్నారని, వీరు నాణ్యమైన రియల్ ఎస్టేట్‌ను కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ అనుకూలతలు అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తున్నట్టు పేర్కొన్నారు.
విశ్వసనీయత కలిగిన డెవలపర్ల నుంచి గ్రేడ్–ఏ ఆఫీస్ వసతుల కోసం అంతర్జాతీయ కంపెనీలు చూస్తున్నట్టు ఖట్టర్ తెలిపారు. 2024 మొదటి ఆరు నెలల్లో 41.9 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ ఆఫీస్ స్పేస్ లీజింగ్ నమోదైందని.. బహుళజాతి కంపెనీల నుంచి తాజా డిమాండ్ ఇందుకు తోడైనట్టు ఈ నివేదిక వెల్లడించింది. ద్వితీయ ఆరు నెలల్లోనూ ఇదే ధోరణి ఉంటుందని, మరో 40 మిలియన్ చదరపు అడుగుల మేర ఆఫీస్ స్పేస్ లీజింగ్ నమోదు కావచ్చని అంచనా వేసింది.
గ్రేడ్ ఏ డిమాండ్ డౌన్..
గ్రేడ్ ఏ ఆఫీస్ వసతుల లీజింగ్ ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 0.40 శాతం తగ్గి 17.7 శాతంగా ఉంది. 2021 చివరి మూడు నెలల కాలం తర్వాత ఇంత తక్కువ లీజింగ్ తిరిగి మళ్లీ ఇదే కావడం గమనార్హం. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఐటీ–బీపీఎం రంగం అత్యధికంగా 26 శాతం మేర స్థూల ఆఫీస్ వసతుల డిమాండ్‌ను ఆక్రమించింది. ఆ తర్వాత బీఎఫ్‌ఎస్‌ఐ రంగం రెండో స్థానంలో ఉంది.
‘‘భారత ఆఫీస్ లీజింగ్ మార్కెట్ రికార్డు స్థాయి డిమాండ్‌ను చూస్తోంది. బలమైన ఆర్థిక మూలాలు, అత్యాధునిక డిజిటల్ సాంకేతికత, కార్యాలయాలకు వచ్చి పనిచేసే ఉద్యోగులు పెరగడం, కరోనా కాలంలో వాయిదా పడిన విస్తరణ ప్రణాళికలు అమల్లోకి రావడం ఇవన్నీ డిమాండ్‌ను నడిపిస్తున్నాయి’’అని టెనెంట్ రిప్రజెంటేషన్ ఎండీ వీరబాబు తెలిపారు. దేశీయ కంపెనీల నుంచి డిమాండ్ స్థిరంగా ఉండగా, అంతర్జాతీయ కంపెనీలను సైతం భారత ఆర్థిక వ్యవస్థ ఆకర్షిస్తున్నట్టు చెప్పారు.
దీంతో 2024 మొదటి ఆరు నెలల్లో లీజింగ్ కార్యకలాపాలు జోరుగా సాగినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది ఆఫీస్ లీజింగ్ కొత్త రికార్డులను నమోదు చేయవచ్చన్నారు. విభిన్నమైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు, టెక్నాలజీ అనుకూల వాతావరణం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం.. ఇవన్నీ గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాల (జీసీసీ) ఏర్పాటుకు వీలు కల్పిస్తున్నట్టు టెనెంట్ రిప్రజెంటేషన్ ఇండియా సీఈవో అన్షుల్ జైన్ తెలిపారు. కేవలం టెక్నాలజీయే కాకుండా దాదాపు అన్ని రంగాల నుంచి ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ నెలకొన్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment