హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షాపింగ్ మాల్స్, ప్రముఖ హై స్ట్రీట్‌లలో రిటైల్ స్థలం లీజుకు ఇవ్వడం 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య ఎనిమిది ప్రధాన నగరాల్లో దాదాపు 5 శాతం పెరిగిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. ఈ కాలంలో టాప్–8 నగరాల్లోని గ్రేడ్–ఏ మాల్స్, ప్రధాన హై స్ట్రీట్‌లలో లీజుకు తీసుకున్న రిటైల్ స్థలం 5.53 మిలియన్ చదరపు అడుగులు. గతేడాది ఇదే కాలంలో 5.29 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం నమోదైంది.
ఈ నగరాల జాబితాలో ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్ ఉన్నాయి. హై స్ట్రీట్‌లలో రిటైల్ స్థలాన్ని లీజుకు ఇవ్వడం గతేడాదితో పోలిస్తే 3.44 మిలియన్ చదరపు అడుగుల నుండి 3.82 మిలియన్ చదరపు అడుగులకు దూసుకెళ్లింది. మరోవైపు షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్థలం 1.85 మిలియన్ చదరపు అడుగుల నుండి 1.72 మిలియన్ చదరపు అడుగులకు వచ్చి చేరింది.
హైదరాబాద్‌లోని ప్రముఖ హై–స్ట్రీట్ కేంద్రాలు రిటైల్ స్థలానికి బలమైన డిమాండ్‌ను నమోదు చేశాయి. ఈ నగరంలో వివిధ బ్రాండ్లు 2024 జనవరి–సెప్టెంబర్ కాలంలో 1.72 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నాయి. గతేడాది ఇదే కాలంలో ఇది 1.60 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఈ వృద్ధి రిటైల్ రంగం బలంగా పుంజుకోవడం, నూతన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. కరోనా మహమ్మారి తదనంతరం అభివృద్ధి చెందుతున్న వినియోగదారు ప్రవర్తనతో, ఆకర్షణీయ, అనుభవపూర్వక స్థలాలకు స్పష్టమైన డిమాండ్ ఉందని నివేదిక వివరించింది.
ప్రీమియం రిటైల్ స్థలాలకు డిమాండ్..
ప్రధాన నగరాల్లో మాల్ లీజింగ్ కార్యకలాపాలు స్థిరంగా పెరగడం రిటైల్ రంగం యొక్క బలమైన పునరుద్ధరణ, విస్తరణను నొక్కి చెబుతోందని లులు మాల్స్ తెలిపింది. ఈ సానుకూల ధోరణి రిటైల్ భాగస్వాముల కోసం అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తూ వినియోగదారుల ప్రాధాన్యతలను అభివృద్ధి చేసే ప్రపంచ–స్థాయి రిటైల్ అనుభవాలను సృష్టించే తమ కంపెనీ దృష్టికి అనుగుణంగా ఉంటుందని వివరించింది.
మాల్స్, ప్రధాన వీధుల్లో బలమైన లీజింగ్ కారణంగా భారత రిటైల్ రియల్ ఎస్టేట్ వృద్ధి చెక్కుచెదరకుండా ఉందని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ క్యాపిటల్ మార్కెట్స్ ఎండీ, రిటైల్–ఇండియా హెడ్ సౌరభ్ షట్‌డాల్ తెలిపారు. విచక్షణతో కూడిన వ్యయాలు పెరగడం, వినియోగదారుల ప్రాధాన్యత.. వెరశి ప్రీమియం రిటైల్ స్థలాలకు డిమాండ్‌ను పెంచుతున్నాయని ఆయన తెలిపారు. ‘భారత్ మరింత ఎక్కువ లావాదేవీల పరిమణాలను చవిచూడాలంటే ప్రధాన నగరాల్లో నాణ్యమైన రిటైల్ స్పేస్‌ల అభివృద్ధిని వేగవంతం చేయాలి. ఎందుకంటే ఇది తమ వ్యాపారాలను విస్తరించాలని చూస్తున్న ప్రపంచ రిటైలర్లకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment